Begin typing your search above and press return to search.

గుంటూరు కార్పొరేష‌న్ ఎల‌క్ష‌న్స్‌: వ‌న్ సైడేనా.. ?

రాబోయే ఎన్నికల కోసం ప్రభుత్వం గుంటూరు కార్పొరేషన్‌లో డివిజన్ల సంఖ్యను 57 నుండి 76కి పెంచేలా కసరత్తు చేస్తోంది.

By:  Garuda Media   |   14 Sept 2026 11:00 AM IST
గుంటూరు కార్పొరేష‌న్ ఎల‌క్ష‌న్స్‌: వ‌న్ సైడేనా.. ?
X

రాష్ట్రంలో మ‌రో నెల రోజుల్లో కార్పొరేష‌న్ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో కీల‌క‌మైన గుంటూరు కార్పొరేష‌న్ వ్య‌వ‌హారం ఆస‌క్త‌గా మారింది. వైసీపీ, టీడీపీ కేంద్ర కార్యాయాలు ఇక్క‌డే ఉండ‌డం.. ఇరు ప‌క్షాల నాయకులు కూడా ఇక్క‌డే ఉండి కార్య‌క్ర‌మాలు చేయ‌డంతో ఆస‌క్తి మ‌రింత పెరిగింది. దీనికితోడు రాజ‌ధాని ప్రాంతం కావ‌డం కూడా.. ఈ సారి ఎన్నిక‌ల్లో ప్ర‌ధానంగా చ‌ర్చ‌కు దారితీసింది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు స‌హా.. నియోజకవర్గాల పునర్విభజన అంశాలు గుంటూరు రాజ‌కీయాల్లో ఆస‌క్తిగా మారాయి.

రాబోయే ఎన్నికల కోసం ప్రభుత్వం గుంటూరు కార్పొరేషన్‌లో డివిజన్ల సంఖ్యను 57 నుండి 76కి పెంచేలా కసరత్తు చేస్తోంది. చుట్టుపక్కల గ్రామాల కలయికతో 'గ్రేటర్ గుంటూరు' ప్రణాళికలు కూడా చర్చల్లో ఉన్నాయి. గతంలో జరిగిన స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో వైసీపీకి మెజారిటీ కార్పొరేటర్లు ఉన్నప్పటికీ, అధికార‌ కూటమి క్లీన్ స్వీప్ చేసింది. దీంతో వైసీపీ డోలాయ‌మానంలో ప‌డింది. పైగా... వైసీపీ నాయ‌కులు ప్ర‌స్తుతం పెద్ద‌గా యాక్టివ్‌గా లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

స్థానిక ఎన్నికల వేడి నేపథ్యంలో అభివృద్ధి పనుల బిల్లులు, కాంట్రాక్టులు, ప్రజలకు జవాబుదారీతనం విషయంలో అధికార పార్టీ ప్రతినిధులకు, అధికారులకు మధ్య స‌మ‌న్వ‌యం కుదిరితే.. ఇక తిరుగులేద‌న్న వాద‌న వినిపిస్తోంది. మ‌రోవైపు.. వైసీపీలో ఉన్న నాయ‌కుల్లో ఎక్కువ మంది గుంటూరులోనే ఉన్నారు. దీంతో ఇక్క‌డ తన పట్టు నిలుపుకో వాలని వైసీపీ ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేస్తోంది. అధికారంలో ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాలని గ్రౌండ్ లెవెల్‌లో వ్యూహాలు రచిస్తున్నాయి. దీంతో గుంటూరు కార్పొరేష‌న్ ఎన్నిక‌లు వ‌న్ సైడ్ కాక‌పోవ‌చ్చ‌న్న చ‌ర్చ జ‌రుగుతోంది.

మేయర్ పీఠంపై..

గుంటూరు మేయర్ పీఠాన్ని దక్కించుకోవడానికి కూట‌మి భాగస్వామ్య పార్టీ బీజేపీ వ్యూహాలు రచిస్తోందని తెలుస్తోంది. ఇందులో భాగంగానే మాజీ మేయర్ కావటి మనోహర్ నాయుడుతో ఆ పార్టీ నేతలు సంప్రదింపులు జరుపుతున్నారు. గతంలో వైసీపీ తరఫున మేయర్‌గా పనిచేసిన కావటికి పార్టీ కండువా క‌ప్పి.. తద్వారా బలమైన పునాది వేసుకోవాలని బీజేపీ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఇదిలావుంటే.. టీడీపీ నేత‌, ఎమ్మెల్యే క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ తో పాటు.. బీసీలు కూడా ఈ ద‌ఫా మేయ‌ర్ పీఠంపై ఆశ‌లు పెట్టుకున్నార‌ని తెలుస్తోంది. మొత్తంగా.. వైసీపీ వ‌ర్సెస్ టీడీపీ మ‌ధ్య కొంత ప‌ట్టు క‌నిపించేలా ఇక్క‌డి రాజ‌కీయాలు ఉన్నాయ‌ని అంటున్నారు.