హెచ్-1బీ వీసాల దరఖాస్తుల విషయంలో భారత ఐటీ దిగ్గజం సంచలన నిర్ణయం!
ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు స్వీకరించిన తర్వాత హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్ పై తీవ్ర చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే.
By: Raja Ch | 2 Dec 2025 6:00 PM ISTట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు స్వీకరించిన తర్వాత హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్ పై తీవ్ర చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది సెప్టెంబర్ లో కొత్త హెచ్-1బీ వీసాల దాఖలు కోసం $1,00,000 బ్లాంకెట్ ఫీజును ట్రంప్ పరిపాలన ప్రవేశపెట్టింది. ఈ సమయంలో.. హెచ్-1బీ స్పెషాలిటీ ఆక్యుపేషన్ వీసా కేటగిరీపై తీవ్ర చర్చ జరుగుతున్న నేపథ్యంలో భారత ఐటీ దిగ్గజం కీలక నిర్ణయం తీసుకుంది.
అవును.. ప్రధాన టెక్ కంపెనీలు అమెరికన్లను నియమించుకోవడానికి బదులుగా విదేశీ కార్మికులపైనే ఎక్కువగా ఆధారపడుతున్నాయని పలువురు రాజకీయ నాయకులు, వారి మద్దతుదారులు బలంగా వాదిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో.. ప్రస్తుత వీసా వ్యవస్థను మోసంగా కూడా వారు అభివర్ణిస్తున్నారు. ఈసమయంలో భారత ఐటీ దిగ్గజ సంస్థల్లో ఒకటైన ‘ఎల్టీమైండ్ ట్రీ’ ఇకపై కొత్త హెచ్1-బీ వీసా దరఖాస్తులను దాఖలు చేయడాన్ని ఆపేసింది!
మనీకంట్రోల్ నివేదిక ప్రకారం... సంస్థ ఇప్పుడు విదేశీ మార్కెట్లలో ఎక్కువ మంది స్థానిక ప్రతిభను నియమించుకోవడంపైనే దృష్టి సారిస్తుందని ‘ఎల్టీమైండ్ ట్రీ’ కంపెనీ సీఈఓ వేణుగోపాల్ లంబు తెలిపారు. తమ సంస్థ కొత్త విధనం రాబోయే హెచ్-1బీ లాటరీ సైకిల్ కింద తాజా పిటిషన్లకు మాత్రమే వర్తిస్తుందని ఆయన స్పష్టం చేశారు. భవిష్యత్తులో అమెరికా నిబంధనలు మారితే తమ సంస్థ తాజా వైఖరిని పునఃపరిశీలించొచ్చని ఆయన తెలిపారు.
ఇదే సమయంలో... తమ కంపెనీలో ప్రపంచవ్యాప్తంగా 86,000 కంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉండగా.. అమెరికాలో 4,000 మంది హెచ్-1బీ కార్మికులను నియమిస్తోందని వేణుగోపాల్ తెలిపారు. తమ సంస్థ ఇప్పటికే వీసా వర్గంపై ఆధారపడటాన్ని తగ్గించిందని.. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, ఖర్చులను నియంత్రించడానికీ స్థానికంగా నియామకాలు చేసుకోవడం ప్రాముఖ్యతను ఆయన నొక్కి చెప్పారు.
కాగా... యూ.ఎస్.సీ.ఐ.ఎస్. వెబ్ సైట్ ప్రకారం 2025 ఆర్థిక సంవత్సరానికి ఆదాయం పరంగా భారతదేశంలో ఆరవ అతిపెద్ద ఐటీ సంస్థ అయిన ఎల్టీమైండ్ ట్రీ 1,807 హెచ్1-బీ వీసా ఆమోదాలు పొందాయి. మరోవైపు.. నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ ప్రకారం.. టాప్ ఏడు భారతీయ ఐటీ సంస్థల నుంచి ఆమోదించబడిన హెచ్-1బీ పిటిషన్లు 2015 ఆర్ధిక సంవత్సరంలో 15,100 నుంచి 2023 ఆర్ధిక సంవత్సరంలో 6,700కు పడిపోయాయి.
'ప్రతీ హెచ్-1బీ కార్మికుడిని తొలగిస్తాను'!:
మరోవైపు.. 2026లో ఫ్లోరిడా గవర్నర్ రేసులో ఉన్న మాజీ "డోజ్" ఆర్కిటెక్ట్, హెడ్జ్ ఫండ్ వ్యవస్థాపకుడు జేమ్స్ ఫిష్ బ్యాక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా తన ఎన్నికల వాగ్ధానంలో భాగంగా... రాష్ట్ర ప్రభుత్వం కోసం పనిచేస్తున్న ప్రతీ హెచ్-1బీ కార్మికుడిని తొలగిస్తానని.. విదేశీ కార్మికులను నియమించుకునే కంపెనీలతో ఒప్పందాలు రద్దు చేసుకుంటామని అన్నారు. ఈ ఎన్నికల ప్రచారం ఆన్ లైన్ వేదికగా తీవ్ర చర్చకు దారి తీసింది.
అయితే దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. ఇది పూర్తీగా రాజకీయ నాటకం అని.. ఫ్లోరిడా ఇప్పటికే కొత్త వ్యాపార సృష్టిలో నంబర్ 1 స్థానంలో ఉందని, రికార్డ్ స్థాయిలో తక్కువ నిరుద్యోగ సమస్యను కలిగి ఉందని.. కంపెనీలు అమెరికన్ కార్మికులను కనుగొనడంతో ఇబ్బంది పడటం లేదని అంటున్నారు. ఇదే సమయంలో.. అమెరికన్లను నియమించుకోవాలంటే ముందుగా నిజమైన నేరస్థులను వెతకాలని, చట్టబద్ధమైన హెచ్-1బీ నిపుణులను కాదని సూచిస్తున్నారు.
