Begin typing your search above and press return to search.

హ‌మాస్-ఇజ్రాయెల్ యుద్ధానికి రెండేళ్లు.. సంధి-శాంతి సాధ్య‌మా?

2023 అక్టోబ‌రు 7.. ఇజ్రాయెల్ లోకి చొచ్చుకెళ్లిన హ‌మాస్ మిలిటెంట్లు.. మార‌ణ‌హోమం సాగించారు. క‌నిపించినవారిని క‌నిపించిన‌ట్లు కాల్చేశారు. 1,200 మంది ప్రాణాలు బ‌లిగొన్నారు.

By:  Tupaki Political Desk   |   6 Oct 2025 9:20 AM IST
హ‌మాస్-ఇజ్రాయెల్ యుద్ధానికి రెండేళ్లు.. సంధి-శాంతి సాధ్య‌మా?
X

2023 అక్టోబ‌రు 7.. ఇజ్రాయెల్ లోకి చొచ్చుకెళ్లిన హ‌మాస్ మిలిటెంట్లు.. మార‌ణ‌హోమం సాగించారు. క‌నిపించినవారిని క‌నిపించిన‌ట్లు కాల్చేశారు. 1,200 మంది ప్రాణాలు బ‌లిగొన్నారు. ఆపై 250 మందిని బందీలుగా త‌మ వెంట గాజాలోకి తీసుకెళ్లారు. ఇది జ‌రిగి స‌రిగ్గా రెండేళ్లు..! ఈ మ‌ధ్య‌కాలంలో ఏం జరిగింది..? ఈ ప్ర‌శ్న‌కు స‌మాధానం గాజా శిథిల‌మైంది.. త‌మపై హ‌మాస్ దాడి జ‌రిగిన మ‌రుక్ష‌ణ‌మే ఇజ్రాయెల్ ప్ర‌తిదాడి మొద‌లుపెట్టింది.

పిల్ల‌లు, మ‌హిళ‌లు స‌హా దాదాపు 70 వేల మందిపైగా ప్ర‌జ‌ల‌ను బ‌లిగొంది. ఇజ్రాయెల్ ధాటికి ల‌క్ష‌ల మంది గాజాను వ‌దిలివెళ్లారు. ఇప్ప‌టికీ వెళ్తున్నారు. మ‌రిప్పుడు ఏం జ‌ర‌గ‌నుంది...?

ప‌శ్చిమాసియా కాదు.. క‌క్ష‌ల రాజ్యం

భూగోళంపై అత్యంత ఉద్రిక్త ప్రాంతం ఏదంటే అది ప‌శ్చిమాసియానే అని చెప్పాలి. ఒక‌వైపు ఇజ్రాయెల్.. మ‌రోవైపు అర‌బ్ దేశాలు. 80 ఏళ్లుగా ప్రాంతీయ ఘ‌ర్ష‌ణ‌లు... అన్నిటికిమించి పీక్ అన్న‌ట్లు రెండేళ్ల కింద‌ట హ‌మాస్ త‌ల‌పెట్టిన‌ దుస్సాహ‌సం. అప్ప‌టినుంచి ఇజ్రాయెల్ సాగించిన దాడులు..! త‌మ శ‌త్ర‌వును ఎక్క‌డ ఉన్నా చంపేసే ఇజ్రాయెల్.. హ‌మాస్ అగ్ర నాయ‌క‌త్వాన్ని దాదాపు తుడిచిపెట్టింది. కాగా, ఆ మిలిటెంట్ సంస్థ‌కు ఇరాన్, హెజ్బొల్లా, హూతీల నుంచి మ‌ద్ద‌తు ల‌భించింది. వీరంద‌రిపైనా ఇజ్రాయెల్ దాడులు చేసింది. చివ‌ర‌కు త‌ట‌స్థ దేశం ఖ‌త‌ర్ లో స‌మావేశ‌మైన హ‌మాస్ నేత‌ల‌నూ టార్గెట్ చేసింది. ఇదంతా ఒక ఎత్త‌యితే, డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్య‌క్షుడు అయ్యాక ప‌రిస్థితిలో మార్పు వ‌చ్చింది. శాంతి ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రంగా సాగాయి. ఆయ‌న ప్ర‌తిపాదించిన 20 సూత్రాల ప్ర‌ణాళిక‌కు అటు హమాస్ ఇటు ఇజ్రాయెల్ ఒప్పుకోవ‌డం కీల‌క మ‌లుపు.

శాంతి ఒప్పందం సాకార‌మా? నేడు కీల‌కం

ఇజ్రాయెల్-హ‌మాస్ యుద్ధానికి ముగింపు ప‌లికేలా తాజాగా ట్రంప్ సార‌థ్యంలో శాంతి ఒప్పందం బ‌య‌ట‌కు వ‌చ్చింది. దీనికి హ‌మాస్ ఒప్పుకోవాల్సిందేన‌ని లేదంటే న‌ర‌కం చూపిస్తాన‌ని ట్రంప్ హెచ్చ‌రించారు. ఈ నేప‌థ్యంలో హ‌మాస్ స‌రేనంది. రెండేళ్లుగా బందీలుగా పెట్టుకున్న‌వారిని విడుద‌ల చేస్తామ‌ని తెలిపింది. ఇజ్రాయెల్ సైతం గాజా నుంచి త‌మ బ‌ల‌గాల‌ను వెన‌క్కు ర‌ప్పిస్తామ‌ని ప్ర‌క‌టించిన‌ట్లు ట్రంప్ చెప్పారు. ఇక సుల‌భ‌మైనా, క‌ష్ట‌మైనా హమాస్ కు ఆయుధాలు లేకుండా చేస్తామ‌ని, ఇజ్రాయెల్ దే గెలుప‌ని ఆ దేశ ప్ర‌ధాని నెత‌న్యాహూ అంటున్నారు. సోమ‌వారం ఈజిప్ట్ లో హమాస్-ఇజ్రాయెల్ మ‌ధ్య ప‌రోక్ష చ‌ర్చ‌లు జ‌ర‌గ‌నున్నాయి. వీటిలో ఏం తేలుతుంది? అనేది చూడాలి. హ‌మాస్ కు నాలుగు రోజుల‌ ట్రంప్ అల్టిమేటం ఉండ‌గానే.. ఇజ్రాయెల్ శ‌నివారం గాజాపై బాంబులు కురిపించి 20 మందిని చంపేసింది.

గాజాను హ‌మాస్ వ‌దులుకుంటుందా?

పాల‌స్తీనాలో భాగ‌మైన గాజాను హ‌మాస్ 2007 నుంచి త‌మ గుప్పిట్లో పెట్టుకుంది. అత్యంత ప‌టిష్ఠమైన‌ సొరంగాలు నిర్మించి, భారీగా ఆయుధాలు స‌మ‌కూర్చుకుంది. ఈ నేప‌థ్యంలో గాజాలో తాత్కాలిక ప్ర‌భుత్వం ఏర్పాటుకు హ‌మాస్ ఒప్పుకొంది. ఆయుధాల సంగ‌తి మాత్రం తేల్చ‌లేదు. అస‌లు గాజా లేకుంటే హ‌మాస్ లేదు. అలాంటిది ఆ ప్రాంతాన్ని వ‌దులుకోవ‌డం అంటే..? ఏం జ‌రుగుతుందో చూడాలి.

250 మందిలో 48 మంది మిగిలారు..

రెండేళ్ల కింద‌ట ఇజ్రాయెల్ పై దాడిచేసిన హ‌మాస్ విదేశీయులు, ఇజ్రాయెలీలు స‌హా 250 మందిపైగా పౌరుల‌ను బందీలుగా ప‌ట్టుకెళ్లింది. వీరిలో కొంద‌రిని విడుద‌ల చేసింది. ఇంకా 48 మంది దాని ద‌గ్గ‌ర ఉన్నార‌ని అంచ‌నా. అయితే, ఇందులో బ‌తికి ఉన్న‌ది 20 మంది మాత్ర‌మేన‌ని అంటున్నారు. ఇజ్రాయెల్ సైతం పాల‌స్తీనాకు చెందిన‌వారిని జైళ్ల‌లో పెట్టింది. శాంతి ఒప్పందంలో వీరిని విడుద‌ల చేయాల్సి ఉంటుంది.

హ‌మాస్ మూర్ఖ‌త్వం.. ఇజ్రాయెల్ మార‌ణ‌హోమం

రెండేళ్ల యుద్ధంలో 70 వేల ప్రాణాలు పోయిన‌ట్లు అంచ‌నా. ల‌క్ష‌ల మంది గూడు కోల్పోయారు. వ‌ల‌స పోయారు. ఇప్పుడు గాజా ఒక శిథిల దిబ్బ‌. దీనిపై ట్రంప్ కే కాదు.. నెత‌న్యాహూకూ క‌న్నుంది. గాజాను రియ‌ల్ ఎస్టేట్ వెంచ‌ర్ చేద్దామ‌ని వారి ఆలోచ‌న‌లు బ‌య‌ట‌పెట్టారు. ఏదిఏమైనా శాంతి ఒప్పందం కుద‌ర‌డం మంచిదే..! అయితే, హ‌మాస్ మూర్ఖ‌త్వానికి, ఇజ్రాయెల్ మార‌ణ‌హోమానికి పోయిన ప్రాణాలు ఎవ‌రు వెన‌క్కుతెస్తార‌ని మాన‌వతా వాదులు ప్ర‌శ్నిస్తున్నారు. ల‌క్ష‌ల మంది చిన్నారులు త‌మ బంగారు బాల్యాన్ని కోల్పోయార‌ని.. వారి భ‌విష్య‌త్ ఏమిట‌ని నిల‌దీస్తున్నారు. ఈ రెండు రోజుల్లో ఏం జ‌రుగుతుందో చూద్దాం..!