Begin typing your search above and press return to search.

లోకేశ్ 2.0.. ట్రోల్స్ నుంచి తిరుగులేని వరకు..

విసిరిన రాళ్లనే పునాది రాళ్లుగా మార్చుకోవడం కొందరికే సాధ్యం అవుతుంది. విమర్శించే నోళ్లే ప్రశంసించేలా ఎదగడంలోనే అసలైన విజయం ఉంటుంది.

By:  Tupaki Political Desk   |   23 Jan 2026 12:23 PM IST
లోకేశ్ 2.0.. ట్రోల్స్ నుంచి తిరుగులేని వరకు..
X

విసిరిన రాళ్లనే పునాది రాళ్లుగా మార్చుకోవడం కొందరికే సాధ్యం అవుతుంది. విమర్శించే నోళ్లే ప్రశంసించేలా ఎదగడంలోనే అసలైన విజయం ఉంటుంది. టీడీపీ యువనేత, మంత్రి నారా లోకేష్‌కు ఈ మాట అచ్చుగుద్దినట్లుగా సరిపోతుంది. ట్రోల్స్, బాడీ షేమింగ్‌తో ప్రత్యర్థులు కుంగదీయాలని చూసినా.. తన అద్భుత పనితీరుతో ప్రత్యర్థులకు దీటైన సమాధానం చెప్పారు లోకేష్. ఇవాళ నారా లోకేష్ బర్త్‌డే. దీంతో ఆయన రాజకీయ ప్రస్థానంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. టీడీపీ కూడా లోకేష్ పుట్టినరోజును చాలా పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా లోకేష్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ లోకేశ్ 2.0పై చర్చించుకుంటున్నారు.

ప్రస్తుతం మంత్రిగా ఏపీ రాజకీయాల్లో కేంద్ర బిందువుగా ఉన్న నారా లోకేష్‌ రాజకీయ ప్రయాణం అంత ఆషామాషీగా సాగలేదు. ప్రపంచ ప్రఖ్యాత స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏ, కార్నెగీ మెలన్ లో బ్యాచిలర్స్ పూర్తి చేసిన ఉన్నత విద్యావంతుడు ఆయన. వరల్డ్ బ్యాంక్‌లో పని చేసిన అనుభవం,హెరిటేజ్ సంస్థను లాభాల బాటలో నడిపించిన ట్రాక్ రికార్డ్ ఆయన సొంతం. అలాంటి కార్పొరేట్ లగ్జరీ లైఫ్‌ను వదులుకుని, తాత, తండ్రి అడుగుజాడల్లో ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి వచ్చారు. 2014లో తెరవెనుక వ్యూహకర్తగా మొదలై, ఆ తర్వాత ఎమ్మెల్సీగా, మంత్రిగా ఆయన ప్రయాణం ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్. ఐతే గడిచిన ఐదేళ్ల కాలం లోకేష్‌ను ఓ పూర్తి స్థాయి పొలిటిషీయన్‌గా మార్చింది.

ప్రత్యర్థుల అంచనాలను తలకిందులు చేస్తూ యువగళం పాదయాత్రతో ప్రజల నాడి పట్టుకున్నారు. ఎండ, వాన అనకుండా వేల కిలోమీటర్లు నడిచి, ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకున్నారు. ఈ పాదయాత్రే లోకేష్‌లోని పోరాట పటిమను ప్రపంచానికి పరిచయం చేసింది. గడిచిన రెండేళ్లలో లోకేష్‌ తనను తాను నిరూపించుకున్నారు.ప్రధాని మోదీ సైతం నారా లోకేష్‌ను పలుమార్లు ప్రత్యేకంగా అభినందించారు. ఒకప్పుడు కేవలం చంద్రబాబు తనయుడిగా మాత్రమే తెలిసిన లోకేష్, ఇవాళ నేషనల్ పాలిటిక్స్‌లో కీ ప్లేయర్‌గా ఎదిగారు.

NDA కూటమిలో టీడీపీ ప్రాధాన్యత పెరగడంలో లోకేష్ వ్యూహాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సాక్షాత్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోకేష్ విజన్‌ను, పనితీరును ప్రత్యేకంగా అభినందించారు. ఏపీ అభివృద్ధిపై లోకేష్ చూపిన చొరవ, సబ్జెక్ట్ నాలెడ్జ్ జాతీయ నేతల దృష్టిని ఆకర్షించింది.గతంలో ఆయన మంత్రిగా ఉన్నప్పుడే HCL, కియా వంటి దిగ్గజాలు ఏపీకి వచ్చాయి. ఇప్పుడు మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే..TCSను విశాఖకు తీసుకురావడంలో సక్సెస్‌ అయ్యారు. ప్రతిష్టాత్మక గూగుల్ డేటా సెంటర్‌ పెట్టుబడిని తీసుకువచ్చి చీఫ్ జాబ్ క్రియేటర్‌గా పేరు సంపాదించుకున్నారు. రాబోయే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా..స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే కొత్త నినాదంతో అంతర్జాతీయ కంపెనీలను ఏపీకి క్యూ కట్టేలా చేస్తున్నారు.

విద్యాశాఖ మంత్రిగా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు విద్యార్థి లోకానికి కొత్త ఆశలను కల్పిస్తున్నాయి. నిరుద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న మెగా డీఎస్సీ ఫైలుపై తొలి సంతకం చేయడం ద్వారా తన చిత్తశుద్ధిని చాటుకున్నారు. నిరుద్యోగుల్ని టీచర్లుగా మార్చి... వారికి ఆత్మబంధువుగా మారారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, సిలబస్‌లో మార్పులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు.గతంలో లోకేష్‌ను అవహేళన చేసిన నేతలే ఇవాళ ఆయన పేరు వింటే వణికిపోతున్నారు. లోకేష్‌ తీసుకువచ్చిన రెడ్‌బుక్‌ సంచలనం. చట్టాన్ని అతిక్రమించి ఇబ్బంది పెట్టిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టేది లేదని, ప్రతి ఒక్కరి పేరును అందులో నమోదు చేస్తున్నామని ఆయన చేసిన హెచ్చరిక ప్రత్యర్థుల గుండెల్లో వణుకు పుట్టిస్తోంది.

ఇవాళ మనం చూస్తున్నది పాత లోకేష్‌ను కాదు.. లోకేష్ 2.0ని. మాటల్లో స్పష్టత, పనిలో వేగం, ఆలోచనలో పరిణితి ఆయనలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. అటు పార్టీని, ఇటు ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటూ భవిష్యత్ నాయకుడిగా తనను తాను నిరూపించుకుంటున్నారు. తండ్రి చాటు బిడ్డ అనే స్థాయి నుంచి, రాష్ట్రాన్ని నడిపించే సత్తా ఉన్న తిరుగులేని నాయకుడిగా లోకేష్‌ ఎదిగిన తీరు యువతకు స్ఫూర్తి. హ్యాపీ బర్త్‌ డే లోకేష్‌.