Begin typing your search above and press return to search.

అమెరికాలో హెచ్-1బీ నిపుణులకు 'ఇన్ ఫ్లూయెన్సర్ల' సెగ.. వీసా పత్రాల కోసం వేధింపులు..!

రాహుల్ రెడ్డి వంటి ప్రముఖ ఇమ్మిగ్రేషన్ న్యాయవాదులు హెచ్-1బీ హోల్డర్లకు కొన్ని ముఖ్యమైన సూచనలు చేశారు.

By:  Tupaki Political Desk   |   23 April 2026 1:00 PM IST
అమెరికాలో హెచ్-1బీ నిపుణులకు ఇన్ ఫ్లూయెన్సర్ల సెగ.. వీసా పత్రాల కోసం వేధింపులు..!
X

అమెరికాలో ఉపాధి పొందుతున్న భారతీయ నిపుణులు, ముఖ్యంగా హెచ్-1బీ వీసాదారులు ఎదుర్కొంటున్న కొత్త రకం వేధింపుల గురించి వింటుంటే ఆందోళనగా కనిపిస్తోంది. సోషల్ మీడియాలో వ్యూస్ కోసం, ‘దేశభక్తి’ పేరుతో అమాయక నిపుణులను భయభ్రాంతులకు గురిచేయడం విచారకరం. 2026లో అమెరికాలోని హ్యూస్టన్, న్యూయార్క్ వంటి నగరాల్లో ఈ తరహా ఘటనలు పెరుగుతున్నట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

అమెరికా ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న భారతీయ టెక్ నిపుణులు ఇప్పుడు ఒక కొత్త రకమైన ‘డిజిటల్ వేధింపుల’ను ఎదుర్కొంటున్నారు. సోషల్ మీడియాలో ప్రాచుర్యం పొందడానికి కొందరు ఇన్ ఫ్లూయెన్సర్లు, యూట్యూబర్లు తమను తాము ఇమ్మిగ్రేషన్ అధికారులుగా చిత్రించుకుంటూ, హెచ్-1బీ వీసాదారుల ఇళ్లు, కార్యాలయాలపై దాడులు చేస్తున్నారు. వారి వీసా స్థితిని ప్రశ్నిస్తూ, పత్రాలను డిమాండ్ చేస్తూ తీస్తున్న వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది కేవలం వేధింపు మాత్రమే కాదు, ఒక వ్యక్తి ప్రైవసీని ఉల్లంఘించడమే.

ఇటీవల టెక్సాస్‌కు చెందిన ఒక యూట్యూబర్, హెచ్-1బీ కంపెనీలుగా రిజిస్టర్ అయిన చిరునామాలకు వెళ్లి అక్కడ ఆఫీసులు లేవని, అవి నివాస గృహాలని ఆరోపిస్తూ వీడియోలు తీశారు. ఆహార బండ్లు నడుపుతున్న వారిని లేదా సాధారణ నివాసాల్లో ఉంటున్న వారిని కలిసి ‘మీరు వీసా మోసం చేస్తున్నారు’ అని కెమెరాల ముందు అవమానించడం ఒక ట్రెండ్‌గా మారింది. చట్టపరమైన అధికారం లేని ఈ వ్యక్తులు, తమను తాము వ్యవస్థను శుభ్రం చేసే 'వాచ్ డాగ్స్' గా చెప్పుకుంటున్నారు.

న్యాయవాదుల సూచనలు

రాహుల్ రెడ్డి వంటి ప్రముఖ ఇమ్మిగ్రేషన్ న్యాయవాదులు హెచ్-1బీ హోల్డర్లకు కొన్ని ముఖ్యమైన సూచనలు చేశారు. ఎవరైనా తెలియని వ్యక్తులు కెమెరాలతో మీ ఇంటికి వచ్చి పత్రాలు అడిగితే, తలుపు తీయాల్సిన అవసరం లేదు. వారు ప్రభుత్వ అధికారులు కారు. మీరు అమెరికాలో చట్టబద్ధంగా ఉంటున్నారని నిరూపించుకోవాల్సిన బాధ్యత కేవలం యూఎస్సీఐఎస్ లేదంటే ఐసీఈ వంటి అధికారిక ఏజెన్సీలకే ఉంటుంది. ఏ ప్రైవేట్ ఇన్ ఫ్లూయెన్సర్లు సమాధానం చెప్పనక్కర్లేదు. వారు మీ ఇంటి ఆవరణలోకి వస్తే, అది చట్టపరంగా అతిక్రమణ అవుతుంది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయండి.

అమెరికాలో హెచ్-1బీ వీసాదారులు అధికారిక తనిఖీలకు, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ల వేధింపులకు మధ్య తేడాలను గుర్తించడం చాలా చాలా ముఖ్యం. అధికారిక తనిఖీలు నిర్వహించే యూఎస్ సీఐఎస్ లేదా ఐసీఈ అధికారులు తమ ప్రభుత్వ గుర్తింపు కార్డును తప్పనిసరిగా చూపిస్తారు. వీరికి చట్టపరమైన నోటీసు లేదా తనిఖీ చేసే అధికారం ఉంటుంది కాబట్టి మీ రికార్డులను పరిశీలించే హక్కు వీరికి ఉంటుంది. ఈ ప్రక్రియ అంతా చట్టబద్ధమైన పద్ధతిలో జరుగుతుంది.

టెక్నాలజీ, నిపుణతతో అమెరికాను నడిపిస్తున్న భారతీయులు, ఇలాంటి చౌకబారు ఇన్ ఫ్లూయెన్సర్లు వల్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. చట్టం మీ వైపు ఉంది. నూతన విధాన మార్పులు, వీసా ఆలస్యాల మధ్య ఇప్పటికే ఒత్తిడిలో ఉన్న నిపుణులు, ఇలాంటి సామాజిక వేధింపులను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ఐక్యంగా ఉండాలి.