H1B వేలంపాట లాటరీలో..
అమెరికాలో ఉద్యోగం చేయాలనే ఆశతో ఉన్న ఎంతోమంది భారతీయులకు H-1B వీసా అత్యంత ముఖ్యమైనది.
By: A.N.Kumar | 24 Sept 2025 9:51 AM ISTఅమెరికాలో ఉద్యోగం చేయాలనే ఆశతో ఉన్న ఎంతోమంది భారతీయులకు H-1B వీసా అత్యంత ముఖ్యమైనది. ఇప్పటి వరకు ఈ వీసా లాటరీ పూర్తిగా యాదృచ్ఛికంగా జరిగేది. కానీ, ఇప్పుడు ఇందులో పెద్ద మార్పు రాబోతోంది. అమెరికా ప్రభుత్వం ఒక కొత్త ప్రతిపాదనను తీసుకువచ్చింది. దీని ప్రకారం, ఇకపై కేవలం అదృష్టం మీద ఆధారపడి ఉండదు. కానీ మీ జీతం స్థాయి కూడా లాటరీలో మీ అవకాశాలను నిర్ణయిస్తుంది.
* కొత్త ప్రతిపాదన ఏంటి?
అమెరికా డిపార్ట్ మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ (DHS), డిపార్ట్ మెంట్ ఆఫ్ లేబర్ సంయుక్తంగా ఈ కొత్త నియమాన్ని ప్రతిపాదించాయి. దీని ముఖ్య ఉద్దేశ్యం, ఎక్కువ జీతం ఇచ్చే కంపెనీలకు లాటరీలో ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం. అమెరికా లేబర్ డిపార్ట్‌మెంట్ ప్రకారం, ఉద్యోగాలకు నాలుగు వేతన స్థాయిలు (Wage Levels) ఉన్నాయి.
లెవల్ 1 (తక్కువ జీతం / కొత్తగా ఉద్యోగంలో చేరినవారు): వీరికి కేవలం 1 అవకాశం మాత్రమే ఉంటుంది.
లెవల్ 2 (మోస్తరు అనుభవం ఉన్నవారు): వీరికి 2 అవకాశాలు ఉంటాయి.
లెవల్ 3 (మధ్యస్థ / మంచి అనుభవం ఉన్నవారు): వీరికి 3 అవకాశాలు లభిస్తాయి.
లెవల్ 4 (అత్యధిక జీతం / నిపుణులు): వీరికి ఏకంగా 4 అవకాశాలు ఉంటాయి.
ఈ కొత్త విధానంతో ఎక్కువ జీతం పొందే ఉద్యోగుల దరఖాస్తులు లాటరీలో బహుళసార్లు పరిగణించబడతాయి.
ఈ మార్పు ఎందుకు?
ఈ మార్పు వెనుక అమెరికా ప్రభుత్వం ఒక స్పష్టమైన వాదనను వినిపిస్తోంది. తక్కువ జీతం ఇచ్చే ఉద్యోగాలకు ఎక్కువగా H-1B వీసాలు కేటాయించడం వల్ల అమెరికన్ ఉద్యోగులకు నష్టం జరుగుతుందని వారు భావిస్తున్నారు. ముఖ్యంగా భారతీయ ఐటీ కన్సల్టెన్సీ కంపెనీలు తక్కువ జీతంతో (Level 1) ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు వేస్తున్నాయని, ఇది దేశీయ కార్మికులపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ప్రభుత్వం చెబుతోంది. అందుకే ఎవరైతే ఎక్కువ జీతం చెల్లిస్తారో, వారికి ఎక్కువ అవకాశాలు అనే విధానాన్ని తీసుకురావాలని నిర్ణయించారు.
*ఈ మార్పుతో ఎవరికి లాభం? ఎవరికి నష్టం?
ఈ కొత్త విధానం వల్ల కొందరికి లాభం, మరికొందరికి నష్టం జరిగే అవకాశం ఉంది.
లాభం పొందేది:
గూగుల్ , అమెజాన్ , మైక్రోసాఫ్ట్ , మెటా లాంటి పెద్ద ప్రొడక్ట్ కంపెనీల్లో ఉద్యోగాలు పొందిన వారికి. ఈ కంపెనీలు సాధారణంగా ఉద్యోగులకు అత్యధిక జీతాలు చెల్లిస్తాయి. కాబట్టి వారికి లాటరీలో ఎక్కువ అవకాశాలు వస్తాయి. అమెరికాలో హై-స్కిల్డ్ జాబ్స్ అయిన సాఫ్ట్‌వేర్ ఆర్కిటెక్ట్స్, డేటా సైంటిస్ట్స్, AI ఇంజనీర్స్ లాంటి నిపుణులకు ఇవి లభిస్తాయి..
*నష్టం పొందేది:
తక్కువ జీతం (లెవల్ 1) మీద ఎక్కువ మందిని పంపే ఇండియన్ ఐటీ కన్సల్టెన్సీ కంపెనీలకు. వీరికి లాటరీలో అవకాశాలు గణనీయంగా తగ్గుతాయి.
ప్రస్తుతానికి, ఇది కేవలం ఒక ప్రతిపాదన మాత్రమే. ఇది ఇంకా ఫైనల్ రూల్ కాలేదు. దీనిపై ప్రజల నుంచి, సంస్థల నుంచి అభిప్రాయాలను తీసుకునేందుకు 30 రోజుల సమయం ఉంది. ఈ ప్రజాభిప్రాయాల ఆధారంగానే తుది నిర్ణయం తీసుకుంటారు.
ఈ కొత్త విధానం అమలైతే H-1B వీసా లాటరీ అనేది ఒక రకమైన "వేలంపాట" లాగా మారుతుంది. ఎక్కువ జీతం ఉన్నవారికి ఎక్కువ టిక్కెట్లు, తక్కువ జీతం ఉన్నవారికి తక్కువ టిక్కెట్లు దొరుకుతాయి. ఇది అమెరికాలో నిజమైన నిపుణులకు, అత్యంత ప్రతిభావంతులకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని భావించవచ్చు. అయితే దీని వల్ల చిన్న కంపెనీలు, తక్కువ జీతం ఉన్నవారు ఇబ్బందులు పడే అవకాశం ఉంది.
