అవెంజర్స్: ఎండ్‌గేమ్ రికార్డును బద్దలు కొట్టిన GTA 6.. ఒక్క రోజులోనే రూ. వేల కోట్ల వసూళ్లు!
13 ఏళ్ల నిరీక్షణ తర్వాత విడుదలైన GTA 6 ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. తొలి 24 గంటల్లోనే 3.79 బిలియన్ డాలర్లు (రూ.34 వేల కోట్లకు పైగా) వసూలు చేసినట్లు నివేదికలు వెల్లడించాయి. దీంతో అవెంజర్స్: ఎండ్‌గేమ్, GTA 5 రికార్డులను అధిగమించి గేమింగ్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించింది.
By: Priya Chowdhary Nuthalapti | 22 Nov 2026 4:03 PM ISTప్రపంచవ్యాప్తంగా వీడియో గేమ్స్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా గ్రాండ్ తెఫ్ట్ ఆటో (GTA) సిరీస్‌కు కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. దాదాపు 13 ఏళ్ల నిరీక్షణ తర్వాత విడుదలైన GTA 6.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. విడుదలైన మొదటి 24 గంటల్లోనే ఈ గేమ్ భారీ ఆదాయాన్ని సాధించి..హాలీవుడ్లో ఎన్నో రికార్డులు సృష్టించిన అవెంజర్స్: ఎండ్‌గేమ్ సినిమాను కూడా వెనక్కి నెట్టడం విశేషం.
Rockstar Games రూపొందించిన GTA 6 నవంబర్ 19, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ప్రస్తుతం ఈ గేమ్ ప్లేస్టేషన్ 5, Xbox Series X|S కన్సోళ్లపై అందుబాటులో ఉంది. ఈ గేమ్ మొదటి 24 గంటల్లోనే ఏకంగా 3.79 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని సాధించినట్లు నివేదికలు వెల్లడించాయి. భారత కరెన్సీలో ఈ మొత్తం సుమారు రూ. 34 వేల కోట్లకు పైగా ఉంటుంది.
ఈ వసూళ్లతో GTA 6 ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద ఎంటర్టైన్మెంట్ లాంచ్‌లలో ఒకటిగా నిలిచింది. 2019లో విడుదలైన హాలీవుడ్ చిత్రం అవెంజర్స్: ఎండ్‌గేమ్ ప్రపంచవ్యాప్తంగా తన థియేట్రికల్ రన్లో రీ-రిలీజ్‌లతో కలిపి సుమారు 2.79 నుంచి 2.94 బిలియన్ డాలర్లు వసూలు చేసింది. అయితే GTA 6 మాత్రం కేవలం ఒక్క రోజులోనే అంతకంటే ఎక్కువ ఆదాయాన్ని సాధించింది.
ఇదే సమయంలో గతంలో విడుదలైన GTA 5 రికార్డును కూడా కొత్త గేమ్ అధిగమించింది. 2013లో విడుదలైన GTA 5 మొదటి రోజున సుమారు 800 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని సాధించింది. కానీ GTA 6 దాదాపు ఐదు రెట్లు ఎక్కువ ఆదాయాన్ని నమోదు చేసినట్లు తెలుస్తోంది. GTA 5 ఇప్పటికీ ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడైన వీడియో గేమ్స్‌లో ఒకటిగా కొనసాగుతోంది. ఈ సిరీస్ ఇప్పటివరకు 470 మిలియన్లకు పైగా యూనిట్ల అమ్మకాలను సాధించినట్లు ప్రచురణ సంస్థ Take-Two Interactive తెలిపింది.
GTA 6లో కథ కూడా ఆసక్తికరంగా ఉంటుంది. లియోనిడా అనే కల్పిత ప్రాంతంలో జరిగే ఈ కథలో జేసన్, లూసియా ప్రధాన పాత్రల్లో కనిపిస్తారు. నేర ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఈ ఇద్దరి ప్రయాణం చుట్టూ గేమ్ సాగుతుంది. రాక్‌స్టార్ గతంలో రూపొందించిన వైస్ సిటీ ప్రపంచాన్ని కూడా ఇందులో మరింత విస్తృతంగా చూపించారు.
కేవలం వసూళ్ల పరంగానే కాకుండా విమర్శకుల ప్రశంసలు కూడా ఈ గేమ్‌కు లభిస్తున్నాయి. మెటాక్రిటిక్లో 99 స్కోర్ సాధించినట్లు సమాచారం. 2026 గేమ్ అవార్డ్స్‌లో ఎనిమిది విభాగాల్లో నామినేషన్లు కూడా దక్కించుకుంది. గేమ్ ఆఫ్ ది ఇయర్, బెస్ట్ గేమ్ డైరెక్షన్, బెస్ట్ నెరేటివ్ వంటి విభాగాల్లో పోటీ పడుతోంది.
