Begin typing your search above and press return to search.

అత్యధిక వేతనాలు ఇచ్చే H1B ఉద్యోగాలు: అగ్రస్థానంలో ఎవరు?

అమెరికాలో ఉద్యోగం.. డాలర్లలో సంపాదన అనేది సగటు భారతీయ నిపుణుడి కల. ముఖ్యంగా H1B వీసా కోసం ఏటా లక్షలాది మంది దరఖాస్తు చేసుకుంటుంటారు.

By:  A.N.Kumar   |   17 Jan 2026 3:00 PM IST
అత్యధిక వేతనాలు ఇచ్చే H1B ఉద్యోగాలు: అగ్రస్థానంలో ఎవరు?
X

అమెరికాలో ఉద్యోగం.. డాలర్లలో సంపాదన అనేది సగటు భారతీయ నిపుణుడి కల. ముఖ్యంగా H1B వీసా కోసం ఏటా లక్షలాది మంది దరఖాస్తు చేసుకుంటుంటారు. అయితే, ఈ వీసా ద్వారా అత్యధిక వేతనాలు అందుకుంటున్నది సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లే అని చాలామంది భావిస్తుంటారు. కానీ తాజా గణాంకాలు ఒక ఆసక్తికరమైన నిజాన్ని వెల్లడించాయి. అమెరికాలో H1B వీసాపై అత్యధిక జీతాలు పొందుతున్న జాబితాలో వైద్య రంగానిదే తిరుగులేని ఆధిపత్యం.

అమెరికా కార్మిక శాఖ గణాంకాలను విశ్లేషిస్తూ ప్రముఖ ఇమిగ్రేషన్ లా ఫర్మ్ 'మేనిఫెస్టో లా’ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం.. అమెరికాలో విదేశీ నిపుణులకు కల్పవృక్షంగా మారిన H1B వీసా కింద అత్యధిక వేతనాలు పొందుతున్న టాప్-15 ఉద్యోగాల్లో 11 స్థానాలు వైద్య రంగానికే దక్కాయి.

వైద్య రంగం.. జీతాల జాతర

అమెరికాలో వైద్యుల కొరత తీవ్రంగా ఉండటంతో విదేశీ వైద్యులకు భారీ ప్యాకేజీలను ఆఫర్ చేస్తున్నాయి అక్కడి సంస్థలు. కార్డియాలజిస్టులు, అనస్తీషియాలజిస్టులు, రేడియాలజిస్టులు, న్యూరాలజిస్టులు అత్యధిక వేతనాలు అందుకుంటున్నారు. ఈ స్పెషాలిటీ వైద్యుల సగటు వార్షిక వేతనం $300,000 (సుమారు ₹2.7 కోట్లు) దాటి ఉండటం విశేషం. కొన్ని సందర్భాల్లో అనుభవాన్ని బట్టి ఇది మరింత ఎక్కువగా ఉంటోంది.

నాన్-మెడికల్ రంగాల పరిస్థితి ఏమిటి?

సాధారణంగా H1B అనగానే మనకు ఐటీ రంగం గుర్తుకొస్తుంది. కానీ వేతనాల పరంగా చూస్తే వైద్య రంగంతో పోలిస్తే ఇవి తక్కువగానే ఉన్నాయి. వీరు సగటున $100,000 నుండి $200,000 (సుమారు ₹90 లక్షల నుండి ₹1.8 కోట్లు) మధ్య వేతనం పొందుతున్నారు. సాఫ్ట్‌వేర్ డెవలపర్లు.. సిస్టమ్స్ మేనేజర్లు కూడా ఇదే శ్రేణిలో ఉన్నారు. అంటే, ఒక స్పెషలిస్ట్ డాక్టర్ పొందే జీతంలో వీరు దాదాపు సగం లేదా అంతకంటే తక్కువే అందుకుంటున్నారు.

ట్రంప్ హయాంలోనూ వైద్యులకు 'రెడ్ కార్పెట్'

డొనాల్డ్ ట్రంప్ తన అధ్యక్ష పదవి కాలంలో వలస విధానాలపై కఠినంగా వ్యవహరించినప్పటికీ వైద్యుల విషయంలో మాత్రం సానుకూలంగా ఉండేవారు. అమెరికాలోని గ్రామీణ ప్రాంతాల్లో వైద్యుల కొరతను తీర్చడానికి H1B నిబంధనల్లో వైద్య సిబ్బందికి కొన్ని సడలింపులు ఇచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో కూడా అమెరికా ఆరోగ్య వ్యవస్థ విదేశీ వైద్యులపైనే ఎక్కువగా ఆధారపడి ఉండటమే దీనికి ప్రధాన కారణం.

వైద్య విద్యార్థులకు ఇది సువర్ణావకాశం

అమెరికాలో స్థిరపడాలనుకునే భారతీయ వైద్య విద్యార్థులకు ఇది ఒక గొప్ప ప్రోత్సాహం. కేవలం ఐటీ రంగమే కాకుండా మెడికల్ స్పెషలైజేషన్ చేసిన వారికి అమెరికాలో అపారమైన గౌరవం.. అత్యున్నత ఆర్థిక భరోసా లభిస్తోందని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది. రాబోయే పదేళ్లలో కూడా అమెరికాలో వైద్యుల అవసరం మరింత పెరిగే అవకాశం ఉండటంతో ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.