Begin typing your search above and press return to search.

క్రెడిట్ మోడీది...డెబిట్ రాష్ట్రాలదా ?

బీజేపీ ఏ విషయం అయినా తనకు అనుకూలంగా ఉంది అంటే దానిని పీక్స్ లో ప్రచారం చేస్తుంది అన్నది తెలిసిందే. మరీ ముఖ్యంగా మోడీ షాల జమానాలో తమకు కలసి వచ్చే విషయాలలో ఏ మాత్రం వెనక్కి తగ్గింది లేదు.

By:  Satya P   |   23 Sept 2025 9:21 AM IST
క్రెడిట్ మోడీది...డెబిట్ రాష్ట్రాలదా  ?
X

ఈ క్రెడిట్ డెబిట్ అని బ్యాంక్ లెక్కలేంటి అనుకోవాల్సిన అవసరం లేదు. రాజకీయాలు కూడా గణిత శాస్త్రం కన్నా కష్టంగా క్లిష్టంగా ఉండే సబ్జెక్ట్. అందులో ఒక్క మేథమెటిక్స్ ఏమిటి బ్యాంక్ లెక్కలూ ఖాతాలు వ్యయాలు జమలూ ఖర్చులూ అన్నీ వచ్చేస్తాయి. ఒక్క మాటలో చెప్పాలీ అంటే రాజకీయం అంటేనే కూడికలూ తీసివేతలే. అందుకే ఇండియాలో రాజకీయ పార్టీల మధ్య ఇపుడు సిద్ధాంతాల కంటే ఇలాంటి వాటి మీదనే రాద్ధాంతాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి.

ప్రచారం పీక్స్ లో :

బీజేపీ ఏ విషయం అయినా తనకు అనుకూలంగా ఉంది అంటే దానిని పీక్స్ లో ప్రచారం చేస్తుంది అన్నది తెలిసిందే. మరీ ముఖ్యంగా మోడీ షాల జమానాలో తమకు కలసి వచ్చే విషయాలలో ఏ మాత్రం వెనక్కి తగ్గింది లేదు. మెయిన్ స్ట్రీమ్ మీడియాతో పాటు సోషల్ మీడియాను సైతం ఎడా పెడా వాడేసుకుంటుందని ఆ పార్టీ రాజకీయ ప్రత్యర్ధులకు కూడా తెలుసు. ప్రస్తుతం రెండవ తరం జీఎస్టీ సంస్కరణలను ఎంతో గొప్పగా బీజేపీ చెప్పుకుని ప్రచారానికి తెర లేపింది. జీఎస్టీ 2.ఓ అంటూ జనంలోకి వెళ్తోంది. ఏకంగా నెల రోజుల పాటు ఈ ప్రచారం ఉధృతంగా సాగిస్తోంది. ఆ విధంగా భారీ యాక్షన్ ప్లాన్ ని రూపొందించి ముందుకు సాగుతోంది. ఒక పద్ధతి ప్రకారం జనాల్లోకి తామే పన్నులు తగ్గించిన ఆపన్నులమని చెప్పుకుంటోంది.

మండిపోతున్న విపక్షాలు :

బీజేపీ ఇంత పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటూ జీఎస్టీ క్రెడిట్ ని తమదే అని క్లెయిం చేసుకుంటూంటే ఇండియా కూటమి సహా విపక్షాలు అన్నీ మండిపోతున్నాయి. కాంగ్రెస్ కీలక నేత జై రాం రమేష్ అయితే మోడీ మీద విమర్శల దాడి చేశారు. 2008 నుంచి 2014 దాకా మోడీ గుజరాత్ రాష్ట్ర సీఎం గా ఉంటూ జీఎస్టీని తీవ్రంగా వ్యతిరేకించారు అని ఫ్లాష్ బ్యాక్ ని గుర్తు చేశారు. ఆనాడు దేశమంతా అందరు ముఖ్యమంత్రులూ జీఎస్టీకి ఓకే చెబితే వద్దు అన్న ఏకైన సీఎం మోడీ అని దుయ్యబట్టారు. అలాంటి మోడీ ప్రధాని అయ్యాక యూటర్న్ తీసుకున్నారు అని అన్నారు. ఇపుడు జీఎస్టీ పన్నుల తగ్గింపు అని చాటింపు వేసుకుంటున్నారు అని రాష్ట్రాలు ఆర్ధికంగా నష్టపోతూంటే వాటికి పరిహారం చెల్లించరా అని నిలదీశారు.

దీదీ అక్క ఫైర్ :

మరో వైపు చూస్తే బెంగాళ్ కాళి సీఎం అయిన మమతా బెనర్జీ బీజేపీ మీద మోడీ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. జీఎస్టీ పన్నుల తగ్గింపు అంతా తమ క్రెడిట్ అని కేంద్రం గొప్పలు చెప్పుకుంటూ పోతోంది అని ఫైర్ అయ్యారు. అయితే జీఎస్టీ పన్నుల తగ్గింపు వల్ల వచ్చిన ఆర్థిక భారం మాత్రం రాష్ట్రాలది అవుతోంది అని ఆమె అంటున్నారు. ఒక్కో రాష్ట్రం వేల కోట్ల ఆర్ధిక భారాలను మోస్తోందని ఆమె అన్నారు. ఇలా రాష్ట్రాలకు డెబిట్ మోడీకి కేంద్రానికి క్రెడిట్ నా ఇదెలా కుదురుతుంది అమె నిలదీస్తున్నారు. నిజానికి అయితే పేదలు మధ్యతరగి ప్రజల మీద అదనపు జీఎస్టీ భారాన్ని తగ్గించాలని మొదటిగా కోరింది తానేనని మమతా బెనర్జీ చెప్పారు. ఇపుడు చూస్తే తామే పెదలకు మేలు చేశామని బీజేపీ పెద్దలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక జీఎస్టీ తగ్గింపు వల్ల దేశంలోని అన్ని రాష్ట్రాలూ ఆ మేరకు జరిగిన నష్టానికి ఆదాయం లోటుని భర్తి చేసుకోవాల్సి ఉందని అన్నారు. దాని కోసం కొత్త దారులు వెతుక్కోవాలని ఆమె చెప్పారు. ఒక్క పశ్చిమ బెంగాల్ కే జీఎస్టీ తగ్గింపు వల్ల ఏకంగా ఇరవై వేల కోట్ల రూపాయల ఆదాయం గండిపడింది అని ఆమె చెప్పుకొచ్చారు.