Begin typing your search above and press return to search.

లిబియా కిడ్నాపర్ల చెరలో గుజరాతీ కుటుంబం.. ఆశగా భారత్ వైపు ఎదురు చూపు..

గుజరాత్‌లోని మెహసాణా జిల్లాకు చెందిన ఒక కుటుంబం ఇప్పుడు లిబియాలో ఎదుర్కొంటున్న దుస్థితి ఈ ప్రశ్నను మరింత పదునుగా నిలబెడుతోంది.

By:  Tupaki Political Desk   |   14 Dec 2025 11:46 AM IST
లిబియా కిడ్నాపర్ల చెరలో గుజరాతీ కుటుంబం.. ఆశగా భారత్ వైపు ఎదురు చూపు..
X

విదేశాలకు వెళ్లి స్థిరపడాలన్న కల ఇప్పటి భారత మధ్యతరగతి కుటుంబాల్లో సాధారణమైపోయింది. మెరుగైన ఉపాధి, సురక్షిత జీవితం, పిల్లలకు మంచి భవిష్యత్తు.. ఇవన్నీ ఆ కలకు బలమైన కారణాలు. కానీ ఆ కలను నమ్ముకొని అడుగేసిన ప్రతి అడుగు భద్రమేనా? గుజరాత్‌లోని మెహసాణా జిల్లాకు చెందిన ఒక కుటుంబం ఇప్పుడు లిబియాలో ఎదుర్కొంటున్న దుస్థితి ఈ ప్రశ్నను మరింత పదునుగా నిలబెడుతోంది. ఉద్యోగం, వలస అనే ఆశతో బయల్దేరిన ఆ కుటుంబం ఇప్పుడు కిడ్నాపర్ల చెరలో ఉండడం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది.

కిడ్నాప్ కు గురైన కుటుంబం..

కిస్మత్‌సింగ్ చావ్డా, ఆయన భార్య హీనాబెన్, కూతురు దేవాన్షి.. ఈ ముగ్గురు ప్రస్తుతం లిబియాలోని బెంఘాజీ ప్రాంతంలో కిడ్నాప్‌కు గురయ్యారు. వారిని విడిచిపెట్టేందుకు దుండగులు రూ.2 కోట్ల పరిహారం డిమాండ్ చేస్తున్నట్లు గుజరాత్ పోలీసులు వెల్లడించారు. మొదట పోర్చుగల్‌కు వెళ్లి అక్కడ స్థిరపడాలన్న ఆశతో, ఏజెంట్లను ఆశ్రయించిన ఈ కుటుంబం, చివరికి లిబియా అనే రాజకీయ అస్థిరత, గ్యాంగ్ హింసలతో నిండిన దేశంలో చిక్కుకుపోయింది. అహ్మదాబాద్ నుంచి దుబాయ్, అక్కడి నుంచి బెంఘాజీ వరకు జరిగిన ఈ ప్రయాణం, ఎంత ప్రమాదకరంగా మలుపు తిరిగిందో ఇప్పుడు స్పష్టం అవుతోంది. లిబియా పరిస్థితులు ప్రపంచానికి తెలియనివి కావు. సంవత్సరాలుగా అంతర్గత యుద్ధాలు, మిలీషియా గ్యాంగులు, ప్రభుత్వ నియంత్రణ లోపం.. ఇవన్నీ అక్కడి పరిస్థితులు. ఇలాంటి దేశాలకు వెళ్లే ముందు ఎంత జాగ్రత్త అవసరమో ఈ ఘటన గుర్తు చేస్తోంది. అయినా సరే, ఏజెంట్ చెప్పాడు, ‘అక్కడ నుంచి యూరప్ చేరతాం’ అనే మాటలతో ఎన్నో కుటుంబాలు తమ ప్రాణాలను పణంగా పెడుతున్నాయి. ఈ కుటుంబం విషయంలోనూ అదే జరిగింది.

ఇక్కడ మరో ఆందోళన కలిగించే అంశం.. మానవ అక్రమ రవాణా ముఠాలు ఎంత పద్ధతిగా పనిచేస్తున్నాయన్నది. నేరుగా యూరప్ తీసుకెళ్తామంటూ చెప్పకుండా, మధ్యలో దుబాయ్, ఆఫ్రికా దేశాల పేర్లు వినిపించి, చివరకు ప్రమాదకర ప్రాంతాల్లో వదిలేయడం.. ఇది ఇప్పుడు కొత్త పద్ధతిగా మారింది. పోలీసులు ఈ కేసులో భారతీయ ఏజెంట్ల ప్రమేయం లేదని చెబుతున్నప్పటికీ, ఇలాంటి నెట్‌వర్క్‌లు అంతర్జాతీయంగా ఎంత బలంగా ఉన్నాయో ఈ ఘటన చెబుతోంది.

వేలాది మందికి ఇది హెచ్చరిక..

ఈ కిడ్నాప్ ఘటన ఒక్క కుటుంబానికి మాత్రమే పరిమితమైన విషాదం కాదు. ఇది దేశవ్యాప్తంగా వేలాది మంది యువత, కుటుంబాలు అనుసరిస్తున్న ‘అన్‌సేఫ్ మైగ్రేషన్’ ధోరణిపై హెచ్చరిక. విదేశీ కలలు నిజమవ్వాలంటే సరైన మార్గాలు, ప్రభుత్వ అనుమతులు, అధికారిక వీసాలు తప్పనిసరి. వాటిని పక్కన పెట్టి, అక్రమ మార్గాల్లో ప్రయాణం చేస్తే, లిబియా లాంటి దేశాల్లో బందీలుగా మారే ప్రమాదం ఎంత నిజమో ఈ ఉదంతం స్పష్టంగా చూపిస్తోంది. ఇప్పుడు అందరి చూపు భారత ప్రభుత్వంపై ఉంది. ఈ గుజరాత్ కుటుంబం కిడ్నాప్ గురించి విదేశాంగ మంత్రిత్వశాఖ ఇప్పటి వరకు అధికారిక ప్రకటన చేయకపోయినా, కుటుంబాన్ని క్షేమంగా తీసుకొచ్చేందుకు తెర వెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఆశాభావం కలుగుతుంది. గతంలోనూ ఇరాక్, సిరియా, లిబియా వంటి దేశాల్లో చిక్కుకున్న భారతీయులను ప్రభుత్వం సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చిన ఉదాహరణలు ఉన్నాయి. కానీ ప్రతి సారి ఇలాంటి ఘటనలు జరగడం, ముందస్తు అవగాహన ఎంత తక్కువగా ఉందో కూడా బయటపెడుతోంది.

ఈ ఘటన నుంచి మనం నేర్చుకోవాల్సింది ఒక్కటే. విదేశాలకు వెళ్లడం తప్పు కాదు. కానీ తప్పు మార్గాల్లో, తప్పు వ్యక్తులను నమ్మి అడుగేస్తే, ఆ కలే శాపంగా మారుతుంది. లిబియాలో చిక్కుకున్న ఈ కుటుంబం సురక్షితంగా తిరిగి రావాలని దేశం మొత్తం కోరుకుంటోంది. అదే సమయంలో, ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ప్రజల్లో అవగాహన పెంచడం, అక్రమ వలస మార్గాలపై కఠిన చర్యలు తీసుకోవడం ఇప్పుడు అత్యవసరం. ఎందుకంటే, కలలు కట్టడం సులువు… కానీ వాటి వెనుక దాగిన ప్రమాదాలను గుర్తించడం మరింత ముఖ్యం.