Begin typing your search above and press return to search.

ఆ బ్యాచ్ కు షాక్ ఇచ్చినట్లే ఇచ్చిన 'గ్రోక్'.. ట్విస్ట్ ఏమిటంటే..!

అవును... ఏఐ చాట్ బాట్ గ్రోక్ ను ఉపయోగించి మహిళల లైంగిక చిత్రాలను అనధికారికంగా సృష్టిస్తున్నందుకు ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యవహారంపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే.

By:  Raja Ch   |   10 Jan 2026 11:12 AM IST
ఆ బ్యాచ్ కు షాక్ ఇచ్చినట్లే ఇచ్చిన గ్రోక్.. ట్విస్ట్ ఏమిటంటే..!
X

ఇటీవల కాలంలో, ప్రధానంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంట్రీ అనంతరం ఫోటో, వీడియో ఎడిటింగ్ లతో మహిళలను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారని.. వారి వ్యక్తిగత జీవితాన్ని భ్రష్టు పట్టించే పనికి పూనుకుంటున్నారనే విమర్శలు, దీనిపై తీవ్ర ఆందోళనలు రోజు రోజుకీ పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ బాట్ గ్రోక్ ఇమేజ్ ఎడిట్ ఫీచర్ విషయంలో మస్క్ ఆసక్తికర నిర్ణయం తీసుకోగా.. ఇందులో ఆర్థికపరమైన అంశాలతో కూడిన ట్విస్ట్ ఉందనే చర్చా తెరపైకి రావడం గమనార్హం.

అవును... ఏఐ చాట్ బాట్ గ్రోక్ ను ఉపయోగించి మహిళల లైంగిక చిత్రాలను అనధికారికంగా సృష్టిస్తున్నందుకు ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యవహారంపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ఎలాన్ మస్క్ సోషల్ మీడియా దిగ్గజం "ఎక్స్" ఇప్పుడు ఈ ఇమేజ్ ఎడిటింగ్ ఫీచర్ ను పరిమితం చేసింది. అయితే... ‘ఎక్స్’ చెల్లింపుదారులకు మాత్రం దాన్ని అందుబాటులో ఉంచింది. అయితే ఈ వ్యూహాత్మక మార్పుపై ప్రపంచ దేశాల ప్రభుత్వాలు పెదవి విరుస్తూ, అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

వాస్తవానికి ఎలాన్ మస్క్ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ఎక్స్ ద్వారా యాక్సెస్ చేయగల ఈ చాట్ బాట్ పై గత కొన్ని వారాలుగా పలు అభ్యర్థనలు వస్తున్నాయని అంటున్నారు. ఇందులో భాగంగా... ఇమేజ్ ఎడిటింగ్ ఆప్షన్ ద్వారా మహిళల ఫోటోలను అసభ్యకరంగా మారుస్తున్నారని అంటున్నారు. మహిళలను బికినీలలో లేదా లైంగికంగా అసభ్యకరమైన స్థానాల్లో ఉంచడం చేస్తున్నారని.. మరికొన్ని సందర్భంగా కొన్ని చిత్రాల్లో పిల్లలపైనా ఈ దుర్మార్గ పనులకు ఒడిగడుతున్నారని చెబుతున్నారు. దీంతో.. భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు దీన్ని ఖండించాయి.

ఈ నేపథ్యంలో గ్రోక్ స్పందించింది. ఇందులో భాగంగా... ఇమేజ్ జనరేషన్, ఎడిటింగ్ ఫీచర్ ప్రస్తుతం పెయిడ్ సబ్ స్క్రైబర్ లకు మాత్రమే పరిమితం చేయబడిందని.. ఈ ఫీచర్ లను అన్ లాక్ చేయడానికి మీరు సబ్ స్క్రైబ్ చేసుకోవచ్చని పేర్కొంది! అయితే.. ఈ నిర్ణయాన్ని పలు దేశాలు ఖండిస్తున్నాయి. ఈ పనికి పూనుకున్న వినియోగదారుడు.. పెయిడ్ సబ్ స్క్రైబరా, ఫ్రీ సబ్ స్క్రైబరా అనే విషయంలో తమకు ఎలాంటి తారతమ్యాలు ఉండవని.. చెబుతూ గ్రోక్ తాజా నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.

ఇదే సమయంలో ఈ నిర్ణయం మహిళలను అగౌరవ పరిచేదిగా ఉందని.. ఇలాంటి ఫీచర్స్ ని పే వాల్ వెనుక ఉంచినా పెద్దగా మార్పు ఉండకపోవచ్చని.. కాకపోతే ఈ నిర్ణయం కంపెనీకి మాత్రం ఆర్ధికంగా కొంత సహకరించే అవకాశం మాత్రం పుష్కలంగా ఉంటుందని చెబుతున్నారు. మరి దీనిపై ఎలాన్ మస్క్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది వేచి చూడాలి.