బీజేపీ టికెట్‌తో పోటీ చేయి.. సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై మరో సంచలన ఆరోపణ..
కేంద్ర ఎన్నికల సంఘం తీరుపై.. ముఖ్యంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియతో పాటు ఎన్నికల నిర్వహణపై ప్రతిపక్షాల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్న తరుణంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ చుట్టూ తీవ్ర వివాదం ముసురుకుంది.
By: A.N.Kumar | 27 Sept 2026 11:23 AM ISTకేంద్ర ఎన్నికల సంఘం తీరుపై.. ముఖ్యంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియతో పాటు ఎన్నికల నిర్వహణపై ప్రతిపక్షాల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్న తరుణంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ చుట్టూ తీవ్ర వివాదం ముసురుకుంది. ఆయన సివిల్ సర్వీస్‌లో ఉన్న సమయంలోనే ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా వ్యవహరించారని.. బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయాల్సిందిగా తనను కోరారని కేరళ మాజీ చీఫ్ సెక్రటరీ జిజి థామ్సన్ చేసిన తాజా వ్యాఖ్యలు ప్రస్తుతం దేశ రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలాన్ని రేపుతున్నాయి.
జిజి థామ్సన్ వెల్లడించిన కథనం ప్రకారం.. ఈ కీలక సంభాషణ 2016లో ఢిల్లీకి ప్రయాణిస్తున్న ఒక విమానంలో జరిగింది. అప్పట్లో జ్ఞానేశ్ కుమార్ తో పాటు తాను కూడా ప్రభుత్వ సర్వీసులోనే ఉన్నామని ఆయన తెలిపారు. సంభాషణ సందర్భంగా పదవీ విరమణ తర్వాత తన భవిష్యత్ ప్రణాళికల గురించి జ్ఞానేశ్ కుమార్ అడిగి తెలుసుకున్నారని.. రాజకీయాల్లోకి రావడం మంచిదని సూచించారని చెప్పారు. ముఖ్యంగా 2019 లోక్‌సభ ఎన్నికల్లో కేరళలోని పథనంతిట్ట నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున బరిలోకి దిగాలని ప్రతిపాదించారని థామ్సన్ ఆరోపించారు. అక్కడ పోటీ చేసి గెలిస్తే ఎంపీగా మాత్రమే కాకుండా.. కేంద్ర మంత్రిగా కూడా ఎదిగే అవకాశాలు ఉంటాయని తనకు ఆశ చూపినట్లు ఆయన పేర్కొన్నారు. అయితే తనకు రాజకీయాల్లోకి రావడానికి ఎలాంటి ఆసక్తి లేకపోవడంతో ఆ ప్రతిపాదనను అక్కడికక్కడే తిరస్కరించినట్లు తెలిపారు.
ఈ ఆరోపణలు వెలుగులోకి రావడంతో కాంగ్రెస్ అగ్రనేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఒక సివిల్ సర్వెంట్‌గా ఉంటూ అధికార పార్టీకి రాజకీయం చేసిన వ్యక్తిని ఇప్పుడు ఎన్నికల నిష్పక్షపాత 'అంపైర్'గా కూర్చోబెట్టారని రాహుల్ గాంధీ మండిపడ్డారు. ఇది దేశంలో ప్రజాస్వామ్యాన్ని.. ఎన్నికల ప్రక్రియను భ్రష్టు పట్టించే ప్రత్యక్ష 'మ్యాచ్ ఫిక్సింగ్' అని ఆయన విమర్శించారు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కూడా స్పందిస్తూ ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదనే అనుమానాలు బలపడుతున్నాయని.. ప్రజల అభిప్రాయానికి, వెలువడుతున్న ఫలితాలకు మధ్య స్పష్టమైన వ్యత్యాసం కనిపిస్తోందని ఆరోపించారు.
ఇప్పటికే ఎన్నికల సంఘం అంతర్గత వ్యవహారాలు, నిర్ణయాలపై ఇతర కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషిలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినట్లు వచ్చిన కథనాలు విపక్షాలకు ఆయుధంగా మారాయి. గతంలోనే 73 మంది రాజ్యసభ సభ్యులు ఆయనపై 'సాక్ష్యాధారాలతో కూడిన దుష్ప్రవర్తన' కింద తొలగింపు నోటీసు ఇవ్వగా.. ఇప్పుడు ఈ తాజా పరిణామాల నేపథ్యంలో ఆయనను పదవి నుంచి తొలగించేందుకు వీలుగా పార్లమెంటులో ఉమ్మడి ప్రతిపక్షాల తరఫున ఇంపీచ్‌మెంట్ నోటీసును సిద్ధం చేస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలుపుతున్నాయి.
మరోవైపు అంతర్గత చర్చల్లో అభిప్రాయ భేదాలు నమోదు కావడం సాధారణ పరిపాలనా ప్రక్రియలో భాగమేనని ఎన్నికల సంఘం స్పష్టం చేస్తోంది. థామ్సన్ చేసిన ఆరోపణలు ఇప్పటివరకు కేవలం వ్యక్తిగత వాదనలుగానే ఉన్నాయని.. దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక లేదా స్వతంత్ర ఆధారాలు బయటకు రాలేదని తెలుస్తోంది. ఈ వ్యవహారంపై ప్రధాన ఎన్నికల కమిషనర్ నుంచి అధికారిక స్పందన రావాల్సి ఉంది. ఒక రాజ్యాంగబద్ధమైన అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తిపై సివిల్ సర్వీస్ కాలం నాటి రాజకీయ బంధాల ఆరోపణలు రావడం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తోంది.
