జీఎస్టీ తగ్గినా.. ఆ వస్తువుల ధరలు తగ్గకపోవటానికి కారణం ఇదేనట
వీటిని ఉత్పత్తి చేసే ప్రముఖ బ్రాండ్లకు చెందిన వస్తువుల ధరలు ఇంకా పాతవే ఉన్నాయి. వీటిల్లో జీఎస్టీ తగ్గినా.. ఇంకా అందుబాటులోకి రాకపోవటానికి కారణం ఏమిటి? అన్నది ప్రశ్నగా మారింది.
By: Garuda Media | 25 Sept 2025 10:00 AM ISTఉప్పు కావొచ్చు. ప్రతి వంటింట్లో ఉండే టీ.. కాఫీ పొడులు కావొచ్చు. వాషింగ్ పౌండర్లు.. సబ్బులు.. షాంపోలు.. ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడన్ని వస్తువులకు సంబంధించిన ధరలు జీఎస్టీ తగ్గిన తర్వాత కూడా ఇంకా తగ్గలేదెందుకు? జీఎస్టీ ప్రయోజనం సామాన్యుడికి చేరేదెప్పుడు? ప్రభుత్వం కరుణించినా.. తోపు కంపెనీలుగా చెప్పే ప్రముఖ ఎఫ్ఎంసీజీ (ఫాస్ట్ మూవింగ్ కన్ఫ్యూజర్ గూడ్స్) మరింత సరళంగా.. సింఫుల్ గా తెలుగులో చెప్పాలంటే వేగంగా అమ్ముడయ్యే వస్తువులు.
ఈ విభాగంలో రోజువారీ వాడుకలో ఉండే పలు వస్తువులు. అందులో నిద్ర లేచినంతనే వాడే పేస్టు.. బ్రష్.. కాఫీ.. టీ పొడులు.. సబ్బులు.. షాంపోలు.. ఆహార పదార్థాలు.. బలవర్థక పానీయాలు.. తలకురాసే నూనెలు.. ఇలా చెప్పుకుంటే బోలెడన్ని వస్తువులు ఉంటాయి. వీటిని ఉత్పత్తి చేసే ప్రముఖ బ్రాండ్లకు చెందిన వస్తువుల ధరలు ఇంకా పాతవే ఉన్నాయి. వీటిల్లో జీఎస్టీ తగ్గినా.. ఇంకా అందుబాటులోకి రాకపోవటానికి కారణం ఏమిటి? అన్నది ప్రశ్నగా మారింది.
పెద్ద పాకెట్ల నుంచి చిన్న పాకెట్లు.. అంటే రూ.10 నుంచి రూ.2 వరకు దొరికే వస్తువులు బోలెడన్ని. జీఎస్టీ సంస్కరణల నేపథ్యంలో కనిష్ఠంగా 25 పైసల నుంచి గరిష్టంగా 55 పైసల వరకు తగ్గించి అమ్మాల్సి వస్తోంది. ఇప్పటికే రూపాయి కంటే తక్కువ నాణెలు చెలామణీలో లేకుండా పోయి చాలాకాలమే అయ్యింది. అలాంటప్పుడు ఈ తగ్గిన ధరలకు సంబంధించిన చిల్లర మాటేమిటి? అన్నది ప్రశ్న. ఇదే కంపెనీలను సైతం వేధిస్తున్న సమస్య.
దీనికి తోడు ప్రభుత్వ ఆదేశాలు ఎందుకు అమలు కాలేదన్నది మరో ప్రశ్న. దీనికి కారణం ఏమిటన్న విషయంలోకి వెళితే.. సాధారణంగా ఎఫ్ఎంసీజీ కంపెనీలు రెండునెలల వినియోగానికి సరిపడా వస్తువులను మార్కెట్ లోకి విడుదల చేస్తుంటాయి. జీఎస్టీ రేట్ల తగ్గింపు సెప్టెంబరు మొదటి వారంలో కానీ కేంద్రం క్లారిటీ ఇవ్వలేదు. దీంతో.. నవంబరు వరకు మార్కెట్ లో విడుదల చేసే వస్తువుల ఎమ్మార్పీ ధరలను కంపెనీలు ఇప్పటికే ప్రింట్ చేశాయి.
ఇప్పుడు జీఎస్టీ తగ్గింపునకు అనుగుణంగా రేట్లు తగ్గించినా.. చిల్లర సమస్య ఎదురవుతోందని.. ఈ కారణంగా ఆయా పాకెట్లలో వస్తువుల పరిమాణం పెంచి.. డిసెంబరు నుంచి పాత ఎమ్మార్పీ ధరలకే మార్కెట్ లో విడుదల చేయాలన్న ఆలోచనలో కంపెనీలు ఉన్నట్లుగా చెబుతున్నారు. పాకెట్లలో వస్తు పరిమాణం (గ్రాములు) పెంచటం ద్వారా నెలన్నర నుంచి రెండు నెలల్లోనే ఈ సమస్య పరిష్కారమవుతుందని చెబుతున్నారు. అంటే.. బ్రాండెడ్ వస్తువులకు సంబంధించిన జీఎస్టీ ప్రయోజనాలు పొందేందుకు దగ్గర దగ్గర మరో రెండు నెలల వరకు అవుతుందని చెబుతున్నారు.
