హెచ్-1బి వీసా ఎఫెక్ట్ : అమెరికా ఔట్.. టెక్ టాలెంట్‌కు కొత్త గమ్యం!
యూఏఈ, సౌదీ అరేబియా వంటి శక్తివంతమైన గల్ఫ్ దేశాలు ఇప్పటికే తమ దృష్టిని చమురు నుంచి టెక్నాలజీ, AI రంగాలపైకి మళ్లించాయి.
By: A.N.Kumar | 29 Sept 2025 5:00 PM ISTఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. హెచ్-1బి వీసాల ఫీజులను పెంచనున్నట్లు ఆయన చేసిన ప్రకటన గ్లోబల్ టాలెంట్ మార్కెట్‌లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ నిర్ణయంతో అమెరికాకు వచ్చే నైపుణ్యంతో కూడిన ఉద్యోగుల సంఖ్య గణనీయంగా తగ్గే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. అయితే, ఈ ‘బటర్‌ఫ్లై ఎఫెక్ట్’ ఇప్పుడు అనూహ్యంగా గల్ఫ్ దేశాలకు లాభం చేకూర్చే అవకాశాన్ని అందిస్తోంది. మధ్యప్రాచ్యం ఇప్పుడు ప్రపంచ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రాజధానిగా అవతరించేందుకు దూసుకుపోతోంది.
గల్ఫ్ దేశాల లక్ష్యం: AI గ్లోబల్ హబ్
యూఏఈ, సౌదీ అరేబియా వంటి శక్తివంతమైన గల్ఫ్ దేశాలు ఇప్పటికే తమ దృష్టిని చమురు నుంచి టెక్నాలజీ, AI రంగాలపైకి మళ్లించాయి. ఈ రంగాల్లో ప్రపంచ కేంద్రాలుగా మారేందుకు భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి.
సౌదీ అరేబియా: 'NEOM' వంటి మెగా ప్రాజెక్టులతో టెక్నాలజీ భవిష్యత్తును పునర్నిర్మిస్తోంది.
యూఏఈ: స్మార్ట్ సిటీస్, ఆధునిక మౌలిక వసతులతో ప్రపంచం నలుమూలల నుంచి అత్యుత్తమ టాలెంట్‌ను ఆకర్షిస్తోంది.
ట్రంప్ తీసుకున్న వీసా ఫీజుల పెంపు నిర్ణయం ఈ గల్ఫ్ దేశాల ఆశయాలకు అనుకోని పరోక్ష మద్దతు గా నిలుస్తోంది.
* నిపుణులకు ఆకర్షణీయమైన ఆఫర్లు: అమెరికాకు ఆల్టర్నేటివ్?
టెక్ నిపుణులను ఆకర్షించేందుకు గల్ఫ్ ప్రభుత్వాలు అందిస్తున్న ప్రోత్సాహకాలు అత్యంత ఆకర్షణీయంగా ఉన్నాయి. అమెరికాలో వీసా సమస్యలు, యూరప్/యుకెల్లోని కఠిన వలస నియంత్రణలతో విసిగిపోయిన టెక్ ప్రొఫెషనల్స్‌కు గల్ఫ్ కొత్త వేదికగా మారుతోంది.
* ఆకర్షణీయమైన ఆఫర్లు వివరాలు
అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా జీతాలు అందిస్తున్నారు. పైగా పన్నుల మినహాయింపు జీతంపై పన్నులు లేకపోవడం ప్రధాన ఆకర్షణ. గోల్డెన్ వీసా వంటి ప్రత్యేక వీసాల ద్వారా దీర్ఘకాల నివాసానికి అవకాశం కల్పిస్తున్నారు.. ప్రపంచ స్థాయి జీవనశైలి, అత్యాధునిక మౌలిక సదుపాయాలు, భద్రత కల్పిస్తున్నారు. బిజినెస్ ఫ్రెండ్లీ వాతావరణం కల్పించి స్టార్టప్‌లు, కంపెనీల ఏర్పాటుకు అనుకూలమైన విధానాలు పాటిస్తున్నారు..
* భారత యువతకు కొత్త అవకాశాలు
టెక్నాలజీ, AI రంగాల్లో నైపుణ్యం కలిగిన భారత యువత ఇకపై అమెరికాకు బదులుగా గల్ఫ్ వైపు మరింతగా మొగ్గు చూపే అవకాశం ఉంది. పన్నులేమీ లేకుండా అధిక వేతనాలు, అలాగే సులభమైన దీర్ఘకాల వీసాలు భారతీయ టెక్ టాలెంట్‌ను ఆకర్షించే ప్రధాన అంశాలు.
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. గల్ఫ్ కేవలం తాత్కాలిక వేదికగా కాకుండా, దీర్ఘకాలిక కెరీర్ నిర్మాణానికి, పెట్టుబడులకు అనువైన గమ్యస్థానంగా మారే అవకాశం ఉంది.
సవాళ్లు ఇంకా ఉన్నప్పటికీ శాశ్వత పౌరసత్వం పొందే మార్గాలు పరిమితంగా ఉండటం, మధ్యప్రాచ్య భద్రతా సమస్యలు వంటి సవాళ్లు ఉన్నప్పటికీ, ఆర్థికపరమైన ఆకర్షణలు వీటిని మరుగుపరుస్తున్నాయి.
ట్రంప్ కొత్త వీసా నిబంధనలు 'గ్లోబల్ టాలెంట్ ఫ్లో' (ప్రపంచ నైపుణ్య ప్రవాహాన్ని) అమెరికా నుంచి గల్ఫ్ వైపు మళ్లించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ పరిణామం రాబోయే కాలంలో గల్ఫ్ దేశాలను ప్రపంచ AI రాజధానిగా ఎదిగేందుకు బలమైన పునాదిగా మారవచ్చనే అంచనాలు బలంగా వినిపిస్తున్నాయి.
