గ్రో అధినేత రైతుబిడ్డ.. ఐపీవోతో రూ.లక్షకోట్ల విలువ దాటేసింది
ఇటీవల కాలంలో ఐపీవోకు వచ్చి మార్కెట్ అటెన్షన్ తనవైపు తిప్పుకునేలా చేసిన షేర్లు కొన్ని ఉన్నాయి.
By: Garuda Media | 18 Nov 2025 12:06 PM ISTఇటీవల కాలంలో ఐపీవోకు వచ్చి మార్కెట్ అటెన్షన్ తనవైపు తిప్పుకునేలా చేసిన షేర్లు కొన్ని ఉన్నాయి. అందులోనూ స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయి.. దూసుకెళ్లటం.. అందులో మదుపు చేసిన మదుపర్లలో ఆనందాన్ని నింపటం అందరికి సాధ్యం కాదు. ఈ విషయంలో ఆన్ లైన్ స్టాక్ బ్రోకింగ్ కంపెనీ గ్రో మాతృసంస్థ బిలియన్ బ్రెయిన్స్ గ్యారేజ్ వెంచర్స్ షేరు మార్కెట్ లో దూసుకెళుతున్న వేళ.. అరుదైన రికార్డును తాజాగా సొంతం చేసుకుంది.
గ్రో లిస్టింగ్ తో స్టాక్ మార్కెట్ లో మరో బిలియనీర్ గా అవతరించారు. అంతేకాదు గ్రో మార్కెట్ విలువ రూ.లక్ష కోట్ల మార్కును దాటేసింది. నేషనల్ స్టాక్ ఎక్జ్సేంజ్ లో గ్రో షేరు 20 శాతం అ
ప్పర్ సర్క్యూట్ తో రూ.178.23 వద్ద ముగిసింది. దీని ప్రకారం ఆ సంస్థ మార్కెట్ విలువ రూ.1.10 లక్షల కోట్లకు చేరుకుంది. ఇదెంత ప్రత్యేకమన్న విషయాన్ని చిన్న ఉదాహరణతో అర్థం చేసుకోవచ్చు. స్టాక్ మార్కెట్ లో నమోదైన కంపెనీలు 5వేలకు పైనే ఉంటాయి. అందులో 100కు పైగా కంపెనీలు మాత్రమే ఈ స్థాయి మార్కెట్ విలువను కలిగి ఉంటాయి. గ్రోకు పోటీగా ఉండే పలు స్టాక్ బ్రోకింగ్ కంపెనీల మార్కెట్ విలువ మొత్తం కలిపితే రూ.70వేల కోట్లకు దగ్గర్లో ఉంటే.. ఒక్క గ్రో మాత్రం అందుకు భిన్నంగా ఏకంగా రూ.1.10 లక్షల కోట్ల మార్కును టచ్ చేయటం విశేషం.
తాజా పరిణామంతో సదరు సంస్థ ఎండీగా వ్యవహరిస్తున్న లలిత్ కేశ్రే సంపద ఏకంగా రూ.9960 కోట్లకు చేరింది. దీంతో లలిత్ సరికొత్త బిలియనీర్ గా అవతరించారు. ఇక్కడే ఆయన బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే అసలుసిసలు రియల్ హీరోగా కనిపిస్తారు. ఎందుకంటే..మధ్యప్రదేశ్ లోని మారుమూల గ్రామం లెపా. రైతు ఇంట పుట్టిన లలిత్ చదువు కోసం తాతయ్య వద్దకు వెళ్లాడు. అక్కడ ఇంగ్లిష్ మీడియం స్కూళ్లు లేవు. స్థానిక భాషల్లోనే చదివినా.. జేఈఈలో మంచి ర్యాంకు సాధించి ఐఐటీ బాంబేలో చేరాడు.బ్యాచిలర్స్.. మాస్టర్స్ అక్కడే పూర్తి చేశాడు.
ఫ్లిప్ కార్ట్ మాజీ ఉద్యోగులైన హర్ష జైన్.. ఇసాన్ బన్సల్.. నీరజ్ సింగ్ లతో కలిసి 2016లో ఆన్ లైన్ స్టాక్ బ్రోకింగ్ ప్లాట్ ఫామ్ ‘‘గ్రో’’ ను ఏర్పాటు చేశారు. అదే అతని జీవితంలో కీలక మలుపునకు కారణమైంది. అతడి ప్రయత్నానికి పలువురు ఇన్వెస్టర్లు దన్నుగా నిలవటంతో 2025 మార్చి 31 నాటికి రూ.4056 కోట్ల ఆదాయంపై రూ.1824 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ఇదే సమయంలో నవంబరు 4 నుంచి 7 వరకు ఐపీవోకు వచ్చారు. రూ.100 ధర చొప్పున షేర్లను గ్రో కంపెనీ మదుపర్లకు కేటాయించింది. ఈ షేర్లు 12న లిస్ట్ అయ్యాయి. 17వ తేదీ నాటికి రూ.178.23కు చేరుకున్నాయి.
నాలుగు ట్రేడింగ్ రోజుల్లోనే ఈ షేరు సొందిన వారికి 78 శాతం ప్రతిఫలం సొంతమైంది. అదే సమయంలో సంస్థ మార్కెట్ విలువ రూ.లక్ష కోట్లను అధిగమించింది. ఇంతటి అరుదైన విజయాన్ని సొంతం చేసుకున్న వ్యక్తి నేపథ్యాన్ని.. అతడు పడిన శ్రమ.. నిజాయితీతో అతను సొంతం చేసుకున్న విజయాన్ని చూస్తే.. అసలుసిసలు రియల్ హీరోగా చెప్పక తప్పదు. రానున్న రోజుల్లో అతను మరిన్ని విజయాల్ని సొంతం చేసుకుంటారని ఆశిద్దాం.
