Begin typing your search above and press return to search.

వీసా ఉన్నా అమెరికాలో ఎంట్రీ నో.. హెచ్-1బీ హోల్డర్‌కు సీబీపీ అధికారుల షాకింగ్ నిర్ణయం

ప్రస్తుతం అమెరికాలో ఇమ్మిగ్రేషన్ నిబంధనలు అత్యంత కఠినంగా మారాయి. ముఖ్యంగా చిన్న కంపెనీలు లేదా కన్సల్టెన్సీల ద్వారా వచ్చే అభ్యర్థులపై అధికారులు ప్రత్యేక నిఘా ఉంచుతున్నారు.

By:  A.N.Kumar   |   14 May 2026 10:00 AM IST
వీసా ఉన్నా అమెరికాలో ఎంట్రీ నో.. హెచ్-1బీ హోల్డర్‌కు సీబీపీ అధికారుల షాకింగ్ నిర్ణయం
X

అమెరికా కలలతో విదేశీ ప్రయాణం కట్టిన ఒక భారతీయ టెకీకి చేదు అనుభవం ఎదురైంది. హెచ్-1బీ వీసా చేతిలో ఉన్నప్పటికీ అమెరికా గడ్డపై అడుగుపెట్టే ముందే కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (సీబీపీ) అధికారులు అతడిని నిలిపివేసి.. గంటల తరబడి విచారించి వెనక్కి పంపడం ఇప్పుడు ఐటీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటన హెచ్-1బీ వీసాదారుల్లో ఆందోళనను పెంచడమే కాకుండా అమెరికా ఇమ్మిగ్రేషన్ నిబంధనల కఠినతను మరోసారి గుర్తుచేస్తోంది.

అసలేం జరిగింది?

సమాచారం ప్రకారం.. ఒక భారతీయ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ తన హెచ్-1బీ వీసా ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసుకుని.. పాస్‌పోర్ట్‌పై వీసా స్టాంపింగ్ కూడా పొంది అమెరికాకు బయలుదేరారు. హెచ్-1బీ పిటిషన్ ఆమోదం పొంది.. కాన్సులేట్ ఇంటర్వ్యూలో గ్రీన్ సిగ్నల్ రావడంతో ప్రయాణం సాఫీగా సాగిపోతుందని భావించాడు. అయితే అమెరికాలోని పోర్ట్ ఆఫ్ ఎంట్రీ విమానాశ్రయం వద్ద సీబీపీ అధికారులు అతడిని అడ్డుకున్నారు.

సాధారణ ఇమ్మిగ్రేషన్ తనిఖీ కాకుండా అతడిని సెకండరీ ఇన్‌స్పెక్షన్ ప్రత్యేక విచారణ గది కి తీసుకెళ్లారు. అక్కడ సుమారు నాలుగున్నర గంటల పాటు అధికారుల ప్రశ్నల పరంపర కొనసాగింది. అతడి రెజ్యూమేలో పేర్కొన్న వివరాలు.. గత ఉద్యోగ అనుభవం, ప్రస్తుతం అమెరికాలో చేరబోయే కంపెనీ వివరాలు, అక్కడ చేయబోయే ప్రాజెక్ట్ స్వభావం, వేతన స్థాయి వంటి అంశాలపై అధికారులు క్షుణ్ణంగా ఆరా తీశారు.

తిరస్కరణకు దారితీసిన కారణాలు?

అధికారులు ప్రధానంగా కొన్ని అంశాలపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది సదరు ఉద్యోగి పనిచేయబోయే కంపెనీ నిజంగానే ఉనికిలో ఉందా? లేదా అది ఒక 'షెల్ కంపెనీ'యా అనే కోణంలో విచారణ జరిగింది. హెచ్-1బీ ఆమోదం పొందిన తర్వాత అమెరికాకు రావడానికి ఎందుకు ఆలస్యమైందన్న ప్రశ్నపై అధికారులు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. అభ్యర్థి విద్యార్హతలకు, అతనికి ఆఫర్ చేసిన వేతనానికి పొంతన ఉందా అనే విషయాన్ని కూడా అధికారులు పరిశీలించారు. విచారణ అనంతరం.. ఆ అభ్యర్థి సమాధానాలు సంతృప్తికరంగా లేవని భావించిన సీబీపీ అధికారులు.. అతడికి అమెరికాలోకి ప్రవేశించే అనుమతిని నిరాకరించారు. తక్షణమే అతడిని తదుపరి విమానంలో భారతదేశానికి తిరుగుపయనం చేశారు.

నిపుణులు ఏమంటున్నారు?

ఈ ఘటనపై ఇమ్మిగ్రేషన్ న్యాయ నిపుణులు స్పందిస్తూ.. వీసా ఉండటం అంటే అది అమెరికాలోకి ప్రవేశించడానికి గ్యారెంటీ కాదని.. అది కేవలం ప్రయాణించడానికి ఒక అనుమతి పత్రం మాత్రమేనని స్పష్టం చేస్తున్నారు. అమెరికా భూభాగంలోకి ఎవరిని అనుమతించాలనే తుది నిర్ణయం పూర్తిగా విమానాశ్రయంలోని సీబీపీ అధికారుల చేతుల్లోనే ఉంటుంది.

ప్రస్తుతం అమెరికాలో ఇమ్మిగ్రేషన్ నిబంధనలు అత్యంత కఠినంగా మారాయి. ముఖ్యంగా చిన్న కంపెనీలు లేదా కన్సల్టెన్సీల ద్వారా వచ్చే అభ్యర్థులపై అధికారులు ప్రత్యేక నిఘా ఉంచుతున్నారు. సోషల్ మీడియాలో చర్చ జరుగుతున్న కనీసం లక్ష డాలర్ల జీతం ఉండాలనే వాదన ఈ కేసులో వర్తించకపోయినా అభ్యర్థి ప్రొఫైల్‌లో ఏమాత్రం తేడాలు ఉన్నా అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు.

అభ్యర్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

భవిష్యత్తులో అమెరికాకు వెళ్లే హెచ్-1బీ వీసాదారులు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎంప్లాయ్‌మెంట్ ఆఫర్ లెటర్, ప్రాజెక్ట్ వివరాలు, క్లయింట్ లెటర్ తాజా పే-స్లిప్పులను సిద్ధంగా ఉంచుకోవాలి. అధికారులు అడిగే ప్రశ్నలకు తడబడకుండా నిజాయితీగా సమాధానాలు ఇవ్వాలి. రెజ్యూమేలో ఉన్న వివరాలకు, చెప్పే సమాధానాలకు పొంతన ఉండాలి. తన యజమాని గురించిన పూర్తి సమాచారం.. ఆ కంపెనీ ఎక్కడ ఉంది, అక్కడ ఎంతమంది పనిచేస్తున్నారు వంటి ప్రాథమిక అంశాలపై అవగాహన ఉండాలి.

ఈ ఘటన ఐటీ రంగంలో చర్చనీయాంశంగా మారడమే కాకుండా, అమెరికా ప్రయాణం పెట్టుకునే వారు తమ డాక్యుమెంటేషన్ విషయంలో ఎంత పక్కాగా ఉండాలో హెచ్చరిస్తోంది.