జనసేనలోకి రాయలసీమ కీలక నేత.. వైసీపీకి షాక్!
తాజాగా అందుతున్న సమాచారం మేరకు అనంతపురం మాజీ ఎమ్మెల్యే బి.గురునాథరెడ్డి జనసేనలో చేరేందుకు ఆసక్తిగా ఉన్నారని పెద్ద ఎత్తున ఊహగానాలు వినిపిస్తున్నాయి.
By: Tupaki Political Desk | 19 Aug 2026 10:33 AM ISTరాయలసీమలో వైసీపీకి షాక్ ఇచ్చేలా జనసేన పావులు కదుపుతోందని ప్రచారం జరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ విస్తరణపై ఫోకస్ చేసిన జనసేన ప్రధానంగా రాయలసీమలో పట్టున్న నేతలను పార్టీలో చేర్చుకునేలా అడుగులు వేస్తోందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇందులో భాగంగా విపక్షం వైసీపీలోని ప్రముఖ నేతలపై దృష్టి పెట్టినట్లు సమాచారం. ఈ ప్రాంతంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి కుటుంబానికి ప్రధాన అనుచరులుగా పేరున్న నేతలతోనూ జనసేన సంప్రదింపులు జరుపుతోందని అంటున్నారు. తాజాగా అందుతున్న సమాచారం మేరకు అనంతపురం మాజీ ఎమ్మెల్యే బి.గురునాథరెడ్డి జనసేనలో చేరేందుకు ఆసక్తిగా ఉన్నారని పెద్ద ఎత్తున ఊహగానాలు వినిపిస్తున్నాయి.
వైసీపీలో కీలక నేతగా వ్యవహరిస్తున్న మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి జనసేనలో చేరాలని తీసుకున్న నిర్ణయం తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డికి అత్యంత సన్నిహితుల్లో గురునాథరెడ్డి ప్రముఖుడిగా చెబుతున్నారు. 2009లో అనంతపురం ఎమ్మెల్యేగా గెలిచిన గురునాథరెడ్డి 2012లో జగన్ రెడ్డి కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్లు గుర్తు చేస్తున్నారు. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గుర్నాథరెడ్డి గెలుపొందారు. 2014లో ఓటమి చెందిన ఆయన, 2019లో టికెట్ దక్కించుకోలేకపోయారు. ఇక అప్పటి నుంచి జగన్మోహరెడ్డితో దూరంగా ఉంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.
2019 నుంచి వైసీపీలో నిర్లక్ష్యానికి గురైన గురనాథరెడ్డి పార్టీ అధికారంలో ఉందన్న ఏకైక ఆలోచనతో ఆ ఐదేళ్లు సైలెంటుగా ఉండిపోయినట్లు చెబుతున్నారు. 2024లో వైసీపీ ఓటమి పాలైన నుంచి రాజకీయ భవిష్యత్తు కోసం ఆయన అనేక ప్రత్యామ్నాలు చూసినట్లు చెబుతున్నారు. అయితే 2014లో ఓటమి తర్వాత టీడీపీలో చేరిన ఆయన అక్కడ ఇమడలేకపోయారని చెబుతున్నారు. ఈ కారణంగా జనసేనలో చేరాలని ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఇక జనసేనలో కీలకంగా వ్యవహరిస్తున్న మాజీ మంత్రి బాలినేనితో సంప్రదించి ఆ పార్టీలో చేరేందుకు లైన్ క్లియర్ చేసుకున్నట్లు చెబుతున్నారు. ఈ నెల 25న ఆయన జనసేనాని పవన్ సమక్షంలో గాజు గ్లాసును అందుకోనున్నట్లు టాక్ వినిపిస్తోంది.
స్థానిక ఎన్నికల నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి జనసేన తీర్థం పుచ్చుకునేందుకు సిద్దం కావడం హాట్ టాపిక్ అవుతోంది. ఆయన చేరిక తర్వాత రాయలసీమ నుంచి మరింత భారీగా వలసలు ఉండొచ్చని వ్యాఖ్యానిస్తున్నారు. అయితే జనసేనలో చేరుతున్న గురునాథరెడ్డికి స్థానిక ఎన్నికలల్లో ఏదైనా పదవి ఇచ్చే అవకాశం ఉందా? లేక 2029 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచి ఆయనను సిద్ధం చేయాలనే ఆలోచనతో పార్టీలోకి తీసుకుంటున్నారా? అన్నది తెలియాల్సివుందని అంటున్నారు. ఏదిఏమైనా రాయలసీమ నుంచి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి సన్నిహితుడు జనసేనలో చేరేందుకు సిద్ధమవడం గమనిస్తే వైసీపీని నైతికంగా దెబ్బతీయడానికి జనసేన వేగంగా అడుగులు వేస్తున్నట్లుగా భావించాల్సివుందని అంటున్నారు.
