Begin typing your search above and press return to search.

ఇప్పుడు సరైన స్టెప్ తీసుకున్న మస్క్.. వారికి బిగ్ షాక్!

ఏఐ చాట్ బాట్ గ్రోక్ ను ఉపయోగించి మహిళల లైంగిక చిత్రాలను అనధికారికంగా సృష్టిస్తున్నందుకు ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యవహారంపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే.

By:  Raja Ch   |   11 Jan 2026 9:00 PM IST
ఇప్పుడు సరైన స్టెప్ తీసుకున్న మస్క్.. వారికి బిగ్ షాక్!
X

ఏఐ చాట్ బాట్ గ్రోక్ ను ఉపయోగించి మహిళల లైంగిక చిత్రాలను అనధికారికంగా సృష్టిస్తున్నందుకు ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యవహారంపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ఎలాన్ మస్క్ సోషల్ మీడియా దిగ్గజం "ఎక్స్".. ఈ ఇమేజ్ ఎడిటింగ్ ఫీచర్ ను పరిమితం చేసింది. ఇందులో భాగంగా.. చెల్లింపుదారులకు మాత్రం దాన్ని అందుబాటులో ఉంచుతూ నిర్ణయం తీసుకుంది. దీనిపై విమర్శలు వచ్చాయి! ఈ నేపథ్యంలో మస్క్ చర్యలకు ఉపక్రమించారు.

అవును... గ్రోక్ లో ఇమేజ్ ఎడిట్ ఫీచర్ ను ఉపయోగించి కొంతమంది వినియోగదారులు అసభ్య, అశ్లీల కంటెంట్ ను సృష్టిస్తున్నారని.. ఇందులో భాగంగా మహిళలు బికినీలు ధరించినట్లు ఫోటోలు క్రియేట్ చేయడంతో పాటు.. ఆ పైత్యం పిల్లలపైనా ప్రయోగిస్తున్నారంటూ ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ఆ కంటెంట్ ను తొలగించాలని కేంద్రం ఆదేశాలు ఇచ్చింది. దీంతో 'ఎక్స్' చర్యలకు ఉపక్రమించింది.

ఇందులో భాగంగా... 3,500 పోస్టులను బ్లాక్ చేయడంతో పాటు 600 అకౌంట్స్ ను డిలీట్ చేసేసింది. ఈ సందర్భంగా స్పందించిన కేంద్ర ప్రభుత్వ వర్గాలు.. ఈ విషయాన్ని వెల్లడిస్తూ.. తమ వేదికపై అసభ్యతకు తావివ్వబోమని.. ప్రభుత్వ నిబంధనలను పాటిస్తామని హామీ ఇచ్చిందని.. ఇదే సమయంలో, భవిష్యత్తులో భారతీయ నిబంధనలకు అనుగుణంగా ఉండేలా చూసేందుకు కంపెనీ తన కంటెంట్ మోడరేషన్ ప్రక్రియలను బలోపేతం చేయడానికి అంగీకరించిందని తెలిపాయి!

కాగా... గ్రోక్ వంటి ఏఐ సేవల ద్వారా అసభ్యకరమైన, అశ్లీల కంటెంట్ ఉత్పత్తిపై ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆందోళన వ్యక్తం చేస్తూ... జనవరి 2న అన్ని అసభ్యకరమైన, అశ్లీలమైన, చట్టవిరుద్ధమైన కంటెంట్‌ ను.. ముఖ్యంగా గ్రోక్ ద్వారా ఉత్పన్నమయ్యే వాటిని వెంటనే తొలగించాలని "ఎక్స్" ను ఆదేశించింది! ఇదే సమయంలో.. పాటించడంలో విఫలమైతే ఐటీ చట్టం, ఇతర చట్టాల ప్రకారం చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించింది!

వాస్తవానికి ఎక్స్ ద్వారా యాక్సెస్ చేయగల గ్రోక్ చాట్ బాట్ పై గత కొన్ని వారాలుగా పలు అభ్యర్థనలు వస్తున్నాయని అంటున్నారు. ఇందులో భాగంగా... ఇమేజ్ ఎడిటింగ్ ఆప్షన్ ద్వారా మహిళల ఫోటోలను అసభ్యకరంగా మారుస్తున్నారని అంటున్నారు. మరికొన్ని సందర్భంగా కొన్ని చిత్రాల్లో పిల్లలపైనా ఈ దుర్మార్గ పనులకు ఒడిగడుతున్నారని చెబుతున్నారు. దీంతో.. ప్రధానంగా భారత్, యూకే సహా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల ప్రభుత్వాలు దీన్ని ఖండించాయి. తక్షణ చర్యలను కోరాయి.

ఈ నేపథ్యంలో గ్రోక్ స్పందిస్తూ.. ఇమేజ్ జనరేషన్, ఎడిటింగ్ ఫీచర్ ప్రస్తుతం పెయిడ్ సబ్ స్క్రైబర్ లకు మాత్రమే పరిమితం చేయబడిందని.. ఈ ఫీచర్ లను అన్ లాక్ చేయడానికి మీరు సబ్ స్క్రైబ్ చేసుకోవచ్చని పేర్కొంది! అయితే.. ఈ నిర్ణయాన్ని పలు దేశాలు ఖండించాయి. ఈ పనికి పూనుకున్న వినియోగదారుడు.. పెయిడ్ సబ్ స్క్రైబరా, ఫ్రీ సబ్ స్క్రైబరా అనే విషయంలో తమకు ఎలాంటి తారతమ్యాలు ఉండవని.. చెబుతూ గ్రోక్ తాజా నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. మస్క్ తాజా నిర్ణయం తీసుకున్నారు.