రాజీ లేని మూడు డిమాండ్లు...కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ
కేంద్రంలో బీజేపీ సర్కార్ కి 2026 ద్వితీయార్ధం రాజకీయంగా అచ్చిరాలేదా అన్న చర్చ అయితే ముందుకు వస్తోంది. అది ఎలాగంటే నీట్ పరీక్ష పేపర్ లీక్ తో దేశమంతా ఒకసారి దద్దరిల్లింది.
By: Satya P | 6 Oct 2026 11:00 PM ISTకేంద్రంలో బీజేపీ సర్కార్ కి 2026 ద్వితీయార్ధం రాజకీయంగా అచ్చిరాలేదా అన్న చర్చ అయితే ముందుకు వస్తోంది. అది ఎలాగంటే నీట్ పరీక్ష పేపర్ లీక్ తో దేశమంతా ఒకసారి దద్దరిల్లింది. ఫలితంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన ఆందోళనలో విద్యార్ధి లోకం జెన్ జీ యువత చేసిన బిగ్ సౌండ్ కి మోడీ ప్రభుత్వంలోని కీలకమైన కేంద్ర మంత్రి ఒకరు రాజీనామా చేసి తప్పుకోవాల్సి వచ్చింది. 2014 నుంచి ఇప్పటిదాకా ఎదురులేకుండా సాగిన మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి ఇది తొలి దెబ్బగా అంతా అభివర్ణించారు. అది జరిగిన కొద్ది నెలలకే ఇపుడు కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ఇష్యూతో ఎన్డీయే సర్కార్ ఇబ్బందులు పడుతోంది. మరోసారి సీజేపీ జంతర్ మంతర్ ని వేదికగా ఎంచుకుని ఆందోళనలు చేపట్టింది. ఇక కాంగ్రెస్ అయితే భారీ నిరసనలను దేశవ్యాప్తంగా చేపడుతోంది.
డిమాండ్లతో దూకుడు :
ఇక చూస్తే కాంగ్రెస్ పార్టీ ఈసారి కేంద్రం మీద తీవ్ర స్థాయిలో ఒత్తిడి పెంచుతోంది. అదే సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం విషయంలో అలుపు లేని పోరాటం చేస్తామని జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గె స్పష్టం చేశారు. రాజీలేని మూడు డిమాండ్లతో కాంగ్ర్స్ పార్టీ ముందుకు సాగుతుందని ఆయన తెలిపారు. అందులో మొదటిది అయితే సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా తక్షణం చేయాలని కాంగ్రెస్ అంటోంది. అలాగే ఓటర్ల జాబితా సవరణ కోసం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్ ప్రక్రియను పూర్తిగా రద్దు చేయాలని కోరుతోంది. ఇక ప్రస్తుతం వాడుతున్న ఈవీఎంల స్థానంలో తిరిగి పాత పద్ధతి అయిన బ్యాలెట్ పేపర్ల ద్వారానే దేశంలో ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది.
దూకుడు మీదనే :
కాంగ్రెస్ తమ డిమాండ్ల సాధన విషయంలో ఏ మాత్రం ఉపేక్షించకూడదని నిర్ణయించింది. దూకుడుగా ముందుకు సాగాలని అనుకుంటోంది. జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేసి తీరాలని అంటోంది. ఇదే కనుక జరిగితే కాంగ్రెస్ కి అతి పెద్ద విజయం దక్కుతుందని భావిస్తోంది. మరి సర్ ప్రక్రియ విషయంలో రద్దు చేస్తారా లేదా అన్నది చూడాలి. అలాగే ఈవీఎంల నుంచి బ్యాలెట్ పేపర్ కి రావడం అన్నది కూడా పెద్ద డిమాండ్ గానే ఉంది. మరి ఈ మూడు డిమాండ్లలో కాంగ్రెస్ ఎన్ని నెగ్గించుకుంటుంది అన్నది చూడాల్సి ఉంది. ఇక కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం మీద కూడా ఇదే అంశం మీద రాజకీయ పోరాటం చేస్తోంది. బీజేపీకి ప్రయోజనం చేకూరేలా జ్ఞానేశ్ కుమార్ వ్యవహరిస్తున్నారు అన్నది కాంగ్రెస్ చేస్తున్న అతి పెద్ద అభియోగం. దీని ద్వారా బీజేపీని దాని విజయాలను నైతికతను దెబ్బ తీయాలని వ్యూహాత్మక వైఖరిని అనుసరిస్తోంది.
కార్నర్ అవుతున్న తీరు :
ఇదే ఇపుడు ఎన్డీయేకు కూడా చికాకుగా ఉందని అంటున్నారు. ఈసీ జ్ఞానేశ్ కుమార్ మీద ఆరోపణలు విమర్శలు చివరికి బీజేపీ ఎన్డీయే మీదకు మళ్ళుతున్నాయి. మరి ఈ సమయంలో ఎన్డీయే పెద్దలు ఏ విధంగా చేస్తారు, కాంగ్రెస్ దూకుడుకు రాజకీయంగా ఎలా చెక్ పెడతారు అన్నది అయితే చూడాల్సి ఉంది. సరిగ్గా మోడీ పాతికేళ్ళ ప్రజా జీవిత ప్రస్థానంలో సంబరాలు జరుగుతున్న వేళ కాంగ్రెస్ ఎంచుకున్న ఈ సుదీర్ఘమైన పోరాటం ఏ కీలక మలుపు తిరుగుతుందో చూడాల్సి ఉంది. మరోసారి దేశంలో కాంగ్రెస్ వర్సెస్ ఎన్డీయేగా అతి పెద్ద రాజకీయ సమరానికి తెర లేచింది అని చెప్పాలి. దానికి నాందిగా ఈసీ ఆఫీసు ముందు కాంగ్రెస్ చేపట్టిన నిరసన జరిగింది. రాను రానూ కాంగ్రెస్ తన పోరాటాన్ని తీవ్రతరం చేస్తుందని అంటున్నారు.
