జీఎస్టీ.. పొగడ్తలు: వాత పెట్టిందెవరు? వెన్న పూసిందెవరు?
ఓకే ఇంతవరకు బాగానే ఉంది. కానీ, అసలు జీఎస్టీ గురించి చర్చ ఎప్పుడు వచ్చింది? అసలు జీఎస్టీ వాతలు పెట్టింది ఎవరు? ఇప్పుడు వెన్న పూసింది ఎవరు?
By: Garuda Media | 19 Sept 2025 5:00 AM ISTజీఎస్టీ తగ్గింపు విషయంపై దేశవ్యాప్తంగా భారీ ఎత్తున ప్రధానమంత్రి నరేంద్ర మోడీని.. అదేవిధంగా కేంద్రమంత్రి నిర్మల సీతారామన్ ను బిజెపి నాయకుల నుంచి ఎన్డీఏ కూటమి పక్షాల వరకు కూడా పెద్ద ఎత్తున ఆకాశానికి ఎత్తేస్తున్నారు. పొగడ్తల్లో ముంచేస్తున్నారు. ఇంకేముంది జిఎస్టి స్లాబులు తగ్గిపోయాయి.. కాబట్టి పేదలకు మేలు జరుగుతుంది. మధ్యతరగతి వర్గానికి మంచి జరుగుతుందని... ఇదంతా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుణ్యమే అని.. దీపావళి కానుకను ముందే అందించేసారని ఆయనకు బ్రహ్మరథం పట్టేస్తున్నారు.
ఓకే ఇంతవరకు బాగానే ఉంది. కానీ, అసలు జీఎస్టీ గురించి చర్చ ఎప్పుడు వచ్చింది? అసలు జీఎస్టీ వాతలు పెట్టింది ఎవరు? ఇప్పుడు వెన్న పూసింది ఎవరు? అనే విషయాలపై మాత్రం జాతీయ స్థాయి నుంచి లోకల్ వరకు మీడియా సంస్థల్లో చర్చ జరుగుతోంది. వాస్తవానికి జీఎస్టిని తీసుకువచ్చింది కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం. అయితే, ఆనాడు జిఎస్టిని 5, 12, 14% స్లాబుల వరకు మాత్రమే పరిమితం చేశారు. అంటే మూడు స్లాబులను మాత్రమే అప్పట్లో పేర్కొన్నారు. కానీ, 2014లో ప్రభుత్వం మారిన తరువాత... కేంద్రంలో నరేంద్ర మోడీ పగ్గాలు చేపట్టిన తర్వాత నీతి ఆయోగ్ ను ఏర్పాటు చేశారు.
ఆ నీతి ఆయోగ్ చెప్పిన సూచనల మేరకు జిఎస్టి లో మార్పులు తీసుకువచ్చారు. జిఎస్టి స్లాబులు మార్చారు. తద్వారా ప్రజలపై భారీ ఎత్తున భారం పడింది. యూపీఏ ప్రభుత్వం తీసుకువచ్చిన జీఎస్టీ నే తాము అమలు చేస్తున్నామని అప్పట్లో వాదించిన మోడీ సహా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌లు జీఎస్టీ లో స్లాబుల మార్పు విషయంపై మాత్రం ఇంతవరకు ఎప్పుడు స్పందించలేదు. అంటే 5, 12, 14 శాతాలతో పాటు 18, 24 శాతాలను కూడా జిఎస్టి లో చేర్చింది అక్షరాల నరేంద్ర మోడీ ప్రభుత్వమే.
అంతేకాదు, 18, 24 శాతాల్లో ఎక్కువ సరుకులను, ఎక్కువ వినియోగించే వస్తువులను చేర్చారు అన్నది కూడా వాస్తవం. ఇలా మొత్తంగా 10 సంవత్సరాల పాటు ప్రజల నుంచి జిఎస్టి రూపంలో పన్నులు వసూలు చేశారు. ఈ ఒక్క ఆరు మాసాల కాలంలో అంటే ఈ ఏడాది ఆర్థిక సంవత్సరంలో గడిచిన ఆరు మాసాల కాలంలోనే 22 లక్షల కోట్లు ఆదాయం వచ్చిందని తాజాగా నిర్మలా సీతారామన్ విశాఖలో పేర్కొన్న విషయం వాస్తవం. అంటే ఎన్నాళ్ళ బట్టి ప్రజలను జిఎస్టి రూపంలో పిండేసి.. ఇప్పుడు వెన్న పూసినట్టుగా కేవలం 5, 12, 18, శాతాలు మాత్రమే పరిమితం చేస్తున్నామని చెప్పడం గమనార్హం.
మరి ఇది ఎంతవరకు సమంజసం అన్నది ప్రశ్న. ఇదే సమయంలో జీఎస్టీని వివిధ అంశాలకు కూడా పరిగణించాలని వివిధ రాష్ట్రాలు కోరుతున్నాయి. కానీ.. ఇప్పటివరకు నరేంద్ర మోడీ ప్రభుత్వం స్పందించలేదు. ఉదాహరణకు పెట్రోల్, డీజిల్ ను జిఎస్టి లో చేర్చాలని, తద్వారా పన్ను రేటు తగ్గి ప్రజలకు మేలు జరుగుతుందని తమిళనాడు, ఏపీ సహా అనేక రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం దగ్గర విజ్ఞప్తులు చేశాయి. ఇప్పటివరకు పెట్రోల్ ని జిఎస్టి పరిధిలోకి తీసుకురాలేదు. ఇక డీజిల్ సంగతి సరే సరి.
శవ పేటికలపై పన్ను!
వీటితోపాటుగా శవ పేటికలకు జీఎస్టీ విధానం అమలు జరుగుతుండడం చాలా మందికి తెలియని విషయం. దీనిపై కర్ణాటక ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. శవాలను దహనం చేసేటటువంటి సమయంలో చెల్లించే సొమ్ముపై జిఎస్టి తీసేయాలని అభ్యర్థించింది. అంతిమయాత్రనైనా ఘనంగా చేసుకునేలాగా కుటుంబ సభ్యులకి అవకాశం కల్పించాలంటూ సీఎం సిద్ధరామయ్యే స్వయంగా కేంద్రానికి లేఖ రాశారు. దీనిపైన ఎటువంటి చర్చ లేదు. కానీ తామే పెంచి.. తామే తగ్గించి..(రాజకీయ వ్యూహంలో భాగంగా) అంటే తామే వాతపెట్టి తామే వెన్నపూసి నట్టుగా వ్యవహరిస్తున్నప్పటికీ కూడా జీఎస్టీ విషయంలో కేంద్రంపై పొగడ్తలు ప్రశంసలు కురిపించటం నిజంగా ఏమని చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కాని ఒక రాజకీయ వ్యవస్థ భారత దేశంలో నెలకొంది అన్నది విశ్లేషకులు చెబుతున్న మాట.
