#Viral News - జంబలకడి పంబ....యువకుడికి మాయదారి రోగం!
ఈ వ్యాధి ప్రభావం ప్రధానంగా రెండు రకాలుగా ఉంటుందని చెబుతున్నారు. ఒకటి కండరాల బలహీనత, రెండు హార్మోన్ల అసమతుల్యత వస్తుందని వైద్యులు వివరిస్తున్నారు.
By: Tupaki Political Desk | 18 Jun 2026 2:15 PM ISTఅప్పుడెప్పుడో ప్రముఖ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ తీసిన ‘జంబలకడిపంబ’ సినిమా గుర్తుందా? ఆ సినిమాలో మగాళ్లు అంతా ఆడవాళ్లుగా.. ఆడవాళ్లు మగ రాయుళ్లుగా మారిపోతారు. హాస్యం కోసం దర్శకుడు ఎంచుకున్న ఈ కథాంశం అందరినీ కడుపుబ్బా నవ్వించింది. అయితే నిజజీవితంలో ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఏం అవుతుంది? సినిమా చూసి నవ్వుకున్నాం కానీ, మనలో ఒకరికి ఇలాంటి అరుదైన వింత పరిస్థితి ఎదురైతే ఎంతో బాధగా ఉంటుంది కదా.. వైద్య రంగం ఎంతో అభివృద్ధి చెందిన రోజుల్లో అలాంటి వారిని చూసి జాలి పడటం తప్ప ఎలాంటి సాయం చేయలేని దుస్థితి నెలకొనడం కూడా ఒక విషాదమే. గుంటూరు కు చెందిన 36 ఏళ్ల యువకుడిలో అరుదైన వింత వ్యాధి లక్షణాలు బయటపట్టాయి. నడి వయసులో ఉన్న ఆ యువకుడు కొన్ని రోజులుగా మహిళలా మారిపోతున్నాడు.. దీంతో ఆస్పత్రికి వెళ్లగా అతడికి అరుదైన ‘కెన్నడీ డిసీజ్’ వచ్చిందని వైద్యులు తేల్చారు.
కెన్నెడీ డిసీజ్‌ను వైద్య పరిభాషలో ‘స్పైనోబల్బార్ మస్క్యులర్ అట్రోఫీ’ అని పిలుస్తారు. ఇది ఒక అరుదైన, వంశపారంపర్యంగా వచ్చే నరాలు, కండరాల రుగ్మతగా చెబుతున్నారు. ఈ వ్యాధి సోకినప్పుడు శరీరంలోని మోటార్ న్యూరాన్లు అంటే నరాలు క్రమంగా క్షీణిస్తాయని ఫలితంగా కండరాలు బలహీనపడిపోతాయని వైద్యులు చెబుతున్నారు. ఈ యువకుడు కూడా ఇదే లక్షణాలతో ఆస్పత్రికి వెళ్లగా, గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి న్యూరాలజీ హెడ్ పరీక్షించి ‘కెన్నడీ డిసీజ్’ సోకినట్లు నిర్ధారించారు.
‘కెన్నడీ డిసీజ్’ సోకిన వారి శరీరంలో సెక్స్ హార్మోన్లు తగ్గిపోతాయని వైద్యులు చెబుతున్నారు. అంతేకాకుండా పురుష లక్షణాలు తగ్గిపోయి స్త్రీ కణాలు అభివృద్ధి చెందుతాయని, దీనివల్ల మగాళ్లు ఆడవారిగా మారిపోతారని వైద్య రంగంలోని నిపుణులు చెబుతున్నారు. ఇది పూర్తిగా జన్యుపరమైన లోపాల వల్ల వచ్చే వ్యాధి అంటున్నారు. శరీరంలోని ‘X’ క్రోమోజోమ్ లోని ఆండ్రోజెన్ రిసెప్టర్ జన్యువులో వచ్చే మార్పుల వల్ల ఈ సమస్య తలెత్తుతుందని చెబుతున్నారు. సహజంగా పురుషుల్లో ఒక X, ఒక Y క్రోమోజోమ్ ఉంటుందని అంటున్నారు. ఒకే ఒక X క్రోమోజోమ్ ఉండటం వల్ల దానిలో లోపం వస్తే పురుషులు నేరుగా ఈ వ్యాధి బారిన పడతారని చెబుతున్నారు. ఇదే సమయంలో మహిళల్లో రెండు X క్రోమోజోమ్‌లు ఉంటాయి. ఒకదానిలో లోపం ఉన్నా, మరొకటి సాధారణంగా ఉండటం వల్ల మహిళల్లో ఈ వ్యాధి లక్షణాలు బయటపడవని అంటున్నారు. కానీ, వారు ఈ జన్యు లోపాన్ని తర్వాతి తరాలకు అందించే ‘వాహకులు’గా మాత్రమే ఉంటారని చెబుతున్నారు.
లక్షణాల ప్రభావం
ఈ వ్యాధి ప్రభావం ప్రధానంగా రెండు రకాలుగా ఉంటుందని చెబుతున్నారు. ఒకటి కండరాల బలహీనత, రెండు హార్మోన్ల అసమతుల్యత వస్తుందని వైద్యులు వివరిస్తున్నారు. హార్మోన్ల అసమతుల్యత వల్ల పురుష లక్షణాలు తగ్గిపోవడంతోపాటు అరుదుగా రొమ్ముల పరిమాణం పెరగడం వంటి స్త్రీ లక్షణాలు కనిపిస్తాయని అంటున్నారు. అదేవిధంగా లైంగిక సామర్థ్యం క్షీణిస్తుందని, సంతానలేమి సమస్యలు తలెత్తుతాయని చెబుతున్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా అత్యంత అరుదైన వ్యాధిగా చెబుతున్నారు. సాధారణంగా ప్రతి 40 వేల మంది పురుషులలో ఒకరికి ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ వ్యాధి లక్షణాలు సాధారణంగా 30 నుంచి 50 ఏళ్ల వయసు మధ్యలో బయటపడతాయని అంటున్నారు. గుంటూరు కేసులో కూడా 36 ఏళ్ల వ్యక్తిలోనే ఈ లక్షణాలు బయటపడటం గమనార్హం.
చికిత్స ఉందా?
ప్రస్తుతానికి ఈ వ్యాధిని పూర్తిగా నయం చేసే ఖచ్చితమైన చికిత్స అందుబాటులో లేదని చెబుతున్నారు. అయితే, లక్షణాల తీవ్రతను తగ్గించడానికి రోగి జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి వైద్యులు చికిత్స అందిస్తారని అంటున్నారు. కండరాల శక్తిని కాపాడటానికి ఫిజియోథెరపీ చేస్తారని అదేవిధంగా మాట్లాడటం, మింగడంలో ఇబ్బందులను అధిగమించడానికి స్పీచ్ థెరపీ చేస్తారని అంటున్నారు. హార్మోన్ల సమతుల్యత కోసం అవసరాన్ని బట్టి మందులు వాడాలని సూచిస్తారని వైద్యులు చెబుతున్నారు. గుంటూరు జీజీహెచ్ లో ఇలాంటి అరుదైన వ్యాధిని సకాలంలో గుర్తించి, రోగికి అవసరమైన వైద్య సహాయం అందించడం విశేషంగా వ్యాఖ్యానిస్తున్నారు.
