Begin typing your search above and press return to search.

మీ జీఎస్టీ ప్రయోజనాల్ని మిస్ కావొద్దు

ఇంతకాలం ఒకలా.. ఇకపై మరోలా.. అన్న మాట ఇప్పుడు కొనుగోలు చేసే వస్తువులు.. వస్తు సేవల విషయంలో పక్కాగా అమలవుతుందన్న విషయాన్ని అస్సలు మిస్ కావొద్దు

By:  Garuda Media   |   21 Sept 2025 12:14 PM IST
మీ జీఎస్టీ ప్రయోజనాల్ని మిస్ కావొద్దు
X

ఇంతకాలం ఒకలా.. ఇకపై మరోలా.. అన్న మాట ఇప్పుడు కొనుగోలు చేసే వస్తువులు.. వస్తు సేవల విషయంలో పక్కాగా అమలవుతుందన్న విషయాన్ని అస్సలు మిస్ కావొద్దు. ఒకే దేశం.. ఒకే పన్ను పేరుతో జీఎస్టీని అమల్లోకి తీసుకురావటం ఒక ఎత్తు అయితే.. ఇటీవల జీఎస్టీ పన్ను విధానాలకు సంబంధించిన శ్లాబుల్నిభారీగా మార్చేయటం తెలిసిందే. దీంతో.. దాదాపు అన్ని రకాల వస్తువులు.. వస్తుసేవలకు సంబంధించి అయ్యే ఖర్చులో తేడా రావటం ఖాయం. ఇది ఈ నెల 22నుంచి అంటే.. సోమవారం నుంచి అమల్లోకి వస్తుంది. ఈ మార్పులు భారీగా ఉండటంతో పాటు.. పెద్ద ఎత్తున పన్ను ప్రయోజనాల్ని పొందే వీలుంది.

మరి.. ఈ ప్రయోజనాన్ని మీరు పొందుతున్నారా? లేదా? అన్నది తెలిసేదెలా? అన్నది ప్రశ్న. దీనికి చెప్పే సింఫుల్ సమాధానం ఏమంటే.. ప్యాకేజ్డ్ వస్తువుల్ని కొనేటప్పుడు ఎమ్మార్పీని చెక్ చేసి కొనుగోలు చేసే కొత్త అలవాటు చేసుకోవాలని చెబుతున్నారు. ఉదాహరణకు మంచినీళ్ల లీటరు బాటిల్ సంగతే తీసుకుందాం. ఇంతకాలం అది రూ.20 ఎమ్మార్పీ (గరిష్ఠ చిల్లర ధర) రేటుకు అమ్మటం తెలిసిందే. దీనిపైబ ఇప్పటివరకు 18 శాతం జీఎస్టీని వసూలు చేశారు. మారిన జీఎస్టీ శ్లాబుల్లో భాగంగా దీన్ని 5 శాతం పన్ను శ్లాబులోకి మార్చారు.

దీంతో.. రేపటి నుంచి (సోమవారం) దీని మీద ఎమ్మార్పీ రూ.18 ఉండనుంది. దీనికి తగ్గట్లు ఇప్పటికే పెద్ద కంపెనీలు మొదలు చిన్న కంపెనీల వరకు తమ ఎమ్మార్పీలను సవరించుకోవటం మొదలైంది. ఇప్పటికే తమ వినియోగదారులకు కొత్త ఎమ్మార్పీని ఇస్తూ స్టాక్ అందేలా ఆయా కంపెనీలు ఏర్పాటు చేసుకున్నాయి. అయితే.. సగటు వినియోగదారుడికి ఈ ప్రయోజనం అందాలంటే.. కొత్త స్టాక్ మీద కానీ.. మారిన జీఎస్టీ లేబుల్ ను అంటించిన వస్తు సేవల్ని అందించాల్సి ఉంటుంది. అందుకే.. ఇప్పుడు వాటర్ బాటిల్ కొనేటప్పుడు మారిన రూ.18 ధరతో ప్రింట్ కావటం కానీ.. స్టిక్కర్ అంటించి కానీ ఉందా? లేదా? జీఎస్టీ శ్లాబు తగ్గిన నేపథ్యంలో కలిగే రూ.2 ప్రయోజనాన్ని పొందుతున్నారా? లేదా? అన్నది చెక్ చేసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంటుందన్నది మర్చిపోకూడదు.

ఇదొక్క వాటర్ బాటిల్ కు మాత్రమే కాదు.. ప్రతి విషయంలోనూ ఉండాలన్నది మర్చిపోకూడదు. మారిన పన్ను శ్లాబులకు తగ్గట్లుగా.. తమ వస్తువులకు సంబంధించిన ధరల్ని కంపెనీలు రెండు వార్తా పత్రికల్లో ప్రకటనల రూపంలో పబ్లిష్ చేయాలని ఉన్న నిబంధనను రద్దు చేశారు. అదే సమయంలో డీలర్లు.. రిటైలర్లు.. లీగల్ మెట్రాలజీ అథారిటీలకు మాత్రం ప్రైస్ లిస్టు పంపాలని జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించటం ద్వారా ధరల అప్డేట్ లో కాస్త ఆలస్యం జరిగే వీలుంది. అయితే..కొత్త ఎమ్మార్పీలు అందుబాటులోకి వచ్చాయా? లేదా? అన్నది మాత్రం చెక్ చేసుకోవాల్సిన బాధ్యత వినియోగదారుడి మీదే ఉంది. అప్పుడే జీఎస్టీ శ్లాబుల తగ్గింపు ప్రయోజనాల్ని పొందగలుగుతామన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఈ జాగ్రత్తను తూచా తప్పకుండా పాటిస్తే.. మీ విలువైన డబ్బు ఆదా అవుతుంది.