చైనా ‘ప్రజాస్వామ్య’ పులి.. అమెరికా జైల్లో పిల్లి! బిలియనీర్ గువో వెంగుయికి 30 ఏళ్ల ‘ఉచిత వసతి’!
ఒకప్పుడు చైనాలో అపర కుబేరుడిగా వెలిగిపోయిన మన గువో గారికి 2015లో చైనా ప్రభుత్వంతో ఏదో తేడా కొట్టింది. అంతే.. రాత్రికి రాత్రే అమెరికాకు చెక్కేసాడు.
By: A.N.Kumar | 1 July 2026 12:00 AM ISTచైనాలో కమ్యూనిజం అంతం కావాలి.. ప్రజాస్వామ్యం వెల్లివిరియాలి అంటూ గొంతు చించుకున్న చైనా ఎక్స్-బిలియనీర్, ప్రస్తుత ప్రవాస ‘ఘనాపాఠి’ గువో వెంగుయికి అమెరికా కోర్టు దిమ్మతిరిగే గిఫ్ట్ ఇచ్చింది. "నువ్వు చైనాలో ప్రజాస్వామ్యం తెస్తావో లేదో కానీ.. వచ్చే 30 ఏళ్లు మాత్రం అమెరికా జైల్లోనే ఉండాలి" అంటూ మాన్‌హాటన్ ఫెడరల్ కోర్టు తీర్పు ఇచ్చింది. అంతేకాదు.. "నువ్వు నొక్కేసిన ఆ $889 మిలియన్ డాలర్లు ఇటు ఇచ్చేయ్ బాబూ" అని ఆర్డర్ కూడా వేసింది.
చైనా నుంచి ఎస్కేప్.. అమెరికాలో ల్యాండ్
ఒకప్పుడు చైనాలో అపర కుబేరుడిగా వెలిగిపోయిన మన గువో గారికి 2015లో చైనా ప్రభుత్వంతో ఏదో తేడా కొట్టింది. అంతే.. రాత్రికి రాత్రే అమెరికాకు చెక్కేసాడు. అక్కడ ల్యాండ్ అవ్వడమే ఆలస్యం.. "నేను చైనా కమ్యూనిస్టు పార్టీకి వ్యతిరేకంగా పోరాడే వీరుడిని, శూరుడిని" అంటూ బిల్డప్ ఇచ్చాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న చైనీయులంతా "అబ్బా.. మన దేశాన్ని రక్షించడానికి దేవుడు పంపిన మెస్సయ్య" అనుకుని గుడ్డిగా నమ్మేశారు.
విప్లవం పేరుతో ‘విలాసాలు’.. క్రిప్టో పేరుతో ‘కథలు’
2018 నుంచి 2023 మధ్య కాలంలో మనోడి అసలు రంగు బయటపడింది. "చైనాను కూల్చడానికి నిధులు కావాలి.. క్రిప్టోలో పెట్టుబడులు పెట్టండి.. స్పెషల్ బిజినెస్ స్కీమ్స్ ఉన్నాయి" అంటూ తనను నమ్మిన ఫాలోవర్స్ నుంచే దాదాపు 1 బిలియన్ డాలర్లు వసూలు చేశాడు. "సార్.. ఈయన చైనాలో ప్రజాస్వామ్యం కోసం కాదు.. న్యూయార్క్‌లో లగ్జరీ లైఫ్ కోసం డబ్బులు వసూలు చేశాడు!" అని కోర్టులో ఆధారాలు పెట్టారు. మన ప్రజాస్వామ్య పోరాట యోధుడు ఆ డబ్బుతో ఏం చేశాడో తెలుసా? న్యూయార్క్ సెంట్రల్ పార్క్ పక్కన కళ్లు చెదిరే ఒక ఖరీదైన భవంతి కొన్నాడు. రోడ్ల మీద రయ్ రయ్ మంటూ తిరగడానికి మిలియన్ డాలర్ల లాంబోర్గిని కారు కొన్నాడు. సముద్రంలో షికార్లు కొట్టడానికి ఏకంగా $37 మిలియన్ల లగ్జరీ యాచ్ పడవ కొనుక్కున్నాడు. ఇదంతా చైనా ప్రజల కోసమేనండోయ్.. పాపం వాళ్ల కోసం లగ్జరీగా ఆలోచించొద్దా మరి..
న్యాయమూర్తి గారి ‘లాజిక్’.. గువో గారి ‘మ్యాజిక్’
కోర్టులో మన గువో గారు భలే వాదించారు. "నేను అమెరికాకు వచ్చింది చైనా కమ్యూనిస్టు పార్టీని బలహీనపర్చడానికే.. నా ఉద్దేశాలు చాలా పవిత్రమైనవి యువర్ ఆనర్" అని సెంటిమెంట్ డైలాగులు కొట్టారు. కానీ జడ్జి అనలీసా టోరెస్ మాత్రం అస్సలు తగ్గలేదు. "నువ్వు చైనా ప్రభుత్వం మీద కసి తీర్చుకోవడానికి.. నిన్ను నమ్మిన అమాయకుల జీవిత పొదుపు మొత్తాన్ని నాశనం చేశావు. వందల కుటుంబాలను రోడ్డున పడేసి ఇంకా నా తప్పేమీ లేదు అనడం నీ బాధ్యతారాహిత్యం" అంటూ క్లాస్ పీకి 30 ఏళ్ల జైలు శిక్ష ఖరారు చేసేశారు.
స్టీవ్ బానన్‌తో దోస్తీ.. జైల్లో కుస్తీ
ఈ గువో గారు మామూలోడు కాదు.. అమెరికా మాజీ వైట్ హౌస్ వ్యూహకర్త స్టీవ్ బానన్‌తో కలిసి ఏకంగా "న్యూ ఫెడరల్ ఆఫ్ చైనా" అనే ఒక డమ్మీ సంస్థను కూడా స్థాపించి హల్చల్ చేశాడు. అప్పట్లో వీళ్ల హడావుడి చూసి చైనా ప్రభుత్వం నిజంగానే షేక్ అయిందేమో కానీ.. ఇప్పుడు ఎఫ్‌బీఐ ఇచ్చిన షాక్‌కి మనోడి వ్యాపార సామ్రాజ్యం మొత్తం షేక్ అయిపోయింది. దేశాన్ని రక్షిస్తాడని నమ్మితే.. జేబులు ఖాళీ చేసి జైలుకి వెళ్ళిపోయాడు. చైనా కమ్యూనిస్టు పార్టీని కూలుస్తాడో లేదో కానీ.. ప్రస్తుతం మాత్రం అమెరికా జైలు గోడల మధ్య ‘ప్రజాస్వామ్య కబుర్లు’ చెప్పుకోవడానికి సిద్ధమయ్యాడు మన గువో వెంగుయి..
