హెచ్-4 ఈఏడీ గండం: ఏడుగురికి దక్కిన బిగ్ రిలీఫ్.. మిగతావారి పరిస్థితి ఏమిటి?
అమెరికాలో నివాసముంటున్న భారతీయ హెచ్1బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు (హెచ్-4 ఈఏడీ ) కాలిఫోర్నియా ఫెడరల్ కోర్టు ఒక కీలకమైన ఊరటనిచ్చే వార్తను మోసుకొచ్చింది.
By: A.N.Kumar | 16 Sept 2026 1:20 PM ISTఅమెరికాలో నివాసముంటున్న భారతీయ హెచ్1బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు (హెచ్-4 ఈఏడీ ) కాలిఫోర్నియా ఫెడరల్ కోర్టు ఒక కీలకమైన ఊరటనిచ్చే వార్తను మోసుకొచ్చింది. ఆటోమేటిక్ ఎక్స్‌టెన్షన్ నిబంధనలను రద్దు చేస్తూ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌లాండ్ సెక్యూరిటీ తీసుకున్న నిర్ణయంపై న్యాయస్థానం తాత్కాలికంగా జోక్యం చేసుకుంది. ఈ మేరకు జడ్జి డేవిడ్ ఓ. కార్టర్ ప్రాథమిక ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ ఆనందం కేవలం కోర్టును ఆశ్రయించిన ఏడుగురు పిటిషనర్లకు మాత్రమే పరిమితం కావడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
అసలు ఈ వివాదం వెనుక ఉన్న నేపథ్యాన్ని పరిశీలిస్తే అమెరికాలో హెచ్-4 వీసాపై ఉన్న అర్హులైన స్పౌజ్‌లు ఉద్యోగం చేయడానికి ఈఏడీ తప్పనిసరి. గతంలో రెన్యూవల్ అప్లికేషన్ ప్రాసెసింగ్‌లో ఉన్నప్పటికీ పాత కార్డు గడువు ಮುగిసిన తర్వాత కూడా 180 నుంచి 540 రోజుల వరకు ఆటోమేటిక్ ఎక్స్‌టెన్షన్ కింద ఉద్యోగం కొనసాగించే వెసులుబాటు ఉండేది. కానీ హోమ్‌లాండ్ సెక్యూరిటీ విభాగం అక్టోబర్ 2025లో ఈ ఆటోమేటిక్ పొడిగింపు వ్యవస్థను రద్దు చేసింది. దీనికి తోడు యుఎస్‌సిఐఎస్ లో అప్లికేషన్ల ప్రాసెసింగ్ తీవ్రంగా ఆలస్యం కావడంతో కొత్త ఈఏడీ కార్డు చేతికి రాక పాతది చెల్లకుండా వేలాదిమంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదంలో పడ్డారు.
ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఏడుగురు హెచ్-4 స్పౌజ్‌లు కాలిఫోర్నియాలోని సెంట్రల్ డిస్ట్రిక్ట్ కోర్టులో జెన్ డో వర్సెస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌లాండ్ సెక్యూరిటీ పేరుతో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ప్రభుత్వంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. పరిపాలనా విధాన చట్టం నిబంధనల ప్రకారం ఏదైనా పాలసీ మార్చేటప్పుడు పాటించాల్సిన సాధారణ నోటీస్-అండ్-కామెంట్ ప్రక్రియను ప్రభుత్వం సరిగ్గా అనుసరించలేదని తేల్చింది. ప్రభుత్వం ఈ నిబంధనలను ఎందుకు పక్కన పెట్టిందో సరైన కారణాలు చూపలేకపోయినందున.. ఆ ఏడుగురు పిటిషనర్లకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న చర్యను కోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది.
అయితే ఈ తీర్పు విషయంలో ఇతర హెచ్-4 ఈఏడీ హోల్డర్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ కోర్టు ఆదేశాలు దేశవ్యాప్తంగా ఉన్న అందరి స్పౌజ్‌లకు వర్తించవు. కేవలం న్యాయస్థానాన్ని ఆశ్రయించిన ఆ ఏడుగురికి మాత్రమే ఈ తాత్కాలిక ఆటోమేటిక్ ఎక్స్‌టెన్షన్ రక్షణ లభిస్తుంది. కాబట్టి తమ రెన్యూవల్ అప్లికేషన్ పెండింగ్‌లో ఉందనే ఒకే ఒక్క కారణంతో మిగిలినవారు తమ వర్క్ పర్మిట్ ఆటోమేటిక్‌గా పొడిగించబడిందని భావించి ఉద్యోగాల్లో కొనసాగడం చట్టరీత్యా ప్రమాదకరం.
అమెరికాలోని హెచ్-4 ఈఏడీ గ్రహీతలలో సింహభాగం మన భారతీయ కుటుంబాలే ఉన్నాయి. ఈఏడీ ప్రాసెసింగ్‌లో వచ్చే ఆలస్యం వల్ల ఉద్యోగాలు పోయి.. ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో ఈ తీర్పు ఒక ఆశాకిరణంలా కనిపించినప్పటికీ, అది అందరికీ వర్తించకపోవడం నిరాశపరిచే అంశమే. మరోవైపు, ఈ ఆటోమేటిక్ ఎక్స్‌టెన్షన్లపై మరింత శాశ్వతమైన మార్పులు తీసుకురావడానికి వైట్ హౌస్ ఓఐఆర్ఏ సెప్టెంబర్ 9న ఆమోదం తెలిపినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. కాబట్టి హెచ్-4 ఈఏడీ హోల్డర్లు తమ కార్డుల గడువు, అప్లికేషన్ స్టేటస్‌తో పాటు అధికారికంగా వచ్చే తాజా న్యాయపరమైన మార్పులను నిరంతరం గమనించుకోవడం ఎంతో అవసరం.
