33 ఏళ్ల క్రితం సక్సెస్ మూవీ ప్లాట్ తో నాటకం.. దొరికిపోయిన భర్త
దాదాపు 33 ఏళ్ల క్రితం ప్రముఖ సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహించిన మూవీ మనీ. ఒక సూపర్ డూపర్ సినిమా తీసి..భారీ కలెక్షన్లతో బాక్సాఫీస్ ను షేక్ చేసే టాలెంట్ అప్పట్లో వర్మకు పుష్కలం.
By: Garuda Media | 22 Jun 2026 11:45 AM ISTదాదాపు 33 ఏళ్ల క్రితం ప్రముఖ సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహించిన మూవీ మనీ. ఒక సూపర్ డూపర్ సినిమా తీసి..భారీ కలెక్షన్లతో బాక్సాఫీస్ ను షేక్ చేసే టాలెంట్ అప్పట్లో వర్మకు పుష్కలం. అలాంటి ఆయన.. పెద్ద హీరోలతో సినిమాలు తీస్తూనే.. చిన్న సినిమాలు తీసేవారు. ఎంతోమందికి కొత్త లైఫ్ ను ఇచ్చిన టాలెంట్ ఆయన సొంతం. ఆ విషయాల్ని పక్కన పెడితే.. దాదాపు 33 ఏళ్ల క్రితం మనీ అనే మూవీ విడుదలైంది. అందులో ఆస్తి కోసం తాను కిడ్నాప్ అయినట్లుగా భార్య దగ్గర కిడ్నాప్ నాటకం ఆడతాడో భర్త. ఇంచుమించే అలాంటి కాన్సెప్ట్ ఇప్పుడు రియల్ గా చోటు చేసుకుంది.
చేసిన అప్పుల్ని తీర్చేందుకు వీలుగా తనను తాను కిడ్నాప్ అయినట్లుగా నాటకం ఆడాడో భర్త. అతడి నాటకాల గురించి తెలియని భార్య.. ఆందోళనతో పోలీసుల్ని ఆశ్రయించటం.. వారు వెంటనే స్పందించి.. అసలు విషయాన్ని రట్టు చేయటంతో షాక కు గురైన భార్య ఉదంతమిది. అసలేం జరిగిందంటే.. గుజరాత్ లోని సూరత్ కు చెందిన జిగ్నేశ్ అనే వ్యక్తి అకౌంటెంట్ గా పని చేస్తుంటాడు. అయితే.. తక్కువ కాలంలో భారీగా డబ్బులు సంపాదించాలన్న అత్యాశతో షేర్ మార్కెట్ లో భారీగా పెట్టుబడులు పెట్టాడు. అడ్డంగా బుక్ అయ్యాడు. తీవ్రమైన నష్టాలు రావటంతో అప్పుల మీద అప్పులు చేసి.. మొత్తంగా ఇరుక్కుపోయాడు.
తాను చేసిన అప్పుల నుంచి బయటపడేందుకు ఒక నాటకానికి తెర తీశాడు. గోద్రాలో ఒక హోటల్ రూం బుక్ చేసుకొని.. తనను తాను బంధీ అయినట్లుగా ఒక వీడియో చేసి.. దాన్ని భార్యకు పంపాడు. కిడ్నాప్ నకు గురైన నీ భర్తను కాపాడుకోవాలంటే రూ.50 లక్షలు పంపితేనే విడుదల చేస్తారంటూ కిడ్నాపర్ల పేరుతో భర్తే స్వయంగా పంపిన బెదిరింపులకు బెదిరిన భార్య.. వెంటనే పోలీసుల్ని ఆశ్రయించారు. దీంతో.. వారు రంగంలోకి దిగారు. టెక్నికల్ ఎవిడెన్స్ ను సేకరించిన పోలీసులు అతను బస చేసిన హోటల్ కు వెళ్లి.. అవాక్కుఅయ్యారు.
ఎంచక్కా రూంలో ఉన్న అతను.. తను వేసిన ప్లాన్ సక్సెస్ అయితే.. తాను చేసిన అప్పులన్ని తీరిపోతాయని.. తాను ఎంచక్కా హ్యాపీగా ఉండొచ్చన్న ముష్టి ప్లాన్ బెడిసి కొట్టింది. భర్త స్వీయ కిడ్నాప్ నిర్వాకాన్ని భార్యకు చెప్పారు పోలీసులు. దీంతో అతగాడి ప్లాన్ ఫెయిల్ అయ్యింది. అయితే.. కిడ్నాప్ డ్రామా ఆడిన జిగ్నేశ్.. తనను తాను బట్టలతో బంధీ అయినట్లుగా రూపొంచిన వీడియో కు ఎవరి సాయంతో చేశారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఈ గుట్టు విప్పేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. స్వీయ కిడ్నాప్ ఉదంతం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ క్రమంలో వర్మ మనీ సినిమాను గుర్తు చేసుకుంటున్న పరిస్థితి.
