Begin typing your search above and press return to search.

భార్యంటే భయపడుతోన్న భర్త... తెరపైకి షాకింగ్ రీజన్!

భార్యభర్తల మధ్య రకరకాల సమస్యలు వస్తాయనే సంగతి తెలిసిందే! అయితే ఈ విషయంలో చాలా మంది సర్ధుకుపోతుంటే.. మరికొంతమంది పెట్టేబేడా "సర్దుకు"పోతున్న పరిస్థితి.

By:  Raja Ch   |   17 Nov 2025 10:42 AM IST
భార్యంటే భయపడుతోన్న  భర్త... తెరపైకి షాకింగ్  రీజన్!
X

భార్య భర్తల మధ్య రకరకాల సమస్యలు వస్తాయనే సంగతి తెలిసిందే! అయితే ఈ విషయంలో చాలా మంది సర్ధుకుపోతుంటే.. మరికొంతమంది పెట్టేబేడా "సర్దుకు"పోతున్న పరిస్థితి. ఈ సమయంలో ఓ ఆసక్తికరమైన కేసు గుజరాత్ హైకోర్టుకు వచ్చింది. ఈ క్రమంలో... తన భార్య వీధి కుక్కల వ్యామోహం తన జీవితాన్ని నాశనం చేసిందని, తనకు అంగస్తంభన సమస్య కూడా వచ్చిందని ఆరోపించాడు ఓ భర్త!

అవును... తన భార్య వీధి కుక్కలను తమ ఇంట్లోకి తీసుకొచ్చి, వాటిని శుభ్రం చేసి, తమ మంచంపై పడుకోబెడుతుందని, తనకు ఇది నరకంగా ఉందని, తనను ఇబ్బందులకు గురి చేస్తుందని 41 ఏళ్ల ఓ వ్యక్తి.. విడాకులు కోరుతూ గుజరాత్ హైకోర్టును ఆశ్రయించాడు. ఈ సందర్భంగా తన పిటిషన్ లో పేర్కొన్న విషయాలు షాకింగ్ గా ఉన్నాయనే కామెంట్లను సొంతం చేసుకున్నాయి.

జాతీయ మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం... ఆ జంట 2006లో వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలో అతని భార్య ఒక వీధి కుక్కను వారి ఫ్లాట్ లోకి ప్రవేశపెట్టడంతో తనకు కష్టాలు మొదలయ్యయాని చెబుతున్నాడు. ఆ తర్వాత ఆమె మరిన్ని వీధి కుక్కలను తీసుకువచ్చి, వాటిని శుభ్రం చేసి చూసుకుంటుందని.. అందులో ఓ కుక్క మా మంచంపైనే పడుకోవాలని ఆమె పట్టుబడుతోందని ఆరోపించాడు.

ఇలా ఇంట్లో వీధి కుక్కలు ఉండటంతో పొరుగువారు 2008లోనే పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలిపారు. ఈ ఒత్తిడి తన శ్రేయస్సును నాశనం చేసిందని, అంగస్తంభన సమస్యకు దారితీసిందని అతను ఆరోపించాడని తెలుస్తోంది! భార్య తనను ఇబ్బంది పెట్టడానికే వీధి కుక్కలను ఇంట్లోకి తీసుకొచ్చిందని ఆరోపించాడు!

ఈ నేపథ్యంలో జస్టిస్ సంగీత కే విషేన్, జస్టిస్ నిషా ఎం ఠాకోర్ లతో కూడిన డివిజన్ బెంచ్.. ఏదైనా పరిష్కారానికి సంబంధించిన సూచనలు తీసుకోవాలని ఇరువైపుల న్యాయవాదులను కోరింది. ఈ సమయంలో.. భార్య రూ.2 కోట్ల సెటిల్ మెంట్ మొత్తాన్ని డిమాండ్ చేస్తోందని.. అయితే భర్త ఉద్యోగం, ఆర్ధిక పరిస్థితి దృష్ట్యా అంత చెల్లించలేమని చెప్పారు.

ఈ నేపథ్యంలో... రూ.15 లక్షలు మాత్రమే చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాడని భర్త తరుపు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. ఈ క్రమంలో... హైకోర్టు తదుపరి విచారణను డిసెంబర్ 1 కి వాయిదా వేసింది.