Begin typing your search above and press return to search.

పబ్లిక్ స్కూళ్లలో హెచ్-1బీ ఉద్యోగాలపై టెక్సాస్ గవర్నర్ కీలక నిర్ణయం

టెక్సాస్ రాష్ట్ర గవర్నర్ గ్రెగ్ అబాట్ పబ్లిక్ స్కూళ్లలో హెచ్-1బీ వీసాల ద్వారా విదేశీ ఉపాధ్యాయులను నియమించడాన్ని పూర్తిగా నిలిపివేయాలని సంచలన ప్రతిపాదన చేశారు.

By:  A.N.Kumar   |   19 Aug 2026 10:28 AM IST
పబ్లిక్ స్కూళ్లలో హెచ్-1బీ ఉద్యోగాలపై టెక్సాస్ గవర్నర్ కీలక నిర్ణయం
X

అమెరికాలో హెచ్-1బి వీసాల వినియోగంపై మరోసారి తీవ్రమైన చర్చ మొదలైంది. టెక్సాస్ రాష్ట్ర గవర్నర్ గ్రెగ్ అబాట్ పబ్లిక్ స్కూళ్లలో హెచ్-1బీ వీసాల ద్వారా విదేశీ ఉపాధ్యాయులను నియమించడాన్ని పూర్తిగా నిలిపివేయాలని సంచలన ప్రతిపాదన చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో హెచ్-1బీ వీసా ఉద్యోగుల సంఖ్య పూర్తిగా నిరోధించి "సున్నా"కు చేర్చాలన్నదే తన ముఖ్య లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఫెడరల్ ప్రభుత్వం హెచ్-1బి వీసా విధానాన్ని సరిగ్గా నియంత్రించడంలో విఫలమైందని.. అందుకే విద్యార్థుల ప్రయోజనాలు.. స్థానిక ఉద్యోగాల రక్షణ కోసం రాష్ట్ర స్థాయిలో ఈ కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తోందని అబాట్ వ్యాఖ్యానించారు.

ప్రస్తుతం టెక్సాస్‌తో పాటు అమెరికాలోని పలు పాఠశాల జిల్లాలు తీవ్రమైన ఉపాధ్యాయుల కొరతను ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా ద్విభాషా విద్య, గణితం, సైన్స్ బోధన, ప్రత్యేక విద్య వంటి విభాగాలు దీనిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇటువంటి ప్రత్యేక నైపుణ్యాలు అవసరమైన రంగాల్లో స్థానికంగా తగినంత మంది ఉపాధ్యాయులు అందుబాటులో లేకపోవడంతో పాఠశాల జిల్లాలు హెచ్-1బీ వీసాల ద్వారా విదేశీ నిపుణులను, ముఖ్యంగా భారత్ వంటి దేశాల నుంచి ఉపాధ్యాయులను నియమించుకుంటున్నాయి. గణాంకాల ప్రకారం.. టెక్సాస్‌లోని డల్లాస్ ఇండిపెండెంట్ స్కూల్ డిస్ట్రిక్ట్ లో అత్యధికంగా సుమారు 171 మంది హెచ్-1బీ వీసా ఉద్యోగులు సేవలందిస్తున్నారు. విద్యా రంగంలో హెచ్-1బీ ఉద్యోగులను నియమించుకోవడంలో అమెరికాలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే టెక్సాస్ చాలా ముందంజలో ఉంది.

గవర్నర్ అబాట్ ప్రతిపాదిస్తున్న ఈ కొత్త నిబంధనలు కేవలం భవిష్యత్తు నియమకాలకే పరిమితం కాకుండా, ప్రస్తుతం పబ్లిక్ స్కూళ్లలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకూ వర్తించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒకవేళ ఈ ప్రతిపాదన చట్టంగా మారితే ఇప్పటికే టెక్సాస్ ప్రభుత్వ పాఠశాలల్లో సేవలందిస్తున్న వందలాది మంది విదేశీ ఉపాధ్యాయుల ఉద్యోగ భవిష్యత్తు తీవ్ర ప్రశ్నార్థకంగా మారనుంది. అయితే ఈ ప్రతిపాదన తక్షణమే అమల్లోకి రాదు. దీనికి టెక్సాస్ లెజిస్లేచర్ ఆమోదం తప్పనిసరి. రాబోయే శాసనసభ సమావేశాల్లో ఈ బిల్లుపై చర్చించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

ఈ నిర్ణయంపై ప్రస్తుతం రాష్ట్రంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు స్థానిక అమెరికన్లకే పబ్లిక్ స్కూళ్లలో మొదటి ప్రాధాన్యం దక్కాలని.. స్థానిక ఉపాధ్యాయులను ప్రోత్సహించడం కోసమే గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నారని ఒక వర్గం మద్దతు ఇస్తోంది. మరోవైపు ఇప్పటికే ఉపాధ్యాయుల కొరతతో సతమతమవుతున్న పబ్లిక్ స్కూళ్లలో విదేశీ బోధకులను పూర్తిగా నిషేధిస్తే ద్విభాషా విద్య, ప్రత్యేక బోధనా విభాగాలు తీవ్రంగా దెబ్బతింటాయని.. తద్వారా విద్యార్థుల చదువుపై ప్రతికూల ప్రభావం పడుతుందని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వచ్చే శాసనసభ సమావేశాల్లో టెక్సాస్ లెజిస్లేచర్ దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో.. ఇది టెక్సాస్ విద్యా వ్యవస్థలో ఎలాంటి మార్పులకు దారితీస్తుందో వేచి చూడాల్సి ఉంది.