వైసీపీ హత్యా రాజకీయం.. జనసేన నేత హత్యకు కుట్ర!
వైసీపీ హత్యా రాజకీయాలకు తెరదీసిందని జనసేన నాయకులు ఆరోపించారు. తమ పార్టీ నాయకుడిని చంపేందుకు వైసీపీకి చెందిన ముఖ్య నేత ఒకరు పక్కాప్లాన్ చేశారని జనసేన నేతలు పేర్కొన్నారు.
By: Garuda Media | 17 Aug 2026 8:29 PM ISTవైసీపీ హత్యా రాజకీయాలకు తెరదీసిందని జనసేన నాయకులు ఆరోపించారు. తమ పార్టీ నాయకుడిని చంపేందుకు వైసీపీకి చెందిన ముఖ్య నేత ఒకరు పక్కాప్లాన్ చేశారని జనసేన నేతలు పేర్కొన్నారు. అయితే.. ఈ విషయాన్ని ముందుగానే పసిగట్టి పోలీసులకు సమాచారం ఇచ్చామన తెలిపారు. దీంతో సదరు వైసీపీ నాయకుడు పరారై నట్టు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ విషయంపై గుంటూరు జిల్లా పోలీసులు అన్ని కోణాల్లోనూ విచారణ చేస్తున్నారు.
ఏం జరిగింది?
గుంటూరు జిల్లాకు చెందిన జనసేన నేత బోనబోయిన శ్రీనివాస యాదవ్ కు వైసీపీ ముఖ్య నేత నరేంద్రరెడ్డికి మధ్య రాజకీయ వైరం ఉంది. గత వైసీపీ హయాంలో ప్రభుత్వ తప్పులను శ్రీనివాస యాదవ్ ప్రశ్నించారు. ముఖ్యంగా అమరావతి రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని ఆయన ప్రశ్నించారు. ఈ క్రమంలో వైసీపీ తరఫున నరేంద్ర రెడ్డి ఆ ఆరోపణలను ఖండించడంతో పాటు.. ఎదురు ప్రశ్నించారు. ఇలా.. ప్రారంభమైన రాజకీయ వివాదాలు. వ్యక్తిగత అంశాల వరకు కూడా వెళ్లాయి. ఈ క్రమంలోనే నరేంద్రరెడ్డి చేసిన అక్రమాలపై ఇటీవల శ్రీనివాసయాదవ్ మీడియా ముందు వివరించారు.
దీంతో శ్రీనివాసయాదవ్‌ను లేపేయాలని నరేంద్రరెడ్డి ప్లాన్ చేసినట్టు జనసేన నాయకులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఓ రౌడీ షీటర్‌ను రంగంలోకి దింపినట్టు చెబుతున్నారు. దాదాపు కోటి రూపాయల మేరకు సుపారీ ఇచ్చేందుకు కూడా నరేంద్ర రెడ్డి ఒప్పందం కుదుర్చుకున్నట్టు శ్రీనివాస యాదవ్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. యాదవ్ సోమవారం ఉదయం స్థానిక జిమ్‌కు వెళ్లే క్రమంలో హత్య చేయాలని పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్టు పేర్కొన్నారు. తన ఇంటి చుట్టూ ఓ గ్యాంగ్ రెండుసార్లు రెక్కీ నిర్వహించిందన్నారు.
ఈ విషయం పసిగట్టిన ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చారని జనసేన నాయకులు పేర్కొన్నారు. దీంతో నరేంద్ర రెడ్డి సహా.. ఆయన కుటుంబం గుంటూరును వీడిపోయిందని చెబుతున్నారు. మరోవైపు ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. వైసీపీ నేత నివాసంలో తనిఖీలు చేపట్టారు. అయితే.. ఇంటికి తాళాలు వేసి ఉండడంతో చుట్టుపక్కల విచారించారు. ప్రస్తుతం ఈ వ్యవహారం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. ఇప్పటి వరకు దాడులకు మాత్రమే పరిమితమైన రాజకీయాలు ఇకపై హత్యలకు కూడా దారితీసేలా ఉన్నాయని అంటున్నారు.
