వైసీపీకి చోటిచ్చిన కూటమి...ఏమి జరుగుతోంది ?
మహా విశాఖ నగర పాలక సంస్థ జీవీఎంసీ స్థాయీ సంఘం ఎన్నికలు ఈసారి ఎన్నో ఆసక్తికరమైన పరిణామాలకు దారి తీశాయి.
By: Satya P | 7 Aug 2025 1:13 PM ISTమహా విశాఖ నగర పాలక సంస్థ జీవీఎంసీ స్థాయీ సంఘం ఎన్నికలు ఈసారి ఎన్నో ఆసక్తికరమైన పరిణామాలకు దారి తీశాయి. స్థాయీ సంఘం ఎన్నికల్లో పది మంది సభ్యులను ఎన్నుకుంటారు. అయితే తాజాగా జరిగిన స్థాయీ ఎన్నికల్లో పదికి పదీ గెలుస్తామని చెప్పిన కూటమి తీరా ఫలితాలు వచ్చేసరికి ఒక సీటుని వైసీపీకి సమర్పించుకుంది. దానికి కారణాలు ఏమిటి అన్నదే ఇపుడు రాజకీయంగా చర్చగా మారింది.
గ్యాప్ పెరిగిపోతోందా :
జీవీఎంసీలో వైసీపీ మేయర్ ని దించేసి టీడీపీ మేయర్ ని గద్దెనెక్కించడం దాకా అంతా ఐక్యంగా ఉన్న కూటమి పార్టీలు ఆ తరువాతే అసంతృప్తి రాగాలు ఆలపిస్తున్నాయని అంటున్నాయి. టీడీపీ ఆధిపత్యంతో తాము ఇబ్బంది పడుతున్నామని జనసేన నేతలు అంటున్నారు తమకు తగిన గౌరవం వాటా దక్కడం లేదని అంటున్నారు. స్థాయీ సంఘం ఎన్నికల్లో పది సభ్యలకు గానీ టీడీపీ తొమ్మిది మందిని బరిలోకి దింపి ఒక సీటుని బీజేపీకి వదిలేసింది. అయితే జనసేనకు ఇక్కడ ఒక్క సీటూ ఇవ్వలేదు. దాంతో అసంతృప్తి రాజుకుంది అని అంటున్నారు.
ఓట్ల కంటే ఎక్కువతో వైసీపీ :
జీవీఎంసీ స్థాయీ సంఘం ఎన్నికల్లో పది సీట్లకు పోటీ చేసిన వైసీపీ ఒక సీటుని సాధించింది. అది ఆ పార్టీ వరకూ చూస్తే ఘన విజయమే. ఎందుకంటే గత ఏడాది జరిగిన స్థాయీ సంఘం ఎన్నికల్లో జీవీఎంసీలో అధికారంలో ఉండి కూడా పదికి పది సీట్లను పోగొట్టుకుంది. కానీ ఈసారి ప్రతిపక్షంలో ఉంటూ చాలా మంది కార్పోరేటర్లు కూటమి వైపు వెళ్ళి బలం బాగా తగ్గిపోయిన నేపధ్యంలో 50 ఓట్లఒతో వైసీపీ కార్పోరేటర్ స్థాయీ సంఘం సీటుని అందుకున్నారు. వైసీపీకి వాస్తవానికి 32 మంది కార్పోరేటర్ల బలం మాత్రమే ఉంది. మరో 18 మంది ఓట్లు కూటమి నుంచి క్రాస్ ఓటింగ్ గా వచ్చాయని అంటున్నారు.
కూటమికి తొలి షాక్ :
జీవీఎంసీ మేయర్ ని గెలుచుకున్నామని ఇక తమకు అంతా పూల పానుపే అని కూటమి నేతలు అనుకుంటే వైసీపీకి ఒక్క సీటు సమర్పించుకోవడం మాత్రం మింగుడుపడటం లేదు అని అంటున్నారు. వైసీపీ గెలిచింది ఒక్క సీటు అయినా కూడా అది కూటమికి షాక్ అనే అంటున్నారు. వైసీపీకి చోటు ఇవ్వడం అంటే అది కూటమి రాజకీయ వ్యూహాలు వైఫల్యమే అని అంటున్నారు. జనసేనతో టీడీపీ కో ఆర్డినేషన్ చేసుకోవాలని చెబుతున్నారు. అలాగే మిత్రులతో కలసి కూటమి పటిష్టంగా ఉండాలంటే విభేదాలు అన్నీ పరిష్కరించుకోవాలని అంటున్నారు.
అలా కాకపోతే మాత్రం ముందు ముందు మరిన్ని ఇబ్బందులు వస్తాయని అంటున్నారు. ఇక ఒకనాడు మేయర్ గా అధికారంలో ఉంటూ పదికి పదీ స్థాయీ సంఘం సభ్యులను గెలిపించుకుని స్టాండింగ్ కమిటీ చైర్మన్ పదవిని కూడా కైవశం చేసుకున్న వైసీపీ ఇపుడు అన్నీ కోల్పోయి ఒక్క స్టాండింగ్ కమిటీ మెంబర్ తో సంతృప్తి పడాల్సి వస్తోంది. అయినా ఇది తమ ఘన విజయమే అని ఆ పార్టీ చెప్పుకుంటోంది. ఈ ఒక్క సీటుతోనే ముందు ముందు అద్భుతాలు సృష్టిస్తామని చెబుతోంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.
