Begin typing your search above and press return to search.

గూగుల్ సెర్చింగ్ : జ్ఞానేశ్ చదువులో టాపర్....అవార్డులు రివార్డులు !

సాధారణంగా కొన్ని రాజ్యాంగ వ్యవస్థల గురించి సగటు జనాలకు పట్టింపు ఉండదు, ఈ దేశ ప్రధాని ఎవరో తెలుసుకుంటారు.

By:  Satya P   |   13 Oct 2026 6:32 AM IST
గూగుల్ సెర్చింగ్ : జ్ఞానేశ్ చదువులో టాపర్....అవార్డులు రివార్డులు !
X

సాధారణంగా కొన్ని రాజ్యాంగ వ్యవస్థల గురించి సగటు జనాలకు పట్టింపు ఉండదు, ఈ దేశ ప్రధాని ఎవరో తెలుసుకుంటారు. కానీ కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి ఎవరో అన్నది జీకే కోసం చదివే వారు తప్ప మిగతా జనాభా ఆలోచించరు. కానీ ఇపుడు ఒక్కసారిగా జ్ఞానేశ్ కుమార్ దేశమంతా చర్చగా మారిపోయారు. దానికి విపక్షాలు చేస్తున్న ఆందోళన కారణం. ఓటు చోరీతో మొదలెట్టి సర్ ప్రక్రియతో దానిని పీక్స్ కి చేర్చి లేటెస్ట్ గా చూస్తే జ్ఞానేశ్ కుమార్ ని రాజీనామా చేయమంటున్నారు. ఆయన రాజీనామా చేసేంతవరకూ తాము వెనక్కి తగ్గేది లేదని కూడా విపక్ష నేతలు అంటున్నారు. దాంతో ఎవరీ జ్ఞానేశ్ కుమార్ అని ఆసక్తి ఉన్న వారు అంతా గూగుల్ సెర్చ్ చేయడం మొదలెట్టారు. అక్కడ ఆయన మ్యాటర్ అంతా చూసిన వారు జస్ట్ షాక్ తింటున్నారు అంతే. దానికి కారణం జ్ఞానేశ్ కుమార్ అక్షరాలా జ్ఞానేశ్ కుమారే. ఆయన అన్నింటా టాపరే.

బెస్ట్ స్టూడెంట్ గానే :

చిన్న తనం నుంచి ఆయన బెస్ట్ స్టూడెంట్ గానే ఉంటూ వచ్చారు ఆయన 1979లో హైస్కూల్ లో టెంత్ లో టాపర్ గా ఉన్నారు. 1981లో ఇంటర్ పరీక్షల్లో యూపీ బోర్డ్ టాపర్ గా ఉన్నరు. అంతటితో కాదు ఐఐటీ కాన్పూర్ లో సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. హార్వర్డ్‌లో ఎన్విరాన్‌మెంటల్‌ ఎకనామిక్స్‌ చదువు చదివారు, ఆ మీదట 1988 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారిగా నియామకం అందుకున్నారు. అలా ఎన్నో హోదాలు దాటి చివరికి 2025 ఫిబ్రవరి 19న దేశ 26వ ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆయన చదువులలో కానీ విధి నిర్వహణలో కానీ అన్నింటా టాప్ గానే ఉన్నారు. ఆయన మొత్తం కెరీర్ చూస్తే తాజా వివాదమే ఇపుడు అందరికీ కనిపిస్తోంది. ఇంతటి టాపర్ మెరిటోరియస్ ఆఫీసర్ మీద ఈ రకంగా విమర్శలు రావడమేంటనే అంతా ఆశ్చర్యపోతున్నారు.

ఆ కధనంతోనే :

కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ మీద ఇంత వివాదం రావడానికి కారణం సెప్టెంబర్‌ నెల మూడవ వారంలో ది ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రచురించిన ఒక సంచలన వార్తా కథనం. ఇందులో కేంద్ర ఎన్నికల సంఘం అంతర్గత వ్యవహారాలపై రాసిన వార్త రాజకీయ దుమారం రేపింది. ఈ నేపథ్యంలోనే జ్ఞానేశ్‌ కుమార్‌ తీవ్ర విమర్శల పాలు అయ్యారు. విపక్షాలకు ఇపుడు ఆయన టార్గెట్ అయ్యారు. ఆయన రాజీనామా చేయాలని అంతా డిమాండ్ చేస్తున్నారు. అయితే ఎంతో బ్యాక్ గ్రౌండ్ ఉండి అన్నింటా నంబర్ వన్ గా సాగుతూ వచ్చిన జ్ఞానేశ్ కుమార్ ఈ విధంగా వివాదాలలోకి చిక్కుకోవడం ఆశ్చర్యకరమే అని అంటున్నారు.

తపోభూమిగా లక్నో :

జ్ఞానేశ్ కుమార్ తన తపో భూమిగా యూపీ రాజధాని లక్నోని భావిస్తారు. ఆయన ఈ ఏడాది ఆగస్టులో తాను గతంలో చదువుకున్న లక్నోలోని కొల్విన్‌ తాలూక్దార్‌ కళాశాలను సందర్శించారు. ఆ సమయంలో ఆయన లక్నో నగరాన్ని తన తపోభూమిగా అభివర్ణించారు. అక్కడ చదువుకున్న రోజులను సైతం మధుర స్మృతులు అంటూ గుర్తు చేసుకున్నారు. ఆయన కాన్పూర్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ)లో సివిల్‌ ఇంజినీరింగ్‌లో బీటెక్‌ పూర్తి చేశారు. ఇక 2025 నవంబర్‌లో ఐఐటీ కాన్పూర్‌ తన 66వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలలో భాగంగా జ్ఞానేశ్‌ కుమార్‌కు విశిష్ట పూర్వ విద్యార్థి పురస్కారాన్ని ఐఐటీ కాంపూర్ అందించింది. 1989లో ప్రారంభించిన ఈ అవార్డును సమాజానికి దేశానికి విశేష సేవలు అందించిన పూర్వ విద్యార్థులకు ప్రదానం చేస్తారు. అలా ఆయన ఎంతో గౌరవమైన అవార్డుని అందుకున్నారు.

కేరళలో క్యాడర్ ఐఏఏస్ గా :

జ్ఞానేశ్ కుమార్ 1988 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారిగా ఆయన కేరళ కేడర్‌కు నియమితులయ్యారు. అక్కడ కొచ్చి మున్సిపల్‌ కమిషనర్‌ గా పనిచేశారు. అలాగే కేరళ స్టేట్‌ కోఆపరేటివ్‌ బ్యాంక్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ గా ఎర్నాకుళం జిల్లా కలెక్టర్‌ సహా పలు కీలక పదవులను అదే రాష్ట్రంలో చేశారు. గోశ్రీ ఐలాండ్స్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ కార్యదర్శిగా, తిరువనంతపురం విమానాశ్రయ అభివృద్ధి సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా ఢిల్లీలోని కేరళ హౌస్‌ రెసిడెంట్‌ కమిషనర్‌గా కూడా బాధ్యతలు నిర్వహించారు. మొత్తం ఐఏఎస్ అధికారిగా కెరీర్ ని ఎక్కువ భాగం కేరళలో గడిపిన ఆయన రాజీనామా కోరుతూ కేరళ మాజీ సీఎం పినరయ్ విజయన్ తాజాగా ఆందోళనలో పాల్గొనడమే ఇక్కడ విశేషం.