Begin typing your search above and press return to search.

హంటా వైరస్ కలకలం: అంతర్జాతీయ ప్రయాణాల్లో పొంచి ఉన్న ముప్పు!

ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి జ్ఞాపకాలు ఇంకా మ‌ర్చిపోక ముందే మరో ప్రమాదకర వైరస్ ఇప్పుడు ప్రపంచ దేశాలను కలవరపెడుతోంది.

By:  Sivaji Kontham   |   8 May 2026 10:40 AM IST
హంటా వైరస్ కలకలం: అంతర్జాతీయ ప్రయాణాల్లో పొంచి ఉన్న ముప్పు!
X

ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి జ్ఞాపకాలు ఇంకా మ‌ర్చిపోక ముందే మరో ప్రమాదకర వైరస్ ఇప్పుడు ప్రపంచ దేశాలను కలవరపెడుతోంది. అర్జెంటీనా నుండి బయలుదేరిన 'ఎంవి హోండియస్' అనే డచ్ క్రూయిజ్ షిప్‌లో హంటావైరస్ (ఆండీస్ రకం) వెలుగుచూడటం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ నౌకలో 23 దేశాలకు చెందిన ప్రయాణికులు ఉండగా.. అప్పటికే వైరస్ బారిన పడిన పది మందిలో ముగ్గురు మరణించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ మరణాల రేటు ప్రతి ముగ్గురిలో ఒకరికి అన్నట్లుగా ఉండటం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.

ముఖ్యంగా ఈ షిప్‌లో ఇద్ద‌రు భారతీయ నావికులు ఉన్నారనే వార్త భారత్‌లో కలకలం రేపుతోంది. వారి ఆరోగ్య పరిస్థితిపై స్పష్టమైన సమాచారం బయటకు రాకపోవడం ఆందోళనను మరింత పెంచుతోంది. ఒకవేళ ఈ నౌక తీరానికి చేరిన తర్వాత ఆ 23 దేశాలకు చెందిన ప్రయాణికులు తమ స్వదేశాలకు విస్తరిస్తే పరిస్థితి ఏంటన్నది ఇప్పుడు ప్రధాన ప్రశ్న. సాధారణంగా ఎలుకల ద్వారా మనుషులకు సోకే ఈ హంటావైరస్.. కరోనా కంటే ప్రమాదకరమైనదని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అయితే మన దేశం గతంలో నిఫా వంటి వైరస్‌లను సమర్థవంతంగా ఎదుర్కొన్న అనుభవం ఉండటం కొంత ఊరటనిచ్చే అంశం.

వైరస్ మూలాలను పరిశీలిస్తే.. అర్జెంటీనా, ఉరుగ్వే, చిలీ వంటి దేశాలలో పక్షులపై అధ్యయనం చేయడానికి వెళ్లిన యాత్రికులకు మొదట ఈ వైరస్ సోకినట్లు సమాచారం. ఈ 'ఆండీస్ వైరస్' రకానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇది కేవలం ఎలుకల నుంచే కాకుండా... మనుషుల నుండి మనుషులకు కూడా పరిమితంగా వ్యాపించే సామర్థ్యం కలిగి ఉంటుంది. ఈ వైరస్ పొదిగే కాలం ఆరు వారాల వరకు ఉండటం వల్ల.. రాబోయే రోజుల్లో మరిన్ని కొత్త కేసులు వెలుగుచూసే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరిస్తోంది.

ప్రస్తుతం ఈ షిప్ అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా స్పెయిన్ వైపు ప్రయాణిస్తోంది. వైద్య‌ నిపుణులు ఇప్పటికే రంగంలోకి దిగి నౌకలోనే ఐసోలేషన్, శానిటైజేషన్ వంటి చర్యలు చేపట్టారు. అయితే అంతర్జాతీయ పర్యాటక రంగం వేగంగా విస్తరిస్తున్న తరుణంలో ఇలాంటి ముప్పులను అరికట్టడానికి అంతర్జాతీయ ఆరోగ్య నియమాలలో (ఐహెచ్ఆర్) సమూల మార్పులు అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. విమానాశ్రయాల్లో కేవలం ప్రాథమిక తనిఖీలే కాకుండా... వైరస్ పొదిగే కాలం ముగిసే వరకు ప్రయాణికులను డిజిటల్ పద్ధతిలో పర్యవేక్షించే నిబంధనలు తీసుకురావాలి.

పర్యాటక రంగాన్ని కాపాడుకుంటూనే ప్రజారోగ్య భద్రతను నిర్ధారించడానికి దేశాల మధ్య పారదర్శకమైన సమాచార మార్పిడి అత్యవసరం. ఏవైనా అసాధారణ అనారోగ్య లక్షణాలు కనిపించినప్పుడు పర్యాటక సంస్థలు వెంటనే నివేదించేలా కఠిన చట్టాలు ఉండాలి. అలాగే వైరస్‌లకు రాజకీయాలు తెలియవు కాబట్టి అత్యవసర సమయాల్లో దేశాల మధ్య ఐక్యత మాత్రమే బలమైన ఆయుధంగా మారుతుంది. సాంకేతికతను వాడుకుంటూ ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను బలోపేతం చేయడం ద్వారానే భవిష్యత్తులో ఇలాంటి వైరస్ కల్లోలాల నుండి ప్రపంచాన్ని కాపాడుకోగలం.

ఈ ల‌క్ష‌ణాలు చెక్ చేసుకోండి:

వైర‌స్ ల‌క్ష‌ణాలు ప‌రిశీలిస్తే.. క‌రోనా త‌ర‌హాలోనే జ్వ‌రం ద‌గ్గు అల‌స‌ట కండ‌రాల నొప్పి ల‌క్ష‌ణాలు రోగిలో క‌నిపిస్తాయి. ఊపిరి తిత్తుల్లో నీరు చేరుతుంది. ఈ కేసులు పెర‌గ‌క ముందే క‌రోనా క్రైసిస్ స‌మ‌యంలో చేప‌ట్టిన‌ట్టే ముంద‌స్తు జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం ముఖ్యం.