మాల్దీవులకు భారత్ సరికొత్త కానుక
భారత ప్రభుత్వం అందించిన ఆర్థిక, సాంకేతిక సహకారంతో మాల్దీవుల్లో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన హనిమాధూ అంతర్జాతీయ విమానాశ్రయం మంగళవారం నవంబర్ 10, 2025న ఘనంగా ప్రారంభమైంది.
By: A.N.Kumar | 11 Nov 2025 12:10 PM ISTపొరుగు దేశాలకు అభివృద్ధిలో తోడుగా నిలవాలన్న భారతదేశ సంకల్పం మరోసారి కార్యరూపం దాల్చింది. భారత ప్రభుత్వం అందించిన ఆర్థిక, సాంకేతిక సహకారంతో మాల్దీవుల్లో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన హనిమాధూ అంతర్జాతీయ విమానాశ్రయం మంగళవారం నవంబర్ 10, 2025న ఘనంగా ప్రారంభమైంది.
ఈ ముఖ్యమైన ప్రాజెక్ట్‌ను మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు మరియు భారత పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సంయుక్తంగా ప్రారంభించారు. భారత్-మాల్దీవుల మధ్య దౌత్య సంబంధాలు 60 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో, ఈ విమానాశ్రయం ఇరు దేశాల స్నేహబంధానికి, సహకారానికి బలమైన ప్రతీకగా నిలిచింది.
* ఆర్థిక పరివర్తనకు చిహ్నమన్న ముయిజ్జు
ప్రారంభోత్సవ సభలో మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు మాట్లాడుతూ హనిమాధూ ఎయిర్‌పోర్ట్‌ను కేవలం ఒక విమానాశ్రయంగా కాకుండా దేశ 'ఆర్థిక పరివర్తనకు చిహ్నం'గా అభివర్ణించారు. ప్రపంచంతో మాల్దీవులను అనుసంధానం చేసే ఒక ముఖ్యమైన గేట్‌వే ఇది. ముఖ్యంగా దేశ ఉత్తర అటాల్స్ ప్రాంతంలో పర్యాటక రంగం, వాణిజ్యం , సామాజిక అభివృద్ధిని ఇది మరింత ముందుకు తీసుకువెళుతుంది" అని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తి కావడంలో భారత ప్రభుత్వం అందించిన ‘లైన్ ఆఫ్ క్రెడిట్’ సహకారాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించి, భారతదేశానికి కృతజ్ఞతలు తెలిపారు.
* భారత 'నైబర్‌హుడ్ ఫస్ట్' విధానానికి నిదర్శనం
ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడం ద్వారా పొరుగు దేశాల శ్రేయస్సు పట్ల భారత్‌కున్న నిబద్ధత మరోసారి రుజువైంది. దీనిపై మాల్దీవుల్లోని భారత్ హైకమిషన్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ ఈ కొత్త విమానాశ్రయం "పురోగతి, శ్రేయస్సుకు చిహ్నం" అని పేర్కొంది. "పొరుగు దేశాలకు ప్రాధాన్యం ఇచ్చే భారత్ 'నైబర్‌హుడ్ ఫస్ట్' విధానం.. అలాగే 'సాగర్ విజన్' లో భాగస్వామ్య దేశాలకు భద్రత, అభివృద్ధి కల్పించాలన్న నిబద్ధతకు ఇది సజీవ నిదర్శనం." అని పేర్కొన్నాడు.
* పర్యాటక రంగం, వాణిజ్యానికి మరింత బలం
నిపుణుల విశ్లేషణ ప్రకారం, హనిమాధూ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం ఉత్తర మాల్దీవుల ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపునివ్వనుంది. ఈ ప్రాంతానికి అంతర్జాతీయ విమాన సేవలు అందుబాటులోకి రావడంతో, ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు నేరుగా ఇక్కడికి చేరుకునే అవకాశం లభిస్తుంది. ఇది వాణిజ్య కార్యకలాపాలు, మత్స్య పరిశ్రమ , ఇతర వ్యాపార రంగాలకు కొత్త మార్గాలను తెరుస్తుంది. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలను, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఈ ప్రాజెక్ట్ మరింత బలోపేతం చేయనుంది.
భారత్ అందించిన సుమారు $800 మిలియన్ల లైన్ ఆఫ్ క్రెడిట్‌లో భాగమైన ఈ విమానాశ్రయ అభివృద్ధి ప్రాజెక్టు, మాల్దీవుల మౌలిక సదుపాయాల అభివృద్ధిలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది.
