Begin typing your search above and press return to search.

క్రైమ్ థ్రిల్లర్‌ను మించిన దారుణం: భర్తను ముక్కలుగా నరికి పూడ్చిపెట్టి.. రెండేళ్లు 'ఆస్ట్రేలియా' నాటకం!

గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో వెలుగుచూసిన ఒక దారుణ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.

By:  A.N.Kumar   |   30 July 2026 7:52 PM IST
క్రైమ్ థ్రిల్లర్‌ను మించిన దారుణం: భర్తను ముక్కలుగా నరికి పూడ్చిపెట్టి.. రెండేళ్లు ఆస్ట్రేలియా నాటకం!
X

గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో వెలుగుచూసిన ఒక దారుణ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో భర్తను కిరాతకంగా హత్య చేసి మృతదేహాన్ని ముక్కలుగా నరికి పాతిపెట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అత్యంత కిరాతకంగా సాగిన ఈ క్రైమ్ డ్రామాలో నేరాన్ని కప్పిపుచ్చుకునేందుకు సదరు మహిళ రెండేళ్ల పాటు ఆడిన నాటకం పోలీసులను కూడా దిగ్భ్రాంతికి గురిచేసింది.

పోలీసుల కథనం ప్రకారం.. జామ్‌నగర్‌కు చెందిన జిగ్నేశ్ మావడియా రెండేళ్ల క్రితం అకస్మాత్తుగా కనిపించకుండా పోయాడు. అయితే అతని భార్య పృథ్వీ మాత్రం కుటుంబ సభ్యులకు, బంధువులకు జిగ్నేశ్‌కు ఆస్ట్రేలియాలో మంచి ఉద్యోగం వచ్చిందని, అక్కడే స్థిరపడ్డాడని నమ్మించింది. వివాహానికి ముందే పృథ్వీకి నిలేష్ అనే వ్యక్తితో ప్రేమ వ్యవహారం ఉంది. పెళ్లయిన తర్వాత కూడా వారి బంధం కొనసాగడంతో దానికి అడ్డుగా ఉన్న భర్తను ఎలాగైనా మట్టుబెట్టాలని నిలేష్‌తో కలిసి పథకం రచించింది.

క్రూరమైన ప్లాన్.. ముక్కలుగా నరికి పూడ్చివేత

పథకంలో భాగంగా జిగ్నేశ్‌కు మద్యంలో అత్యంత ప్రమాదకరమైన సైనైడ్ కలిపి ఇచ్చారు. అది తాగిన కొద్దిసేపటికే జిగ్నేశ్ ప్రాణాలు కోల్పోయాడు. అనంతరం నేరం బయటపడకుండా ఉండేందుకు మృతదేహాన్ని జామ్‌నగర్‌లోని జీఐడీసీ ప్రాంతంలో ఉన్న ఓ ఫ్యాక్టరీకి తరలించారు. అక్కడ శవాన్ని ముక్కలుగా నరికి, సుమారు 12 అడుగుల లోతు గుంత తవ్వి పూడ్చిపెట్టారు. అనంతరం ఏమీ తెలియనట్లు పృథ్వీ తన ఇంట్లో సాధారణ జీవితం గడపడం ప్రారంభించింది.

పాపం పండిందిలా..

భర్త ఆస్ట్రేలియాలో ఉన్నాడని రెండేళ్లుగా చెబుతున్న పృథ్వీ నాటకం ఒక చిన్న సంఘటనతో బట్టబయలైంది. ఇటీవల ఆస్ట్రేలియాకు వెళ్తున్న ఓ బంధువు జిగ్నేశ్ అడ్రస్, ఫోన్ నంబర్ ఇవ్వాల్సిందిగా కోరాడు. పృథ్వీ సమాధాన దాటవేతతో అనుమానం వచ్చిన జిగ్నేశ్ సోదరుడు అశోక్.. ఆస్ట్రేలియాలోని అధికారిక వర్గాల ద్వారా విచారించగా జిగ్నేశ్ పేరుతో ఎలాంటి ఉద్యోగం లేదా వలస రికార్డులు లేవని తేలింది.

పోలీస్ కేసు.. అరెస్ట్

అనుమానంతో అశోక్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు పృథ్వీ, నిలేష్‌లను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా.. వారు చేసిన దారుణాన్ని ఒప్పుకున్నారు. ప్రస్తుతం నిందితులిద్దరిపై హత్య, ఆధారాల ధ్వంసం, కుట్ర కోణాల్లో కేసులు నమోదు చేసి విచారణ వేగవంతం చేశారు.