Begin typing your search above and press return to search.

జ్ఞానేష్ మంచి వాడు: మాజీ న్యాయ‌మూర్తులు!

కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌ధాన క‌మిష‌న‌ర్.. జ్ఞానేష్ కుమార్‌కు వ్య‌తిర‌కంగా కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఇండియా కూటమి స‌హా కాక్రోచ్ జ‌న‌తా పార్టీ కూడా పెద్ద ఎత్తున నిర‌స‌న‌లు వ్య‌క్తం చేస్తున్నారు.

By:  Garuda Media   |   8 Oct 2026 10:00 PM IST
జ్ఞానేష్ మంచి వాడు:  మాజీ న్యాయ‌మూర్తులు!
X

కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌ధాన క‌మిష‌న‌ర్.. జ్ఞానేష్ కుమార్‌కు వ్య‌తిర‌కంగా కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఇండియా కూటమి స‌హా కాక్రోచ్ జ‌న‌తా పార్టీ కూడా పెద్ద ఎత్తున నిర‌స‌న‌లు వ్య‌క్తం చేస్తున్నారు. వ‌రుస‌గా మూడో రోజు కూడా కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ స‌హా ప‌లు రాష్ట్రాల్లో జ్ఞానేష్ కుమార్‌కు వ్య‌తిరేకంగా క‌దం తొక్కింది. ఇక‌, కాక్రోచ్ జ‌న‌తా పార్టీ నెల 10న జంత‌ర్ మంత‌ర్ వేదిక‌గా భారీ నిర‌స‌న‌కు పిలుపునిచ్చింది. దేశ‌వ్యాప్తంగా యువ‌త త‌ర‌లి రావాల‌ని కోరింది. దీంతో దేశ‌వ్యాప్తంగా యువ‌త ఢిల్లీ బాట ప‌ట్ట‌నున్నారు.

మొత్తం గా కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ జ్ఞానేష్ కుమార్‌ను ఆ ప‌ద‌వి నుంచి దింపేయాల‌ని.. లేదా ఆయ‌నే స్వయంగా రాజీనామా చేయాల‌న్న‌ది ప్ర‌ధాన డిమాండ్‌. దీనిపై కేంద్ర ప్ర‌భుత్వం మౌనంగా ఉంది. ముఖ్యంగా ప్ర‌భుత్వ పెద్ద లు ఎవరూ కూడా ఈ విష‌యంలో జోక్యం చేసుకోవ‌డం లేదు. కాగా.. తాజాగా సుప్రీంకోర్టు స‌హా ఉత్త‌రాది రాష్ట్రాల్లోని ప‌లు హైకోర్టుల‌కు చెందిన రిటైర్డ్ న్యాయ‌మూర్తులు స్పందించారు. సుమారు 42 మంది మాజీ న్యాయ‌మూర్తులు.. వీరిలో మ‌హిళా న్యాయ‌మూర్తులు కూడా ఉన్నారు.

వీరంతా కూడా జ్ఞానేష్ కుమార్‌ను ల‌క్ష్యంగా చేసుకుని విప‌క్షాలు స‌హా.. ఇత‌ర స్వ‌చ్ఛంద సంస్థ‌లు ఆందోళ‌న చేయ డాన్ని ఖండించారు. ఎలాంటి ఆధారాలులేకుండా జ్ఞానేష్ కుమార్‌పై దాడి చేస్తున్నార‌ని.. ఇది మంచిది కాద‌ని వ్యాఖ్యానించారు. ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ‌లో నిర‌సన వ్య‌క్తం చేసేందుకు అవ‌కాశం ఉన్న‌ప్ప‌టికీ.. ఇలా ఒక కీల‌క రాజ్యాంగ బ‌ద్ధ‌మైన ప‌ద‌విలో ఉన్న అధికారిని ల‌క్ష్యంగా చేసుకుని దాడి చేయ‌డం స‌రికాద‌ని వ్యాఖ్యానించారు. ఎన్నిక‌ల సంఘం చేసే సంస్క‌ర‌ణ‌లు దేశం కోస‌మేన‌ని తెలిపారు.

అదే స‌మ‌యంలో `స‌ర్‌` ప్ర‌క్రియ‌ను సుప్రీంకోర్టు స‌మ‌ర్థించిన విష‌యాన్ని కూడా న్యాయ‌మూర్తులు ప్ర‌స్తావించారు. ఏదైనా లోపాలు ఉంటే.. వాటిని స‌రి చేసుకునేందుకు సూచ‌న‌లు స‌ల‌హాలు ఇవ్వొచ్చ‌ని, కానీ, రాజ్యాంగ బ‌ద్ధ‌మైన ప‌ద‌విలో ఉన్న అధికారిని ల‌క్ష్యంగా చేసుకోవ‌డం త‌గ‌ద‌ని పేర్కొన్నారు. ఇది రాజ‌కీయ వ్యూహంలో భాగంగా ఉందే త‌ప్ప‌.. ఇది ప్ర‌జాకోణంలో క‌నిపించ‌డం లేద‌ని వ్యాఖ్యానించారు. ఈ మేర‌కు 42 మంది మాజీ న్యాయ‌మూర్తులు త‌మ సంత‌కాల‌తో కూడిన ప‌త్రాన్ని సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తికి పంపించారు.