వైసీపీలోకి గుండ కుటుంబం...మేయర్ అభ్యర్థిగా ఆమె ?
ఇదే విషయాన్ని పార్టీ నాయకుల సమావేశంలో మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు ప్రకటించడంతో జిల్లా రాజకీయం పూర్తిగా వేడెక్కినట్లు అయింది.
By: Satya P | 17 Oct 2026 3:00 PM ISTవైసీపీలోకి గుండ కుటుంబం త్వరలో వెళ్తోంది అన్న చర్చ రాజకీయంగా జిల్లాను కుదిపేస్తోంది. గుండా కుటుంబానికి జిల్లావ్యాప్తంగా మంచి పేరు ఉంది. ప్రత్యేకించి శ్రీకాకుళం నగరంలో దశాబ్దాలుగా పట్టు ఉంది. టీడీపీతో నాలుగున్నర దశాబ్దాల బంధం ఆ కుటుంబం సొత్తు. అలాంటి గుండ కుటుంబం టీడీపీని వీడుతోంది అంటే అది రాజకీయంగా అతి పెద్ద భూకంపంగానే అంతా భావిస్తున్నారు. అంతే కాదు వైసీపీకి ఇది పెద్ద రాజకీయ లాభాన్ని తెచ్చి పెడుతుందని కూడా అంటున్నారు. దాంతో ఈ ప్రచారంతో జిల్లా పొలిటికల్ గా షేక్ అవుతోంది.
ఎన్టీఆర్ పిలుపుతో :
ఇదిలా ఉంటే దివంగత నాయకుడు మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ ఎన్టీఆర్ పిలుపు మేరకు టీడీపీలో చేరి 1985లో తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. 1983లో తంగి సత్యనారాయణకు టికెట్ ఇచ్చి స్పీకర్ ని చేస్తే ఆయన నాదెండ్ల భాస్కరరావుతో చేరి ఎన్టీఆర్ కి వెన్ను పోటు పొడిచారు. దాంతో ఎన్టీఆర్ 1985 మధ్యంతర ఎన్నికల్లో నిజాయతీపరుడు నిబద్ధత కలిగిన వారిగా ఆనాటి యువ న్యాయవాది గుండ అప్పల సూర్యనారాయణను గుర్తించి పార్టీ టికెట్ ఇస్తే శ్రీకాకుళం నుంచి మంచి మెజారిటీతో గెలిచారు. ఎన్టీఆర్ ప్రభుత్వంలో ఆయన న్యాయ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. అది లగాయితూ నాలుగు పర్యాయాలు అదే శ్రీకాకుళం శాసనసభ నియోజకవర్గం నుంచి గుండ అప్పల సూర్యనారాయణ గెలిచి వచ్చారు. ఇక ఆయన సతీమణి గుండా లక్ష్మీ దేవి 2014లో టీడీపీ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆమె 2019లో వైసీపీ ప్రభంజనంలో సైతం అతి తక్కువ ఓట్లతో ఓటమిని చవి చూశారు. 2024లో ఆమెకు టికెట్ దక్కకుండా టీడీపీలోని కొన్ని శక్తులు ప్రయత్నం చేశాయని గుండ వర్గం ఆరోపిస్తూ ఉంటుంది. ఇక నామినేటెడ్ పదవి కానీ ఎమ్మెల్సీ కానీ ఇస్తారు అనుకుంటే అదీ దక్కలేదు, పార్టీలో నిరాదరణ వల్లనే గుండ అప్పల సూర్యనారాయణ మనో వేదన చెంది ఈ ఏడాది జనవరిలో మరణించారు అని కూడా చెబుతారు.
మేయర్ సీటు కోసం :
ఇక ఇపుడు చూస్తే శ్రీకాకుళం నగర మేయర్ కోసం గుండ లక్ష్మీదేవి ప్రయత్నం చేస్తున్నారు. ఆమె ఈ మధ్యనే అమరావతి వెళ్ళి టీడీపీ అధినాయకత్వాన్ని కలిసి వచ్చారు. అయితే ఆమెకు సరైన హామీ దక్కలేదని గుండ వర్గీయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇపుడు చూస్తే శ్రీకాకుళం మేయర్ సీటుని జనసేనకు పొత్తులో అప్పగించారు. దీంతో గుండా వర్గం అంతా పార్టీ మీద తీవ్ర అసహనం వ్యక్తం చేస్తోంది. తమకు పార్టీలో గౌరవం లేనపుడు ఇక ఉండి లాభం ఏమిటి అని కూడా చర్చించుకుంటున్నారు. ఈ కమంలో గుండ లక్ష్మీదేవి తన అనుచరులు అభిమానులతో వైసీపీలోకి చేరిపోతారు అని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది.
ప్రకటించిన ధర్మాన :
ఇదే విషయాన్ని పార్టీ నాయకుల సమావేశంలో మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు ప్రకటించడంతో జిల్లా రాజకీయం పూర్తిగా వేడెక్కినట్లు అయింది. మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి కుటుంబం 50 వేల మందితో త్వరలో వైసీపీలో చేరుతుందని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. తన నివాసంలో ఇతర పార్టీలకు చెందిన పలువురు నాయకులను వైసీపీలోకి ఆహ్వానించిన ఆయన మాట్లాడుతూ వైసీపీ తరఫున మేయర్ అభ్యర్థిగా లక్ష్మీదేవి బరిలో ఉంటారని కూడా కీలక ప్రకటన చేశారు. ఆమె అభ్యర్థిత్వాన్ని వైసీపీ ఖరారు చేసినట్టు పత్రికల్లో వార్తలు రాగానే టిడిపి పారిపోయిందని విమర్శించారు. ఇక జనసేన నుంచి ఎవరో పోటీ చేస్తున్నారని తెలిపారు.
ధర్మాన గుండ కుటుంబం కలిస్తే :
ఇప్పటిదాకా రెండు వర్గాలుగా రెండు పార్టీలుగా రాజకీయం చేసిన ధర్మాన గుండ కుటుంబం కలసి వస్తే తట్టుకునే ధైర్యం ప్రత్యర్ధులకు ఉందా అని ఆయన ప్రశ్నించారు. దూకుడుగా ముందుకు తామంతా సాగిపోతామని కూడా చెప్పారు. శ్రీకాకుళం మేయర్ సీటుని నూరు శాతం వైసీపీ గెలుస్తుందని కూడా ఆయన ధీమా వ్యక్తం చేయడం విశేషం. మరో వైపు చూస్తే టీడీపీ నుంచి మేయర్ పదవికి అనేక మంది చూస్తూంటే జనసేనకు ఈ సీటుని కేటాయించడం పట్ల టీడీపీలో అసంతృప్తి వ్యక్తం అవుతోంది అని అంటున్నారు.
