సీఈసీ మీద విపక్షం బాణం...అసలు తొలగించవచ్చా ?
కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి జ్ఞానేశ్వర్ కుమార్ మీద ప్రతిపక్షాలు గట్టిగానే గురి పెట్టారు. ఆయన్ని దిగిపోవాలని కోరుతున్నారు.
By: Satya P | 24 Sept 2026 11:59 PM ISTకేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి జ్ఞానేశ్వర్ కుమార్ మీద ప్రతిపక్షాలు గట్టిగానే గురి పెట్టారు. ఆయన్ని దిగిపోవాలని కోరుతున్నారు. ఆయన రాజీనామాకు పెద్ద ఎత్తున డిమాండ్లు వస్తున్నాయి. అదే సమయంలో ఇలా లాభం లేదనుకుంటూ పార్లమెంట్ లో అభిశంసన పెట్టి మరీ తొలగించాలని అతి పెద్ద ప్రయత్నం తెర వెనక జరుగుతోంది. అంటే ఈ శీతాకాలం సమావేశాలకు ముందే అగ్గి రాజుకుంది అన్న మాట. ఇంతకీ ఉన్నట్లుండి జ్ఞానేశ్ కుమార్ మీద అంతా కలిసి ఒక్కసారిగా విరుచుకుపడటానికి కారణం ఏంటి అంటే ఆయన అంతా తానై వ్యవహరిస్తున్నారు అని. ప్రధాన ఎన్నికల సంఘం సీఈసీ హోదాలో జ్ఞానేశ్ కుమార్ ఇద్దరు తోటి కమిషనర్లను సంప్రదించకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారనే ఆరోపణలపై దేశవ్యాప్తంగా తీవ్ర వివాదం చెలరేగుతోంది.
మూకుమ్మడిగా దాడి :
గత పది నెలలుగా చూస్తే సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తీసుకున్న నిర్ణయాలపై తోటి ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి 14 సార్లు రాతపూర్వకంగా అధికారిక అభ్యంతరాలు తెలిపారు అని ప్రచారంలో ఉంది. అంతే కాదు ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ సర్ ప్రక్రియ విషయంలో కూడా ఈ ముగ్గురి మధ్యన విభేదాలు ఏర్పడ్డాయని అంటున్నారు. ఇక కొత్త ఓటర్ల నమోదు కోసం ఫారం-6లో అనధికారిక మార్పులు, ఐటీ విభాగం ద్వారా ఓటర్ల రోల్ డేటాబేస్ కేంద్రీకరణ వంటి నిర్ణయాలు తమకు తెలియకుండానే జరిగాయని ఆ ఇద్దరు కమిషనర్లు అంటున్నారని ప్రచారంలో ఉంది. ఇలా చూస్తే కేంద్ర ఎన్నికల సంఘం లో మెజారిటీ సభ్యుల అనుమతి లేకుండా నిర్ణయాలు తీసుకోవడం రాజ్యాంగ విరుద్ధమని విమర్శలు వస్తున్నాయి. ఇదీపుడు ప్రతిపక్షాలకు అతి పెద్ద అస్త్రం అయి కూర్చుంది. దాంతో కాంగ్రెస్, సీపీఎం, తృణమూల్ కాంగ్రెస్, ఆప్, ఆర్‌జేడీ, డీఎంకే వంటి విపక్ష పార్టీలు సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. జ్ఞానేశ్ కుమార్ సీఈసీ హోదాలో కేవలం .బీజేపీకి మాత్రమే మేలు చేసేలా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆయన వైఖరి మీద విపక్షాలు ఫైర్ అవుతున్నాయి. అందుకే .సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తక్షణమే పదవి నుంచి తొలగించి ఆయనపై అభిశంసన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నయి.
తొలగించే వీలుందా :
అయితే చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌ను తొలగించాలని విపక్షాలు డిమాండ్ చేయడం వరకూ బాగానే ఉన్నా ఆయ్నని నేరుగా తొలగించే అధికారం మాత్రం ఎవరికీ ఉండదని రాజ్యాంగం చెబుతోంది. అక్కడ ఆర్టికల్ 324(5) ప్రకారం చూస్తే చాలా స్పష్టంగా రూల్స్ ఉన్నాయి. సీఈసీ అభిశంసన కోసం ముందు లోక్‌సభలో కనీసం 100 మంది ఎంపీలు అలాగే రాజ్యసభలో కనీసం 50 మంది ఎంపీలు సంతకం చేసి లోక్ సభ స్పీకర్ కి అలాగే రాజ్యసభ ఛైర్మన్‌కు అందచేయలి. ఒక వేళ ఈ తీర్మానాన్ని లోక్ సభ స్పీకర్ కానీ రాజ్యసభ చైర్మన్ కానీ ఆమోదించి చర్చ చేపట్టకపోతే ఈ మొత్తం తీర్మానం ఆగిపోతుంది.
ఆ ప్రక్రియ ఈ విధంగా :
ఇక కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్ ని పదవి నుంచి తొలగించవచ్చు కానీ దీనికి అత్యంత కఠినమైన పార్లమెంటరీ అభిశంసన ప్రక్రియ ఉంది అని గుర్తు చేసుకోవాలి. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 324(5) ప్రకారం సుప్రీంకోర్టు న్యాయమూర్తిని ఏ పద్ధతిలో ఏ కారణాల చేత తొలగిస్తారో అదే పద్ధతిలో సీఈసీని కూడా తొలగించవచ్చు. తొలగింపునకు కారణాలు కూడా నిరూపించబడాలి. అసమర్థత లేదా దుష్ప్రవర్తన ఆధారంగా మాత్రమే తొలగించడానికి వీలవుతుంది. అయితే దీనిని పార్లమెంట్ లో మెజారిటీ అవసరం అవుతుంది. పార్లమెంట్‌లోని ఉభయ సభలు అంటే లోక్‌సభ రాజ్యసభ రెండింటిలో ప్రత్యేక మెజారిటీతో అంటే మొత్తం సభ్యులలో మెజారిటీగా చూస్తారు. అలా సభకు హాజరై ఓటు వేసిన వారిలో కనీసం మూడింట రెండు వంతుల మంది ఈ అభిశంసన తీర్మానాన్ని ఆమోదించాల్సి ఉంటుంది. మరి అలా జరగాలంటే విపక్షాలకు పార్లమెంట్ లో బలం ఉందా అన్నది చూడాలి. ప్రస్తుతం అయితే ఉభయ సభలలో బీజేపీకే మెజారిటీ ఉంది. దాంతో ఈ తొలగింపు సాధ్యపడుతుందా అంటే ఆలోచించాల్సిందే అని అంటున్నారు. ఇలా తొలగించిన తరువాత సుప్రీం కోర్టు జస్టిస్, అలాగే హై కోర్టు చీఫ్ జస్టిస్ ఇతర న్యాయనిపుణులతో దర్యాప్తు చేయిస్తారు. అలా ఆయన మీద ఆరోపణలు నిజమని తేలాక పార్లమెంటులో తీర్మానం ప్రవేశపెట్టి మెజారిటీ ఓటింగ్‌తో తొలగించవచ్చు అని నిబంధనలు చెబుతున్నాయి.
