ఆశ్చర్యం: ఓపీటీ విద్యార్థులను కాపాడుతున్న ట్రంప్ హెచ్1బీ నిబంధన?
అమెరికా వీసా విధానాల్లో వస్తున్న విప్లవాత్మక మార్పులు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా భారతీయ విద్యార్థి లోకంలో పెను సంచలనాన్ని సృష్టిస్తున్నాయి.
By: A.N.Kumar | 31 March 2026 8:00 PM ISTఅమెరికా వీసా విధానాల్లో వస్తున్న విప్లవాత్మక మార్పులు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా భారతీయ విద్యార్థి లోకంలో పెను సంచలనాన్ని సృష్టిస్తున్నాయి. డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం ప్రతిపాదించిన హెచ్1బీ ఫీజు పెంపు , వేతనాధారిత ఎంపిక విధానం తొలత ఆందోళన కలిగించినప్పటికీ లోతుగా విశ్లేషిస్తే ఇది అమెరికాలో మాస్టర్స్ పూర్తి చేసి ఓపీటీ లో ఉన్న భారతీయ విద్యార్థులకు ఒక 'వరం'లా మారిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే ప్రతి ఐటీ నిపుణుడి కల హెచ్1బీ వీసా. ఇప్పటివరకు ఈ వీసా ప్రక్రియ పూర్తిగా 'లాటరీ' పద్ధతిపై ఆధారపడి ఉండేది. అంటే, అభ్యర్థి ప్రతిభతో సంబంధం లేకుండా కేవలం అదృష్టం బాగుంటేనే వీసా దక్కేది. దీనివల్ల ఎంతో నైపుణ్యం ఉండి, అధిక జీతాలు పొందే మాస్టర్స్ విద్యార్థులు కూడా లాటరీలో పేరు రాక వెనుదిరగాల్సిన పరిస్థితి ఉండేది.
అయితే, తాజా ప్రతిపాదనల ప్రకారం హెచ్1బీ ఫీజును సుమారు 100,000 డాలర్లకు పెంచడం.. ఎంపిక ప్రక్రియను వేతన స్థాయి ఆధారంగా మార్చడం వల్ల సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి.
లాటరీ నుంచి వేతన ఆధారిత ఎంపికకు మార్పు
కొత్త విధానం ప్రకారం అమెరికా ప్రభుత్వం అభ్యర్థులను వారి జీతాల స్థాయిని బట్టి వర్గీకరిస్తుంది. లెవల్ 1లో అత్యధిక నైపుణ్యం, వేతనం ఉన్నవారు. లెవల్ 2లో మధ్యస్థ నైపుణ్యం కలిగిన నిపుణులు ఉంటారు. లెవల్ 1లో ప్రారంభ స్థాయి ఉద్యోగులు ఉంటారు. గతంలో లాటరీ అందరికీ సమానంగా ఉండేది. కానీ ఇప్పుడు లెవల్ 2 లేదా అంతకంటే ఎక్కువ వేతనం పొందుతున్న వారికి వీసా లభించే అవకాశాలు 90% పైగా పెరిగాయి. అమెరికాలో మాస్టర్స్ పూర్తి చేసిన భారతీయ విద్యార్థులు సహజంగానే మంచి నైపుణ్యంతో లెవల్ 2 వేతన విభాగంలోకి వస్తారు. దీనివల్ల వారి వీసా అప్రూవల్ అవకాశాలు గణనీయంగా మెరుగుపడ్డాయి.
ఓపీటీ విద్యార్థులకు అనుకోని లాభం
ప్రస్తుతం అమెరికాలో ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ) లో ఉన్న వేలాది మంది భారతీయులకు ఇది పెద్ద ఊరట. వీరు ఇప్పటికే అమెరికా కంపెనీలలో పనిచేస్తూ మంచి ప్యాకేజీలను అందుకుంటున్నారు. లాటరీ పద్ధతిలో వీరికి రిస్క్ ఎక్కువగా ఉండేది. కానీ వేతనాధారిత విధానం వల్ల, కంపెనీలు భారీ ఫీజు చెల్లించడానికి సిద్ధపడితే, వీరి వీసా దాదాపు ఖాయమైనట్లే. "ప్రతిభకు గుర్తింపు లభించే కాలం వచ్చింది. కేవలం అదృష్టం మీద ఆధారపడకుండా, మా కష్టానికి తగ్గ ప్రతిఫలం వీసా రూపంలో దక్కుతుందనే నమ్మకం కలిగింది" అని టెక్సాస్‌లో పనిచేస్తున్న ఒక భారతీయ విద్యార్థి అభిప్రాయపడ్డారు.
కంపెనీల వ్యూహంలో మార్పు
100,000 డాలర్ల ఫీజు అనేది చిన్న విషయం కాదు. దీనివల్ల కంపెనీలు నాణ్యత లేని అభ్యర్థుల కోసం దరఖాస్తు చేయడం తగ్గిస్తాయి. కేవలం 'టాప్ టాలెంట్' కోసం మాత్రమే ఈ మొత్తాన్ని ఖర్చు చేస్తాయి. దీనివల్ల కన్సల్టెన్సీల ద్వారా జరిగే అక్రమాలకు.. నకిలీ దరఖాస్తులకు అడ్డుకట్ట పడుతుంది. నిజమైన ప్రతిభ ఉన్న భారతీయ విద్యార్థులకు పోటీ తగ్గుతుంది.
సవాళ్లు లేకపోలేదు..
అయితే ఈ నాణేనికి మరో పార్శ్వం కూడా ఉంది. చిన్న కంపెనీలు లేదా స్టార్టప్‌లు ఇంత భారీ ఫీజును భరించలేకపోవచ్చు. దీనివల్ల కొత్తగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారికి ప్రారంభంలో అవకాశాలు తగ్గే ప్రమాదం ఉంది. కేవలం బ్యాచిలర్స్ పూర్తి చేసి, లెవల్ 1 వేతనంతో ఉండేవారికి హెచ్1బీ దక్కడం ఇకపై దాదాపు అసాధ్యం కావచ్చు.
మొత్తంగా చూస్తే ట్రంప్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం అమెరికా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు ఉన్నత విద్యావంతులైన భారతీయులకు మేలు చేసేలా కనిపిస్తోంది. లక్షల రూపాయలు ఖర్చు చేసి అమెరికాలో మాస్టర్స్ చదివిన విద్యార్థులకు ఈ వేతనాధారిత విధానం ఒక రకమైన సామాజిక న్యాయాన్ని చేకూరుస్తోంది. అదృష్టం కంటే 'మెరిట్' కే ప్రాధాన్యత ఇచ్చే ఈ విధానం దీర్ఘకాలంలో భారతీయ ఐటీ రంగానికి కూడా మేలు చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
