కోఠి బ్యాంక్ స్ట్రీట్ లో కాల్పులు.. ఏటీఏం వద్ద ఎందుకు?
ఈ రోజు (శనివారం) ఉదయం హైదరాబాద్ మహానగరంలోని కోఠి బ్యాంక్ స్ట్రీట్ లో అనూహ్య ఘటన చోటు చేసుకుంది.
By: Garuda Media | 31 Jan 2026 9:58 AM ISTఈ రోజు (శనివారం) ఉదయం హైదరాబాద్ మహానగరంలోని కోఠి బ్యాంక్ స్ట్రీట్ లో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. రద్దీగా ఉండే ఆ ప్రాంతంలోని ఒక బ్యాంక్ ఏటీఎంలో డబ్బుల్ని డిపాజిట్ చేసేందుకు వెళ్లిన వ్యక్తికి షాకింగ్ అనుభవం ఎదురైంది. ఎస్ బీఐ ప్రధాన కార్యాలయం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఉదయం ఏడు గంటల ప్రాంతంలో ఏటీఎంలో డబ్బులు డిపాజిట్ చేసేందుకు రషీద్ అనే వ్యక్తి వచ్చాడు.
అప్పటికే అతడ్ని ఫాలో అవుతున్న దుండగులు.. అతడు ఏటీఎం వద్దకు చేరుకున్నంతనే అతడిపై పిస్టల్ తో కాల్పులు జరిపారు. ఒక్కసారిగా అక్కడున్న వారు ఉలిక్కిపడిన పరిస్థితి. డబ్బులతో ఉన్న రషీద్ షాక్ లో ఉన్న వేళ.. దుండగులు ఆ డబ్బు సంచిని పట్టుకొని పరారయ్యారు. కాల్పుల ఘటనలో రషీద్ కాలికి తూటా గాయమైంది. దీంతో అతడ్ని వెంటనే ఉస్మానియా ఆసుపత్రికి తరలించి.. చికిత్స చేస్తున్నారు.
ఈ ఘటన సంచలనంగా మారింది. పట్టపగలు.. కోఠి బ్యాంక్ స్ట్రీట్ తో జరిగిన ఉదంతాన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు వెంటనే క్లూస్ టీంను రంగంలోకి దించారు. అదే సమయంలో చుట్టుపక్కల సీసీ ఫుటేజ్ ని పరిశీలిస్తున్నారు. ఇటీవల కాలంలో నగరంలో కాల్పుల ఉదంతాలు ఎక్కువ అవుతున్నాయన్న మాట వినిపిస్తున్న వేళ.. ఈ ఉదంతం చోటు చేసుకోవటం గమనార్హం. నిందితులు బాధితుడికి తెలిసిన వారై ఉంటారా? అన్నది అనుమానంగా మారింది. లేకపోతే.. ఇంత ఉదయం వేళలో ఏటీఎంలో డబ్బులు డిపాజిట్ చేసే విషయం వారికి ఎలా తెలిసింది? అన్నది ప్రశ్నగా మారింది.
