Begin typing your search above and press return to search.

వీసా స్టాంపింగ్ ఆలస్యమైతే ఇక ఇండియాలోనే.. అమెరికా రీఎంట్రీ కష్టమే

వీసా స్టాంపింగ్ కోసం వెళ్లిన చాలా మంది భారతీయ ప్రొఫెషనల్స్ కు అపాయింట్ మెంట్ లు రీషెడ్యూల్ కావడంతో నెలల తరబడి భారత్ లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.

By:  A.N.Kumar   |   19 Dec 2025 11:55 PM IST
వీసా స్టాంపింగ్ ఆలస్యమైతే ఇక ఇండియాలోనే.. అమెరికా రీఎంట్రీ కష్టమే
X

అమెరికా వీసా అపాయింట్ మెంట్ ఆలస్యాల కారణంగా ప్రస్తుతం భారత్ లోనే ఉండిపోయిన హెచ్1బీ వీసా హోల్డర్లకు అమెరికా తిరిగి ప్రవేశం విషయంలో సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని ఇమ్మిగ్రేషన్ అటార్నీ డేవిడ్ సాంటియాగో హెచ్చరించారు. వీసా స్టాంపింగ్ కోసం వెళ్లిన చాలా మంది భారతీయ ప్రొఫెషనల్స్ కు అపాయింట్ మెంట్ లు రీషెడ్యూల్ కావడంతో నెలల తరబడి భారత్ లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ప్రధానంగా 2025 చివర్లో ఉండాల్సిన వీసా ఇంటర్వ్యూలు, భారీ బ్యాక్ లాగ్ కారణంగా 2026 చివరికి వాయిదా పడుతున్నాయి. దీంతో హె1బీ హోల్డర్లు అమెరికాకు తిరిగి వెళ్లగలమా? అనే అనిశ్చితిలో చిక్కుకున్నారు. ఈ నేపథ్యంలో భారత్ లో ఉండి దీర్ఘకాలం రిమోట్ వర్క్ చేయడం అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారుల వద్ద అనుమానాలకు దారితీయవచ్చని సాంటియాగో తెలిపారు. ఎందుకంటే హెచ్1బీ వీసా నిబంధనల ప్రకారం ఉద్యోగి అమెరికాలో భౌతికంగా పనిచేయడానికే ఈ వీసా ముడిపడి ఉంటుంది. ఎక్కువ కాలం విదేశాల్లో ఉండటం వల్ల ఉద్యోగాన్ని వదిలేసినట్టుగా లేదా స్టేటస్ ను ఉల్లంఘించినట్టుగా అధికారులు భావించే ప్రమాదం ఉందన్నారు.

ఈ రిస్క్ తగ్గించుకోవడానికి వీసా అపాయింట్ మెంట్ ఆలస్యాల కారణంగా భారత్ నుంచి రిమోట్ వర్క్ చేయడానికి సంస్థ అనుమతి ఇచ్చిందని స్పష్టంగా పేర్కొంటూ యజమానుల నుంచి రాతపూర్వక ధృవీకరణ తీసుకోవాలని ఆయన సూచించారు. అలాంటి డాక్యుమెంట్లు లేకపోతే అమెరికా రీఎంట్రీ సమయంలో దీర్ఘకాల విదేశీ గైర్హాజరీపై ప్రశ్నలు ఎదురయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు.

కొన్ని సందర్భాల్లో వీసా స్టాంపింగ్ పూర్తయ్యే వరకూ వేతనం లేని సెలవు తీసుకోవడం లేదా తాత్కాలికంగా పని నిలిపివేయడం మరింత సురక్షితమైన మార్గంగా ఉండొచ్చని కూడా సాంటియాగో అభిప్రాయపడ్డారు.

మొత్తంగా చూస్తే.. హెచ్1బీ , హెచ్4 వీసా ఇంటర్వ్యూల రీషెడ్యూలింగ్, కొత్త వెట్టింగ్ విధానాల కారణంగా వీసా ప్రాసెసింగ్ తీవ్రంగా నెమ్మదించడంతో భారతీయ ప్రొఫెషనల్స్ తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు. ఉద్యోగాన్ని కొనసాగించాల్సిన అవసరం ఒకవైపు.. అమెరికా ఇమిగ్రేషన్ నిబంధనలను పాటించాల్సిన బాధ్యత మరోవైపు ఉండటంతో ఉద్యోగులు , సంస్థలు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.