2029 వరకు సీఈసీ జ్ఞానేశ్ కుమార్ పదవీకాలం.. ఈ లొల్లి ఇంకెంత కాలం?
దేశ రాజకీయాలు అన్నీ ఇప్పుడు కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ చుట్టూ తిరుగుతున్నాయి.
By: Tupaki Political Desk | 10 Oct 2026 10:47 PM ISTదేశ రాజకీయాలు అన్నీ ఇప్పుడు కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ చుట్టూ తిరుగుతున్నాయి. దేశ చరిత్రలో ఇంతకు ముందు ఎన్నడూ లేనివిధంగా రాజ్యాంగ బద్ధ పదవిలో ఉన్న అధికారిని తప్పుకోమని విపక్షాలు, సీజేపీ వంటి నిరసన కారులు డిమాండ్ చేస్తున్నారు. 2025 ఫిబ్రవరి 19న సీఈసీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జ్ఞానేష్ కుమార్ వరుస వివాదాల్లో చిక్కుకున్నారు. ముఖ్యంగా ఆయన ఆధ్వర్యంలో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం తీవ్ర వివాదాస్పదమైంది. దేశవ్యాప్తంగా కోట్లాది ఓట్లు తొలగించడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో ఆయన పనితీరును సమర్థిస్తూ గట్టిగానే వాదనలు వినిపిస్తున్నవారూ ఉన్నారు. ఇలా ఒక అధికారి కోసం దేశంలో ఈ స్థాయిలో చర్చ జరగడం గతంలో లేదని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. సరిగ్గా ఏడాదిన్నర క్రితం సీఈసీగా బాధ్యతలు స్వీకరించిన జ్ఞానేష్ కుమార్ పదవీకాలం 2029 జనవరి వరకు ఉందని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఆయనకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు ఎంతవరకు కొనసాగుతాయి? ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రధాన ఎన్నికల అధికారిపై అనుమానాలు వ్యక్తం చేయడం వల్ల ఎదురయ్యే పరిణామాలు ఏంటి అన్న చర్చ ఎక్కువగా జరుగుతోంది.
మిశ్రమ స్పందన
సీఈసీ జ్ఞానేష్ కుమార్ విషయంలో దేశంలో రెండు రకాల వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో ఆయన రాజీనామా చేయాలన్న డిమాండ్ మాత్రమే ఎక్కువ సౌండ్ చేస్తోంది. సీఈసీ రాజ్యాంగ బద్ధంగానే పనిచేస్తున్నారని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుతోపాటు సుప్రీంకోర్టు మాజీ జడ్జిలు వెనకేసుకు వస్తున్నా ఆ వాదన ప్రజల్లోకి బలంగా వెళ్లలేదని అంటున్నారు. ముఖ్యంగా లోక్ సభలో విపక్ష నాయకుడు రాహుల్ గాంధీ క్షేత్రస్థాయికి దూసుకుపోయి పోరాటం చేయడం, ఆయనకు తోడుగా ఎంపీ ప్రియాంక గాంధీ కూడా రోడ్డెక్కడం సోషల్ మీడియాను ఊపేస్తోంది. అంతేకాకుండా ఈ విషయంలో దేశంలోని ప్రతిపక్షాలు అన్నీ ఏకతాటిపైకి రావడం కూడా రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. మరోవైపు నుంచి కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జెన్ జీ యువత కూడా ప్రత్యక్ష పోరాటానికి దిగడం సీఈసీపై ఒత్తిడి పెంచుతోందని అంటున్నారు.
ఎందుకింత వ్యతిరేకత
దేశంలో ఎన్నికల అధికారులుగా ఎందరో పనిచేశారు. కానీ ఇంతకుముందు పనిచేసిన వారి కంటే ఎక్కువగా సీఈసీ జ్ఞానేష్ కుమార్ విమర్శలు, వ్యతిరేకత ఎదుర్కొనడానికి అనేక కారణాలు చూపుతున్నారు. ఇందులో రాజకీయాలే కాకుండా ఆయనకు కేంద్ర ప్రభుత్వ పెద్దలతో ఉన్న సంబంధాలు కూడా అతిపెద్ద కారణమని అంటున్నారు. నిజానికి సీఈసీని తొలగించాలంటే ఇంతకుముందే దేశంలోని ప్రతిపక్షాలు అన్నీ ఏకమయ్యాయి. మొత్తం 193 మంది ఎంపీలు సీఈసీపై అభిశంసనకు సిద్ధమయ్యారు. ఈ పరిస్థితులను చాకచక్యంగా అధిగమించిన తర్వాత ఇలాంటి పరిస్థితి నెలకొనడమే రాజకీయంగా వాతావరణాన్ని వేడెక్కించింది. నిజానికి సీఈసీని తొలగించడం అంటే అంత తేలికైన విషయం కాదని అంటున్నారు. కానీ, ప్రతిపక్షాలు, కాక్రోచ్ కార్యకర్తలు మాత్రం ఈ విషయంలో బెట్టు దిగమన్నట్లుగా నిరసనలు కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో ఏం జరుగుతుందనే ఉత్కంఠ నెలకుందని అంటున్నారు.
రాజీనామా చేయక తప్పదా?
ప్రతిపక్షాలు, సీజేపీ కార్యకర్తల ఆందోళనతో సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయక తప్పదా? అనే చర్చ ఎక్కువగా జరుగుతోంది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ పెద్దల అభిప్రాయం ఏంటనేది తెలియాల్సివుందని అంటున్నారు. ఒత్తిళ్లకు తలొగ్గి సీఈసీతో రాజీనామా చేయిస్తే కేంద్ర ప్రభుత్వం రాజకీయంగా తీరని అవమానాన్ని ఎదుర్కొన్నట్లుగానే చెబుతున్నారు. అదే సమయంలో సీఈసీని కొనసాగించడానికి మొగ్గు చూపితే ఈ చర్చ, రచ్చ ఇప్పట్లో ఆగే పరిస్థితి కనిపించడం లేదని అంటున్నారు. ఎన్నికలకు మరో రెండేళ్ల సమయం ఉండటం, పైగా వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ వంటి కీలక రాష్ట్రానికి ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో పరిస్థితిని ఎలా ఎదుర్కొవాలనే విషయమై కేంద్ర పెద్దలు మల్లగుల్లాలు పడుతున్నారని చెబుతున్నారు. ఈ విషయంలో తగిన సమయంలో సరైన నిర్ణయం తీసుకుని రాజకీయంగా ఎదురైన సవాళ్లను అధిగమించాలని కేంద్ర పెద్దలు భావిస్తున్నట్లు చెబుతున్నారు.
