మంటల్లో లిక్కర్ వెహికిల్.. బాటిల్స్ ఎత్తుకెళ్లిన హైదరాబాదీలు
మంటల్లో వెహికిల్ చిక్కుకుందన్న విషయం కంటే.. ఆ అవకాశాన్ని తమకు అనుకూలంగా మార్చుకొని.. అందులోని సీసాల్ని సొంతం చేసుకోవటానికి ప్రదర్శించిన ఉత్సాహం పలువురిని షాక్ కు గురి చేసింది.
By: Garuda Media | 2 Oct 2025 9:35 AM ISTభారీ ఎత్తున మద్యం స్టాక్ ను డీసీఎంలో తరలిస్తున్న వేళ.. ఆ వాహనానికి మంటలు అంటుకున్న ఉదంతం హైదరాబాద్ లోని హబ్సిగూడలో చోటుచేసుకుంది.ఇంతకూ ఇంత పెద్ద వాహనంలో మంటలు ఎలా చెలరేగాయన్నది అంతుపట్టని ప్రశ్నగా మారింది. సందట్లో సడేమియా అన్నట్లుగా.. మద్యం లోడుతో వెళుతున్న వాహనానికి మంటలు చెలరేగటంతో అందులోని మద్యం సీసాల్ని ఎన్ని దొరికితే అన్ని అన్న చందంగా హైదరాబాదీయులు ఎగబడిన వైనం షాకింగ్ గా మారింది.
మంటల్లో వెహికిల్ చిక్కుకుందన్న విషయం కంటే.. ఆ అవకాశాన్ని తమకు అనుకూలంగా మార్చుకొని.. అందులోని సీసాల్ని సొంతం చేసుకోవటానికి ప్రదర్శించిన ఉత్సాహం పలువురిని షాక్ కు గురి చేసింది. అయితే.. మద్యం లాంటి మంటలకు ఇట్టే అకర్షితులయ్యే హైరిస్కు వస్తువుల్ని సరఫరా చేసే వేళలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవటం కనిపిస్తుంది. అలాంటప్పుడు మంటలు ఎలా చెలరేగి ఉంటాయన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.
ఈ ఉదంతంపై ఎక్సైజ్ పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇదిలా ఉంటే.. మంటల్లో లిక్కర్ వెహికిల్ చిక్కుకున్న వేళ.. మంటల్ని అదుపులోకి తీసుకొచ్చి ఆర్పేసే కన్నా.. అందులోని మద్యం బాటిళ్ల కోసం ఎగబడిన తీరు.. ఆ సందర్భంగా ప్రాణాలకు తెగించి మరీ వ్యవహరించిన కక్కుర్తి విస్మయానికి గురి చేస్తోంది. ఎంత లిక్కర్ బాటిళ్లు అయితే మాత్రం ఇంత రిస్కు తీసుకుంటారా? అని ప్రశ్నిస్తున్నారు. అందిన కాడికి మద్యం బాటిళ్ల అట్టపెట్టల్ని అందిన కాడికి తీసుుకొని పరుగులు తీసిన వైనం షాకింగ్ గా మారింది.
పేరుకే మహానగరం తప్పించి.. అందులో నివసించే వారిలోని కొందరి తీరుతో హైదరాబాదీయులందరి ఇమేజ్ డ్యామేజ్ అయ్యే దుస్థితి. ఇదిలా ఉంటే మద్యం లాంటి ప్రమాదకర వస్తువుల్ని తరలించే వాహనాలకు ప్రత్యేక గైడ్ లైన్స్ ఉండటమే కాదు.. వాటిని పాటించేలా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ వాహన డ్రైవర్ అప్రమత్తమై.. మంటలు అంటుకున్న వెంటనే వాహనాన్ని రోడ్డు పక్కన ఆపేసి ఉండకపోతే.. ఈ ప్రమాదం మరింత తీవ్రంగా ఉండేదన్న మాట వినిపిస్తోంది. ఈ మొత్తం ఎపిసోడ్ లో మద్యం బాటిళ్లు చోరీ తప్పించి.. ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవటం అధికారులకు ఊపిరి పీల్చుకునేలా చేసిందని మాత్రం చెప్పక తప్పదు.
