Begin typing your search above and press return to search.

పొత్తుల్లో విరుపులు : మంత్రి సంధ్యారాణి కన్నీటి పర్యంతం

కూటమి పార్టీల మధ్య పొత్తులు కార్యకర్తలకు నాయకులకే కాదు కొన్ని చోట్ల మంత్రులకు కూడా ఆవేదన కలిగిస్తున్నాయి. పొత్తులు అధిష్టానాలు నిర్ణయిస్తాయి

By:  Satya P   |   16 Oct 2026 10:48 PM IST
పొత్తుల్లో విరుపులు :  మంత్రి సంధ్యారాణి కన్నీటి పర్యంతం
X

కూటమి పార్టీల మధ్య పొత్తులు కార్యకర్తలకు నాయకులకే కాదు కొన్ని చోట్ల మంత్రులకు కూడా ఆవేదన కలిగిస్తున్నాయి. పొత్తులు అధిష్టానాలు నిర్ణయిస్తాయి. కానీ వాటి ఫలితాలు పర్యవసానాలు నేరుగా క్షేత్ర స్థాయిలో ఉండే నాయకులనే గురి పెడతాయి. మీరేమి చేశారు, మాకు అన్యాయం చేశారు అని క్యాడర్ లోకల్ లీడర్ విరుచుకుపడితే జవాబు చెప్పాల్సిన బాధ్యత మంత్రులదీ ఎమ్మెల్యేలదీ అవుతోంది. ఇపుడు టీడీపీ మంత్రులది అలాంటి ఇరకాటంగానే ఉంది మరి. సాలూరు ఎమ్మెల్యే, మంత్రి అయిన గుమ్మడి సంధ్యారాణి అయితే పొత్తులలో జనసేనకు ఎక్కువ సీట్లు కేటాయించడం పట్ల ఆవేదనతో పాటు ఆగ్రహానికి గురి అయ్యారు. అంతే కాదు ఇది ధర్మమా అని తీవ్ర స్థాయిలో అసంతృప్తిని వ్యక్తం చేశారు.

జిల్లాలో రెండు ఎలా :

ఇక చూస్తే పార్వతీపురం మన్యం జిల్లాలో ఉన్నవే మూడు మున్సిపాలిటీలు. అందులో రెండు తీసుకెళ్ళి జనసేనకు కేటాయిస్తే ఎలా అని మంత్రి ప్రశ్నించారు. ఇది పొత్తా అని సూటిగానే నిలదీశారు. అలాగే న్యాయమా ధర్మమా అని ఆమె పెద్ద మాటలనే వాడారు. ఒక్కసారి అధినాయకత్వం ఆలోచించాలని కూడా ఆమె పార్టీ పెద్దలను కోరారు. కార్యకర్తలకు తాను ఏ విధంగానూ సమాధానం చెప్పుకోలేకపోతున్నాను అని ఆమె ఒక దశలో పూర్తిగా ఎమోషనల్ అయ్యరు అంతే కాదు కన్నీటి పర్యంతం అయ్యారు. పార్వతీపురం మన్యం జిల్లాలో మూడు మున్సిపాలిటీలు ఉన్నాయి. అందులో సాలూరు, పాలకొండలను పొత్తులో భాగంగా జనసేనకు ఇచ్చారు. కేవలం పార్వతీపురం మాత్రమే టీడీపీకి వదిలారు. దాంతో గుమ్మడి సంధ్యారాణి అయితే దీని మీద ఆగ్రహిస్తున్నారు. తన సొంత నియోజకవర్గం సాలూరులో టీడీపీకి మునిసిపాలిటీ లేని పరిస్థితి ఆమెది.

రాజకీయ కలకలంగా :

అసలే కూటమి పొత్తులు ఎడతెరిపి లేని చర్చలతో పాటు సుదీర్ఘంగా సాగాయి. అంతే కాకుండా చివరి నిముషంలో అవి ఖరారు చేశారు. దాంతో కొన్ని చోట్ల ఇబ్బందులు ఉన్నాయని అంటున్నారు. ముఖ్యంగా టీడీపీ ఎమ్మెల్యేలను మంత్రులను క్యాడర్ అయితే ప్రశ్నిస్తూ గుక్క తిప్పుకోనీయకుండా చేస్తోంది. దాంతో టీడీపీ కీలక నేతలే పొత్తుల మీద గొంతు విప్పాల్సి వస్తోంది. అలాగే మంత్రి గుమ్మడి సంధ్యారాణి టీడీపీ పార్టీ అంతర్గత సమావేశంలో కన్నీరు పెట్టుకుంటూ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

జనసేన ఓట్ల శాతంపైన :

ఇదిలా ఉంటే పార్వతీపురం మన్యం జిల్లాలో వైసీపీకి టీడీపీకి బలం ఉంది. జనసేన విషయం తీసుకుంటే పెద్దగా పట్టు లేదని అంటున్నారు. ఎక్కువగా గిరిజన ప్రాంతాలు ఉన్నాయి. దాంతో దశాబ్దాలుగా రాజకీయం చేసే పార్టీలకే ఓటు షేర్ ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో జనసేనకు రెండు మున్సిపాలిటీలు ఇస్తే గెలిపించేది ఎవరు అన్నది టీడీపీ క్యాడర్ నుంచి వస్తున్న ప్రశ్న. మరీ ముఖ్యంగా సాలూరు నియోజకవర్గంలో కనీసం రెండు శాతం బలం కూడా లేని జనసేన పార్టీకి మున్సిపల్ చైర్మన్ సీటు ఎలా కేటాయిస్తారని మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రశ్నించారు.

కష్టపడ్డ క్యాడర్ తో :

ఇక టీడీపీ అంతే ప్రేమించిన వారు, పార్టీ కోసం ఎంతో కాలంగా కష్టపడుతున్న తెలుగుదేశం కార్యకర్తలకు తానేం సమాధానం చెప్పాలని మంత్రి అంటున్నారు. జిల్లాలో ఉన్న మూడు స్థానాల్లో రెండు సీట్లు జనసేనకు కేటాయించడం పొత్తు ధర్మమా అని ఆమె నిలదీస్తున్నారు. అయితే పార్టీ సమావేశంలో ఒక్కసారిగా మంత్రి సంధ్యారాణి భావోద్వేగానికి గురికావడంతో అక్కడే ఉన్న సీనియర్ నాయకులు ఆమెను ఇతర టీడీపీ శ్రేణులను బుజ్జగించే ప్రయత్నం చేశారు. అయితే అందరిలోనూ ఇదే రకమైన ఆవేదన బాధ ఉంది. కానీ పొత్తులు అంటే ఇలాగే ఉంటాయని అంటున్నారు. పరస్పరం సహకరించుకోవాల్సిందే అన్నది మూడు పార్టీల అధినాయకత్వాల నుంచి వస్తున్న సందేశం. చూడాలి మరి ఈ కన్నీళ్ళు అసంతృప్తులు ఏ విధమైన పరిణామాలకు దారి తీస్తాయో.