బైకులకు జీఎస్టీ రిలీఫ్.. డుగ్ డుగ్ బైకులకు మాత్రం వాతలే
జీఎస్టీ సంస్కరణలు పెను మార్పులు తీసుకురానున్నాయి. కొన్ని వస్తువులు.. వస్తుసేవలు చౌక కానున్నాయి.
By: Garuda Media | 29 Aug 2025 9:56 AM ISTజీఎస్టీ సంస్కరణలు పెను మార్పులు తీసుకురానున్నాయి. కొన్ని వస్తువులు.. వస్తుసేవలు చౌక కానున్నాయి. ఇప్పుడున్న శ్లాబుల స్థానే.. రెండు శ్లాబులకు తగ్గించాలన్న కేంద్రం కసరత్తు ఒక కొలిక్కి రానుంది. త్వరలో దీనికి సంబంధించిన వివరాలు వెల్లడికానున్నాయి. ఇదిలా ఉండగా.. ఈ సంస్కరణల నేపథ్యంలో విలాసవంతమైన వస్తువులపై ఒక రేంజ్ లో వాతలు వేసేలా ప్లాన్ చేస్తున్నట్లు చెబుతున్నారు. ఇందులో ప్రీమియం మోటారు బైకులు కూడా ఉంటాయని చెబుతున్నారు. అదే సమయంలో అత్యధికులు వినియోగించే సాధారణ మోటార్ బైకుల ధరలు మాత్రం తగ్గనున్నాయి.
ప్రస్తుతం ఉన్న శ్లాబుల ప్రకారం అన్ని మోటారు సైకిళ్లకు 28 శాతం జీఎస్టీను విధిస్తున్నారు. అదే సమయంలో 350 సీసీ మోటార్ సైకిళ్లకు మాత్రం 28 శాతం జీఎస్టీకి అదనంగా మరో మూడు శాతం సెస్సును విధిస్తున్న సంగతి తెలిసిందే. అంటే.. ఈ బైకులకు మొత్తంగా 31 శాతం జీఎస్టీ అమలవుతుంది. అయితే.. కొత్తగా తీసుకొద్దామనుకున్న జీఎస్టీ శ్లాబుల్లో రెండు ట్యాక్స్ శ్లాబులు మాత్రమే ఉండనున్నాయి. త్వరలో జరిగే జీఎస్టీ కౌన్సిల్ లో తుది నిర్ణయం తీసుకోనున్న సంగతి తెలిసిందే.
దీంతో చాలావరకు వస్తువులు అయితే 5 శాతం లేదంటే 18 శాతం ట్యాక్స్ పరిధిలో ఉంటాయి. కేవలం లగ్జరీ.. హానికార వస్తువులపై మాత్రం 40 శాతం పన్ను బాదుడు ఉంటుంది. కొత్తగా వచ్చే శ్లాబుల వేళ.. రెగ్యులర్ గా వినియోగించే మోటార్ బైకులు 28 శాతం నుంచి 18 శాతం పన్నుతో ధరలు మరింత తగ్గనున్నాయి. దీని కారణంగా ఎక్కువ మంది లాభపడనున్నారు. అదే సమయంలో ప్రీమియం మోటారు బైకులు (ఎన్ ఫీల్డ్, కేటీఎం, ట్రయాంఫ్, బజాజ్, ఏప్రిలియా, హార్లే డేవిడ్ సన్)కు మాత్రం జీఎస్టీ మోత మోగుతుందని చెబుతున్నారు. ఈ విలాసవంతమైన బైకులు 350 సీసీ కంటే ఎక్కువ సామర్థ్యంలో ఉంటాయని చెబుతున్నారు.
ఒక అంచనా ప్రకారం ప్రస్తుతం రూ.3.80 లక్షల వరకు ఉన్న ఈ తరహా విలాసవంతమైన మోటారు బైకులు జీఎస్టీ రేటు సవరణ తర్వాత రూ.4.13 లక్షలు కానుంది. అంటే.. కొత్త జీఎస్టీ శ్లాబుల ప్రకటన అనంతరం విలాసవంతమైన బైకుల ధరలు రూ.30-40 వేల మధ్యలో పెరగనున్నట్లు చెబుతున్నారు అదే సమయంలో 350 సీసీ కంటే తక్కువ ఉండే బైకు ధరల్లో 10 శాతం మేర పన్ను తగ్గటంతో లక్ష రూపాయిల బైకు మీద రూ.10 వేల వరకు పన్ను రిలీఫ్ వస్తుందని చెప్పక తప్పదు.
