Begin typing your search above and press return to search.

H1b ఎఫెక్ట్ : అమెరికా ప్రయాణం : టికెట్‌ ధరలు దాదాపు డబుల్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీసుకుంటున్న తాజా నిర్ణయాలు భారతీయులపై వరుస దెబ్బలుగా మారుతున్నాయి.

By:  A.N.Kumar   |   20 Sept 2025 3:49 PM IST
H1b ఎఫెక్ట్  : అమెరికా ప్రయాణం : టికెట్‌ ధరలు దాదాపు డబుల్
X

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయాలు H-1B వీసాదారులకు.. అమెరికా ప్రయాణానికి సిద్ధమవుతున్నవారికి పెద్ద షాక్ ఇస్తున్నాయి. ప్రత్యేకించి, ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు, వారి కుటుంబాలపై ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ట్రంప్ పరిపాలన తీసుకొచ్చిన మార్పులు, వీసా ఫీజులు.. విమాన టికెట్ ధరల పెరుగుదల వల్ల ఇప్పుడు అమెరికా ప్రయాణం మరింత కష్టంగా మారింది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా హెచ్‌-1బీ వీసాదారులపై భారీ ఆర్థిక భారాన్ని మోపారు. వార్షిక రుసుం లక్ష డాలర్లు చెల్లించాల్సిందిగా కార్యనిర్వాహక ఉత్తర్వుపై ఆయన సంతకం చేశారు. ఇది 22వ తేదీ నుంచే అమలులోకి రానుంది. ఈ పరిణామంతో టెక్ కంపెనీలు అప్రమత్తమయ్యాయి. విదేశాల్లో ఉన్న హెచ్‌-1బీ, హెచ్‌-4 వీసాదారులు రేపటిలోగా (సెప్టెంబరు 21) అమెరికాకు చేరుకోవాలని మైక్రోసాఫ్ట్ సహా ఐటీ కంపెనీలన్నీ తన ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఇందుకోసం సంస్థ అంతర్గత ఈ-మెయిల్ పంపినట్లు రాయిటర్స్ నివేదికలు చెబుతున్నాయి. కాగా, ఇప్పటికే అమెరికాలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు తమ భవిష్యత్తు కోసం అక్కడే కొనసాగాలని మైక్రోసాఫ్ట్ సూచించినట్టు తెలుస్తోంది.

H-1B వీసా షాక్: ఐటీ రంగంపై భారం

ట్రంప్ సంతకం చేసిన కొత్త కార్యనిర్వాహక ఉత్తర్వు ప్రకారం, H-1B వీసా ఫీజులను ఏడాదికి $1 లక్షకు పెంచే అవకాశం ఉంది. ఈ నిర్ణయం అమలులోకి వస్తే మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్ వంటి కంపెనీలపై భారీ ఆర్థిక భారం పడుతుంది. ఇప్పటి వరకు లాటరీ పద్ధతిలో తక్కువ ఫీజులతో వీసాలు పొందిన కంపెనీలు ఇకపై అధిక మొత్తాన్ని చెల్లించాల్సి వస్తుంది. దీనివల్ల నియామకాలు తగ్గే ప్రమాదం ఉందని, ప్రాజెక్టుల లాభదాయకత కూడా దెబ్బతింటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో, మైక్రోసాఫ్ట్ సహా వివిధ కంపెనీలు తమ ఉద్యోగులకు అత్యవసర సూచనలు జారీ చేసింది. సెప్టెంబర్ 21లోపు అమెరికాకు తిరిగి రావాల్సిందిగా ఇతర దేశాల్లో ఉన్న తమ H-1B , H-4 వీసా ఉద్యోగులను అప్రమత్తం చేసింది.

విమాన టికెట్ ధరలు రెట్టింపు

21లోపు అమెరికా వచ్చేయాలని.. లేదంటే లక్ష డాలర్లు హెచ్1 బీ ఫీజు కట్టాల్సి వస్తుండడంతో ఇప్పుడు అమెరికా విమానం ప్రయాణం చాలా ఖరీదుగా మారింది. దాదాపు విమానం టికెట్ రేట్స్ డబుల్ అయ్యాయి. వీసా సమస్యలతో పాటు, విమాన టికెట్ ధరల పెరుగుదల మరో పెద్ద సవాలుగా మారింది. అమెరికా ప్రయాణానికి ఉన్న డిమాండ్, ప్రస్తుత అనిశ్చితుల కారణంగా టికెట్ ధరలు అమాంతం పెరిగాయి.

ప్రస్తుత ధరలు: ఇండియా నుండి అమెరికాకు టికెట్లు సాధారణంగా $490 (సుమారు రూ. 41,000) నుండి ప్రారంభమవుతున్నాయి.

పండుగ సీజన్ ధరలు: ట్రావెల్ ఏజెంట్ల అంచనాల ప్రకారం, పండుగ సీజన్లో ముఖ్యంగా డిసెంబర్‌లో ఈ ధరలు రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. ఆ సమయంలో సగటు టికెట్ ధరలు రూ. 75,000 నుండి రూ. 90,000 వరకు చేరవచ్చని అంచనా.

ప్రయాణ వ్యయం: డల్లాస్–ఇండియా రౌండ్ ట్రిప్ $495 నుండి $670 వరకు, న్యూయార్క్–ముంబై $584, మరియు వాషింగ్టన్–ఢిల్లీ వన్-వే టికెట్ $339 గా ఉంది.

ధరల ట్రెండ్స్: సెప్టెంబర్‌లో $495 నుండి $777 వరకు ఉన్న టికెట్ ధరలు, డిసెంబర్‌లో $1,347 (సుమారు రూ. 90,000) వరకు పెరిగే అవకాశం ఉంది. జనవరి-ఫిబ్రవరి నెలల్లో ధరలు సుమారు 20% తగ్గుతాయని అంచనా.

ముఖ్యంగా, మంగళవారం , బుధవారం రోజుల్లో టికెట్లు బుక్ చేసుకుంటే సుమారు 20% వరకు చౌకగా లభించవచ్చని, ముందుగా బుక్ చేసుకుంటే 25% వరకు ఆదా చేసుకోవచ్చని ట్రావెల్ నిపుణులు సూచిస్తున్నారు.

ప్రస్తుతం విమాన టికెట్ ధరలు లక్షా 20వేలు ఒక్కో టికెట్ కు దాటాయని ప్రయాణికులు స్క్రీన్ షాట్స్ పెడుతూ ఆందోళన చెందుతున్నారు. సాధారణంగా ప్రయాణించే ధరకు దాదాపు డబుల్ అని వాపోతున్నారు. ట్రంప్ ఎఫెక్ట్ తో అమెరికాకు రావడానికి ఒక్కరోజే మిగిలిందని.. సో విమానయాన టికెట్స్ రేట్లు పెంచడం కరెక్ట్ కాదంటూ ఆందోళన చెందుతున్నారు.

సాధారణ కుటుంబాలపై ప్రభావం

పెరిగిన వీసా ఫీజులు, విమాన ప్రయాణ ఖర్చులు సాధారణ కుటుంబాలకు అమెరికా ప్రయాణాన్ని భారంగా మార్చాయి. ముఖ్యంగా ఉద్యోగులు, విద్యార్థులు మాత్రమే కాకుండా, వారి కుటుంబ ప్రయాణాలు కూడా పెరిగిన ఖర్చుల వల్ల ఇబ్బందులు పడుతున్నాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, భారత్-అమెరికా ప్రయాణం ఇకపై ఒక లగ్జరీగా మారే అవకాశం ఉంది.

మొత్తంగా, ట్రంప్ పరిపాలన నిర్ణయాలు ..పెరిగిన టికెట్ ధరలు కలసి, వలసదారులు, ఐటీ నిపుణులు, మరియు సాధారణ కుటుంబాలపై తీవ్రమైన ఆర్థిక భారాన్ని మోపుతున్నాయి. ఈ పరిణామాలు అమెరికాకు వెళ్ళాలనుకునే భారతీయ యువతకు ఒక పెద్ద సవాలుగా మారాయి.