Begin typing your search above and press return to search.

హోటల్ రూం రూ.7500 కంటే తక్కువైతే 5శాతమే జీఎస్టీ

జీఎస్టీ కొత్త శ్లాబులు పలు అంశాలు వినియోగదారులకు లాభం కలిగించేలా.. ఇప్పటికే అమలవుతున్న భారాల నుంచి తగ్గించేలా ఉండటం ఆసక్తికరంగా మారింది.

By:  Garuda Media   |   5 Sept 2025 9:20 AM IST
హోటల్ రూం రూ.7500 కంటే తక్కువైతే 5శాతమే జీఎస్టీ
X

జీఎస్టీ కొత్త శ్లాబులు పలు అంశాలు వినియోగదారులకు లాభం కలిగించేలా.. ఇప్పటికే అమలవుతున్న భారాల నుంచి తగ్గించేలా ఉండటం ఆసక్తికరంగా మారింది. ఉదాహరణకు హోటల్ రూంల విషయానికే వస్తే.. ఇప్పటివరకు 12 శాతం జీఎస్టీ అమల్లో ఉండేది. అది కాస్తా తాజాగా 5 శాతానికి తగ్గించటంతో.. భారీ ఉపశమనంగా చెప్పాలి. అయితే.. దీనికో పరిమితిని విధించారు. అదేమంటే హోటల్ రూం అద్దె రోజుకు రూ.7500 దాటకూడదు. ఒకవేళ దాటితే ఎప్పటిలానే 12 శాతం జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. అదే అంతకంటే తక్కువ అయితే మాత్రం 5 శాతానికే పరిమితమవుతుంది. ఉదాహరణకు రోజుకు రూం అద్దె రూ.5వేలు అయితే.. ఇప్పటివరకు రూ.5600 కట్టాల్సి వచ్చేది. తాజాగా మారిన జీఎస్టీతో ఈ నెల 22 తర్వాత నుంచి రూ.5250 కడితే సరిపోతుంది. అదే రోజు అద్దె రూ.7500 దాటితే పాత పద్దతిలో మాదిరే 12 శాతం జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. తాజా తగ్గింపు పర్యాటకానికి ఊతం ఇచ్చేలా ఉంటుందని చెప్పక తప్పదు.

ఈ నెల 22 తర్వాత నుంచి విమాన టికెట్ల విషయానికి వస్తే ఎకానమి టికెట్ల ధరలు ఎప్పటిలానే ఉంటుంది. అయితే.. బిజినెస్, ఫస్ట్ క్లాస్ టికెట్ల మీద మాత్రం జీఎస్టీ ఇప్పటి వరకు అమలైన 12 శాతానికి మించి 18 శాతం వడ్డిస్తారు. దీంతో విమానంలో సౌకర్యవంతంగా ప్రయాణించాలంటే మాత్రం భారం పెరగనుంది. సినిమాలకు వెళ్లిన సందర్భంగా ఇంటర్వెల్ లో తప్పనిసరిగా కొనుగోలు చేసే పాప్ కార్న్ విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆసక్తికరంగా మారింది. ఇప్పటివరకు పాప్ కార్న్ మీద 12 శాతం జీఎస్టీ వసూలు చేశారు. తాజాగా మారిన దాని ప్రకారం 5 శాతం శ్లాబులో ఉంచటంతో పాప్ కార్న్ ధర తగ్గనుంది. అయితే.. కారమెల్ ఫ్లేవర్ తో ఉండే పాప్ కార్న్ కు మాత్రం 18 శాతం పన్ను వసూలు చేస్తారు. మిగిలిన వాటి ధర మీద 5 శాతం జీఎస్టీ అమలు కాగా.. కారమెల్ పాప్ కార్న్ మీద మాత్రం 18 శాతం వసూలు చేయటం గమనార్హం.

జిమ్ లు.. ఫిట్ నెస్.. యోగా సెంటర్స్.. సెలూన్లు.. బార్బర్లు తదితరసేవలపై ఇప్పటివరకు ఉన్న 18 శాతం జీఎస్టీ స్థానే 5 శాతానికి తగ్గించటంతో బోలెడంత ప్రయోజనం కలుగనుంది. అయితే.. నిత్యం విరివిగా వాడే స్విగ్గీ.. జొమాటో లాంటి ఫుడ్ డెలివరీలతో పాటు స్విగ్గీఇన్ స్టా.. బ్లింక్ ఇట్.. లాంటి వాటి డెలివరీ సేవల మీద 18 శాతం జీఎస్టీ విధించారు. అయితే..ఈ భారం కేవలం డెలివరీ ఛార్జీలపైనే ఉంటుంది. మారిన జీఎస్టీ నేపథ్యంలో ఒక్కో డెలివరీ మీద కనిష్ఠంగా రూపాయి నుంచి గరిష్ఠంగా మూడు రూపాయిల వరకు అదనంగా వసూలు చేయనున్నారు.

రాష్ట్రపతి కోసం కేంద్రం కొనుగోలు చేసే బీఎండబ్ల్యూ 7సిరీస్ కారుకు జీఎస్టీ మినహాయించారు. ఈ కారు విలువ రూ.3.66కోట్లు. అత్యాధునిక భద్రత సదుపాయాలు ఉన్న ఈ కారును రాష్ట్రపతి భద్రత కోసం కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దీనిపై వసూలు చేసే జీఎస్టీని మినహాయించారు. ప్రస్తుతం రాష్ట్రపతి మెర్సిడెస్ బెంజ్ ఎస్600 ఫుల్ మన్ లిమోజిన్ వాడుతున్నారు.