బ్యాడ్మింటన్ గుత్తా జ్వాల గొప్ప మనసు.. దేవతతో సమానం అంటూ!
మాతృత్వం అనేది ఎంత గొప్పవరమో.. అది తల్లి అయితే తెలుస్తుంది. అందుకే తల్లిగా ప్రమోషన్ పొందలేని ఎంతోమంది మహిళామణులు తీవ్ర మనోవేదనకి గురవుతూ ఉంటారు.
By: Madhu Reddy | 12 Sept 2025 1:50 PM ISTమాతృత్వం అనేది ఎంత గొప్పవరమో.. అది తల్లి అయితే తెలుస్తుంది. అందుకే తల్లిగా ప్రమోషన్ పొందలేని ఎంతోమంది మహిళామణులు తీవ్ర మనోవేదనకి గురవుతూ ఉంటారు. కొంతమందికి తల్లయ్యే యోగం ఉండదు. వారి బాధ వర్ణతాతీతం. అయితే కొంతమంది మహిళలు తల్లైనా కూడా పిల్లలకు పాలు ఇవ్వలేక అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బందులు పడుతూ ఉంటారు.అయితే అలా అనారోగ్యంతో పాలివ్వలేక, ఇతర సమస్యల కారణంగా పాలు ఇవ్వలేని స్థితిలో ఉన్న తల్లులకు బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాలా తీసుకున్న ఓ నిర్ణయం ఆమెలో ఉన్న మానవత్వాన్ని, మంచితనాన్ని బయటపెడుతోంది.
పుట్టిన బిడ్డ వెంటనే తల్లి పాలను తాగాలి అంటారు. తల్లిపాలను తాగితేనే ఆ పుట్టిన బిడ్డలో ఇమ్యూనిటీ పవర్స్ పెరుగుతాయని అంటూ ఉంటారు.కానీ కొంతమంది తల్లులు మాత్రం తమ పాలని తమ పిల్లలకు ఇవ్వలేకపోతుంటారు. మరి కొంతమంది పాలు పడక పిల్లలకు డబ్బా పాలు పట్టిస్తూ ఉంటారు. ఇంకొంతమంది తల్లులు తమకున్న కొన్ని అనారోగ్య సమస్యల కారణంగా పాలు ఇవ్వలేని పరిస్థితి కూడా ఏర్పడవచ్చు.. ఇక అలాంటి పిల్లలకి గుత్తా జ్వల ఇప్పటివరకు 30 లీటర్ల పాలు దానం చేసి తన ఉదార హృదయాన్ని చాటుకుంది. విషయంలోకి వెళ్తే.. బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాలా తన డాక్టర్ మంజుల అనగాని ఇచ్చిన నిర్ణయం దిశగా అడుగులు వేసింది. అదేంటంటే..గుత్తా జ్వాల తన బిడ్డకు ఇవ్వగా మిగిలిన చనుబాలని గవర్నమెంట్ హాస్పిటల్ లో పుట్టిన శిశువులకు దానం చేస్తోంది.
అలా తాను తల్లైనా నాలుగు నెలల్లో తన బిడ్డకు ఇవ్వగా మిగిలిన చనుబాలను.. దాదాపు 30 లీటర్ల వరకు డొనేట్ చేసింది. ప్రస్తుతం గుత్తా జ్వాల ప్రతిరోజు 600ml పాలని ప్రభుత్వ హాస్పిటల్లో తల్లిపాలు లేని శిశువులకు పంపిస్తోంది. గుత్తా జ్వాల తన డాక్టర్ సహాయంతో తీసుకున్న ఈ నిర్ణయం ఎంతోమంది పిల్లలకు మేలు కలిగిస్తోంది. గుత్తా జ్వాల చేసిన ఈ మంచి పని బయట పడడంతో చాలామంది నెటిజన్లు గుత్తా జ్వాల మంచి మనసుని మెచ్చుకుంటున్నారు. బ్యాడ్మింటన్ కోర్టులో దిగి షాట్లు కొట్టి ప్రత్యర్థులని ఓడించడమే కాదు పుట్టిన పిల్లలకు పాలు దానం చేస్తూ తన వ్యక్తిత్వాన్ని చాటుకుంది అంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రొఫెషనల్ లైఫ్ మాత్రమే కాదు పర్సనల్ లైఫ్ లో కూడా గుత్తా జ్వాల ఒక మంచి నిర్ణయం తీసుకుంది అంటూ కామెంట్స్ పెడుతున్నారు. గుత్తా జ్వాల చేసే ఈ పని బ్యాడ్మింటన్ పోటీలో మెడల్ గెలిచిన దానికంటే గొప్ప పని అంటూ పొగుడుతున్నారు. మరికొంతమంది పాలు లేని పిల్లల పాలిట ఈమె దేవతలా మారింది అంటూ కామెంట్లు చేస్తున్నారు.
గుత్తా జ్వాల పర్సనల్ లైఫ్ కి వస్తే.. మొదట బ్యాడ్మింటన్ ప్లేయర్ చేతన్ ఆనంద్ ని పెళ్లి చేసుకున్న గుత్తా జ్వాల ఆ తర్వాత కొద్ది సంవత్సరాలకే విభేదాలు వచ్చి విడాకులు తీసుకుంది. విడాకుల తర్వాత తమిళ నటుడు నిర్మాత అయినటువంటి విష్ణు విశాల్ ను 2021లో పెళ్లి చేసుకుంది.వీరికి పెళ్లయిన నాలుగేళ్లకి అనగా 2025 ఏప్రిల్ 22న అంటే తమ పెళ్ళి రోజే పండంటి పాప జన్మించింది.
