గురుమూర్తి ఏం చేశారు.. ఈ రాజకీయ రగడ ఏంటి.. ?
అయితే.. ఎంపీ గురుమూర్తి కేంద్రంగా టీడీపీ ఎందుకు రాజకీయాలు చేసిందన్నది ప్రశ్న. ఇదే ఇప్పుడు ఏపీలో కీలక మలుపు కానుంది. దేశవ్యాప్తంగా వైద్య కళాశాలలు, ప్రజారోగ్యం అంశంపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీని నియమించారు.
By: Garuda Media | 19 Dec 2025 9:00 PM ISTవైసీపీ నాయకుడు, వృత్తిరీత్యా వైద్యుడు అయిన తిరుపతి ఎంపీ గురుమూర్తి కేంద్రంగా కూటమి సర్కారు రాజకీయ వ్యాఖ్యలు దుమ్మురేపుతున్నాయి. టీడీపీ కీలక నాయకుడు, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభి తాజాగా గురుమూర్తిని లక్ష్యంగా చేసుకుని నిప్పులు చెరిగారు. ఇదేసమయంలో వైసీపీ పైనా ఆయన ధ్వజమెత్తారు. మరి దీనికి కారణం ఏంటి? ఎందుకు? అనేది కీలకంగా మారింది. ప్రస్తుతం వైసీపీ వైద్య కాలేజీలను పీపీపీ విధానానికి ఇవ్వడాన్ని తప్పుబడుతోంది.
అయితే.. ఎంపీ గురుమూర్తి కేంద్రంగా టీడీపీ ఎందుకు రాజకీయాలు చేసిందన్నది ప్రశ్న. ఇదే ఇప్పుడు ఏపీలో కీలక మలుపు కానుంది. దేశవ్యాప్తంగా వైద్య కళాశాలలు, ప్రజారోగ్యం అంశంపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీని నియమించారు. ఈ ఏడాది జనవరిలో నియమితమైన ఈ కమిటీ.. దేశవ్యాప్తంగా పర్యటించి.. అన్ని రాష్ట్రాల ప్రభుత్వాల నుంచి సమాచారం సేకరించింది. అనంతరం.. ఈనెల 10న కేంద్రానికి నివేదిక సమర్పించింది. ఈ నివేదికపై గురుమూర్తి కూడా సంతకం చేశారు.
ఇదే ఇప్పుడు వైసీపీకి ప్రాణసంకటంగా మారింది. మొత్తం 11 మంది సభ్యులు ఉన్న పార్లమెంటరీ స్టాండిం గ్ కమిటీ.. తన రిపోర్టులో వైద్య కళాశాలలను పీపీపీ(పబ్లిక్-ప్రైవేట్-పార్టనర్ షిప్) విధానంలో నిర్మించు కోవచ్చని సిఫారసు చేసింది. అంతేకాదు.. దీనివల్ల ఖర్చు కూడా తగ్గుతుందని.. ప్రభుత్వాలపై భారం ఉండదని కూడా.. పేర్కొంది. దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా ఓకే చెప్పినట్టు నివేదికలో పేర్కొంది. దేశవ్యాప్తంగా మెజారిటీ ప్రభుత్వాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని తెలిపింది.
దీనిని ఫోకస్ చేసిన పట్టాభి.. వైసీపీ ద్వంద్వ రాజకీయాలు చేస్తోందని దుయ్యబట్టారు. పీపీపీ మోడల్‌లో వైద్య కళాశాలలను నిర్మించుకోవచ్చని.. వైసీపీ ఎంపీ కూడా సంతకం చేశారని.. కానీ, ఏపీకి వచ్చే సరికి మాత్రం దీనిని వ్యతిరేకిస్తున్నారని.. ఇదేం పద్ధతని కూడా ఆయన ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన వెలుగులోకి తెచ్చిన విషయాలను టీడీపీ రాజకీయ అస్త్రంగా వినియోగించుకోనుంది. మరోవైపు.. వైసీపీ దీనిపై ఎదురుదాడి చేయలేక.. సమర్థించుకోలేక.. మౌనంగా ఉంది.
