H-1B వీసా $100,000 ఫీజు: ఎవరికి ఎఫెక్ట్..? ఎవరికి కాదు?
అమెరికా ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో భారతీయ ఐటీ నిపుణులు, విద్యార్థుల భవిష్యత్తుపై భారీ ప్రభావం చూపనుంది.
By: A.N.Kumar | 20 Sept 2025 2:44 PM ISTఅమెరికా ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో భారతీయ ఐటీ నిపుణులు, విద్యార్థుల భవిష్యత్తుపై భారీ ప్రభావం చూపనుంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని ప్రభుత్వం H-1B వీసా పిటిషన్లపై $100,000 (సుమారు రూ.83 లక్షలు) అనే సంచలనాత్మక ఫీజును విధించింది. ఇప్పటివరకు ఎప్పుడూ లేని విధంగా ఈ భారీ ఫీజు కారణంగా అమెరికాలో ఉద్యోగ అవకాశాలను ఎదురుచూస్తున్న వేలాది మంది యువతకు, ప్రత్యేకంగా భారతీయ ఐటీ ఉద్యోగులకు పెద్ద దెబ్బ తగలనున్నట్లు అంచనా వేస్తున్నారు.
* ఎవరికీ వర్తిస్తుంది?
- అమెరికా వెలుపల కొత్తగా H-1B వీసా కోసం దరఖాస్తు చేసే వారు
-వీసా గడువు ముగిసి కొత్త పిటిషన్ వేయాల్సి వచ్చిన వారు
- OPT మీద చదువుకోవడం పూర్తిచేసి H-1Bకి మారి బయట దేశాలకు వెళ్ళి స్టాంపింగ్ చేయించుకునే విద్యార్థులు
- అమెరికా వెలుపల నుంచే గ్రీన్ కార్డు కోసం కాన్సులర్ ప్రాసెసింగ్ చేసుకునే వారు
*ఎవరికీ వర్తించదు?
-ఇప్పటికే అమెరికాలో H-1B వీసాపై పని చేస్తున్న వారు
- అమెరికా లోపలే ఉద్యోగం మార్చుకునే H-1B ట్రాన్స్‌ఫర్స్ చేసుకునే వారు
- H-1B వీసా పొడిగింపు కోసం అమెరికాలోనే దరఖాస్తు చేసుకునే వారు
- చెల్లుబాటు అయ్యే H-1B స్టాంప్‌తో అమెరికా బయటకు వెళ్లి తిరిగి వచ్చేవారు
* అమెరికాలో OPT నుండి H-1Bకి చేంజ్ ఆఫ్ స్టేటస్ చేసుకునే వారు
- అమెరికాలోనే I-485 (అడ్జస్ట్ మెంట్ ఆఫ్ స్టేటస్ ) ద్వారా గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే వారు
*ప్రభావం ఏమిటి?
ఈ భారీ ఫీజు కొత్తగా అమెరికా ప్రయాణించాలనుకునే విద్యార్థులు, ఐటీ ప్రొఫెషనల్స్‌పై నేరుగా ప్రభావం చూపనుంది. ఇప్పటివరకు విద్యతో పాటు తక్కువ అడ్డంకులతో అమెరికాలో ఉద్యోగ అవకాశాలు పొందినవారికి ఇప్పుడు ఈ ఫీజు భారీగా భారం కానుంది. ముఖ్యంగా భారతీయ ఐటీ ఉద్యోగులు, కన్సల్టింగ్ సంస్థలు తమ వ్యూహాలను మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
భారతీయ ఐటీ పరిశ్రమ ఇప్పటికే అమెరికా వలస పాలసీలతో ఇబ్బందులు పడుతుండగా.. ఈ కొత్త ఫీజు వారి గ్లోబల్ నియామకాలపై ప్రతికూల ప్రభావం చూపనుంది. పరిశ్రమ నిపుణుల ప్రకారం.. “అమెరికా టాలెంట్‌కి తలుపులు మూసేస్తోంది. దీని ఎఫెక్ట్‌గా కంపెనీలు తమ ఉద్యోగ నియామక కేంద్రాలను ఇతర దేశాలకు మార్చే అవకాశముంది” అని భావిస్తున్నారు.
అమెరికాలో చదువుకునే విద్యార్థులకు కూడా ఈ ఫీజు పెద్ద తలనొప్పిగా మారింది. OPT ముగిసిన తరువాత H-1B వీసా పొందడానికి ప్రయత్నించే సమయంలో $100,000 వంటి భారీ ఖర్చు చేయాల్సి రావడం వల్ల అనేక కుటుంబాలపై ఆర్థిక భారం పెరుగుతుంది.
మొత్తానికి అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం భారతీయ ఐటీ రంగం, విద్యార్థులపై ఒక్కసారిగా భారీ ఆర్థిక, వృత్తి భారం మోపింది. అమెరికా కలల కోసం ఎదురుచూస్తున్న వారికి ఇకపై H-1B వీసా సాధించడం కేవలం సామర్థ్యం మాత్రమే కాకుండా.. ఆర్థికంగా కూడా శక్తి ఉన్నవారి పని అయిపోనుంది.
