Begin typing your search above and press return to search.

జీఎస్టీ 2.0 : వినియోగదారులకు ఇంకా అందని ఫలాలు

కేంద్ర ప్రభుత్వం దసరా పండుగ సందర్భంగా ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన జీఎస్టీ 2.0 సంస్కరణలు వినియోగదారులకు పెద్దగా ఊరట ఇవ్వలేదని తాజా సర్వే ఫలితాలు తేటతెల్లం చేశాయి

By:  A.N.Kumar   |   7 Oct 2025 3:00 AM IST
జీఎస్టీ 2.0 : వినియోగదారులకు ఇంకా అందని ఫలాలు
X

కేంద్ర ప్రభుత్వం దసరా పండుగ సందర్భంగా ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన జీఎస్టీ 2.0 సంస్కరణలు వినియోగదారులకు పెద్దగా ఊరట ఇవ్వలేదని తాజా సర్వే ఫలితాలు తేటతెల్లం చేశాయి. ముఖ్యంగా నాలుగు జీఎస్టీ స్లాబ్‌లను రెండుకు తగ్గించడం, అత్యధికంగా ఉన్న 28% స్లాబ్‌ను 18% లో , 12% స్లాబ్‌ను 5% లో విలీనం చేయడం వంటి కీలక మార్పులు చేసినప్పటికీ, వస్తువుల ధరలు తగ్గలేదని అత్యధిక మంది వినియోగదారులు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ ప్రకటనల ప్రకారం.. ఈ మార్పుల వల్ల వస్తువుల ధరలు తగ్గి, తద్వారా వినియోగం పెరిగి, ఆర్థిక వ్యవస్థకు ఊపునిస్తుందని భావించారు. అయితే లోకల్ సర్కిల్స్ అనే సంస్థ దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వే ఈ అంచనాలకు భిన్నమైన చిత్రాన్ని ఆవిష్కరించింది.

* సర్వేలో కీలక విషయాలు: మెజారిటీకి లాభం దక్కలేదు

లోకల్ సర్కిల్స్ దేశవ్యాప్తంగా 332 జిల్లాల్లో దాదాపు 27 వేల మంది వినియోగదారుల నుంచి 78 వేల సమాధానాలు సేకరించి ఈ నివేదికను రూపొందించింది. సర్వేలో పాల్గొన్న ఎక్కువ మంది తాము జీఎస్టీ 2.0 ద్వారా ఎలాంటి ప్రత్యక్ష లాభం పొందలేదని స్పష్టం చేశారు.

* సర్వే వివరాల ప్రకారం..

66% మంది పురుషులు, 34% మంది మహిళలు పాల్గొన్నారు.

టైర్-1 నగరాల నుంచి 43%, టైర్-2 నుంచి 24%, టైర్-3 నుండి 5 వరకు 33% మంది పాల్గొన్నారు.

ఆటోమొబైల్ రంగంలో మాత్రమే వినియోగదారులు కొంత లాభం పొందినట్టు తెలిపారు.

* వస్తువుల వారీగా ఫలితాలు:

ప్యాక్ చేసిన ఆహారం, మందులు: దాదాపు 47% మంది జీఎస్టీ తగ్గింపు కనిపించలేదని, కేవలం 10% మంది మాత్రమే లాభం పొందినట్టు తెలిపారు.

ఎలక్ట్రానిక్స్, వైట్ గూడ్స్: దాదాపు 34% మంది పూర్తి లాభం పొందినట్లు, 33% మంది పాక్షిక లాభం పొందినట్టు తెలిపారు.

వాహనాలు: 76% మంది జీఎస్టీ తగ్గింపు వల్ల లాభం పొందినట్టు చెప్పారు.

ప్యాక్ చేసిన ఆహారం, మందులు వంటి నిత్యావసరాలపై జీఎస్టీ తగ్గింపు కనిపించలేదని దాదాపు సగం మంది వినియోగదారులు చెప్పడం ఆందోళన కలిగించే అంశం.

అమలులో లోపం: వ్యాపారుల సహకారం కరువు!

సర్వే ఫలితాల నుంచి వెల్లడైన కీలక అంశం ఏమిటంటే.. జీఎస్టీ 2.0 అమలు అయినప్పటికీ, ఆన్‌లైన్ , ఆఫ్‌లైన్ రిటైలర్లు చాలా మంది ధరలను తగ్గించలేదు. చాలా మంది వ్యాపారులు పాత స్టాక్ రేట్లనే కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంత పెద్ద సంస్కరణ విజయవంతంగా అమలు కావడానికి వ్యాపార వర్గాల నుంచి సరైన సహకారం అందడం లేదని, క్షేత్రస్థాయిలో వ్యాపారులు సరైన మార్గదర్శకాన్ని అనుసరించకపోవడమే ప్రధాన కారణమని సర్వే స్పష్టం చేసింది.

ఈ కారణంగా ప్రభుత్వ సూచనల ప్రకారం వాణిజ్య విభాగానికి ఈ సంస్కరణ లాభదాయకమని భావించినప్పటికీ, దాని ప్రయోజనం మాత్రం అంతిమంగా వినియోగదారులకు చేరడం లేదు. జీఎస్టీ 2.0 విధానంలో లాభం కనిపించకపోవడం వినియోగదారుల ఆశలను నెమ్మదిగా కరిగించివేస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. జీఎస్టీ కౌన్సిల్ , ప్రభుత్వ యంత్రాంగం వెంటనే దీనిపై దృష్టి సారించి, రిటైలర్లు ధరల తగ్గింపును అమలు చేసేలా పర్యవేక్షణ, అవసరమైతే కఠిన చర్యలు తీసుకోవాలని వినియోగదారుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.