Begin typing your search above and press return to search.

గ్రీన్ ల్యాండ్ లో గ్రీన్.. ఐస్ ల్యాండ్ లో ఐస్ ఉండ‌దు.. అదే విశేషం

కొన్ని రోజులుగా ప్ర‌పంచం అంత‌టా చ‌ర్చ‌నీయం అవుతున్న‌ పేరు గ్రీన్ ల్యాండ్. ప్ర‌పంచంలోనే అతి పెద్ద ద్వీపం. అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట‌ల్లో చెప్పాలంటే ఓ ఐస్ ముక్క‌.

By:  Tupaki Political Desk   |   23 Jan 2026 4:00 PM IST
గ్రీన్ ల్యాండ్ లో గ్రీన్.. ఐస్ ల్యాండ్ లో ఐస్ ఉండ‌దు.. అదే విశేషం
X

కొన్ని రోజులుగా ప్ర‌పంచం అంత‌టా చ‌ర్చ‌నీయం అవుతున్న‌ పేరు గ్రీన్ ల్యాండ్. ప్ర‌పంచంలోనే అతి పెద్ద ద్వీపం. అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట‌ల్లో చెప్పాలంటే ఓ ఐస్ ముక్క‌. కానీ, ఈ ద్వీపం ప్ర‌త్యేక‌త‌లు చాలానే ఉన్నాయి. అపార‌మైన స‌హ‌జ వ‌న‌రుల‌తో పాటు నేచ‌ర్ ఇచ్చిన వ‌రం గ్రీన్ ల్యాండ్ అనుకోవాలి. ఇక్క‌డి జ‌నాభా చాలా త‌క్కువ కానీ.. అందాల‌కు ఏమాత్రం త‌క్కువ కాదు. అయితే, ఈ ద్వీపంతో పాటు చెప్పుకొనే మ‌రో విశేషం కూడా ఉంది. అదే.. గ్రీన్ ల్యాండ్ లో గ్రీన్ ఉండ‌దు .. ఐస్ ల్యాండ్ లో ఐస్ ఉండ‌దు అని. ఇక్క‌డ ఐస్ ల్యాండ్ ప్ర‌స్తావ‌న ఎందుకంటే ఈ గ్రీన్ ల్యాండ్ తో ఒక‌ప్పుడు సంబంధం ఉన్న ప్రాంతం కాబ‌ట్టి. 2.16 మిలియ‌న్ చ‌ద‌ర‌పు కిలోమీట‌ర్ల విస్తీర్ణంలో ఉండే ఈ ద్వీపం 80 శాతం మంచుతోనే ఉంటుంది. పేరు గ్రీన్ ల్యాండ్ అయినా ప‌చ్చ‌ద‌నం చాలా త‌క్కువ‌. దాదాపు 60 వేల మంది జ‌నాభా ఉన్న ఈ ప్రాంతంలో ఏడాదిలో 10 నెల‌లు సూర్యుడే క‌నిపించ‌డు.

ఖండం ఉత్త‌ర‌ అమెరికా.. పెత్త‌నం డెన్మార్క్

గ్రీన్ ల్యాండ్ ఏం ఖండంలో ఉంది..? అంటే ఉత్త‌ర అమెరికా అని చెప్పాలి. అమెరికా, కెన‌డా త‌దిత‌ర దేశాల‌తో కూడిన ఈ ఖండంలో ఉన్న‌ప్ప‌టికీ గ్రీన్ ల్యాండ్ పై పెత్త‌నం డెన్మార్క్ ది. అయితే, స్వ‌యం ప్ర‌తిప‌త్తి క‌లిగి ఉంది. మ‌త్స్య ప‌రిశ్ర‌మ మిన‌హా మిగ‌తావి గ్రీన్ ల్యాండ్ లో ఉండ‌వు. ఏం కావాల‌న్నా దిగుమ‌తి చేసుకోవ‌డ‌మే. మంచు కార‌ణంగా రోడ్లు వేయ‌డం అనేది అసాధ్యం. అందుక‌ని, ఊళ్లు, ప‌ట్ట‌ణాల్లోనే రోడ్లుంటాయి. ప్ర‌జ‌లంతా స‌ముద్ర తీరంలోనే నివ‌సిస్తుంటారు. బోట్లు, విమానాలు, హెలికాప్ట‌ర్లే ర‌వాణా సాధానాలు. మే-జూలై మ‌ధ్య‌లో గ్రీన్ ల్యాండ్ లో సూర్యుడు అస్త‌మించ‌డు. ఈ స‌మ‌యంలోనే ఒక్క‌సారైనా చూసి రావాల‌ని చెబుతుంటారు.

న్యూస్ లో ఎయిర్ పోర్టు.. కానీ, 300 కి.మీ.

గ్రీన్ ల్యాండ్ లో అతిపెద్ద న‌గ‌రం దాని రాజ‌ధాని న్యూక్. 60 వేల జ‌నాభాలో 20 వేల‌మంది దాక ఇక్క‌డే నివ‌సిస్తుంటారు. మ్యూజియాలు, కేఫ్ లు, ఫ్యాష‌న్ దుకాణాల‌కు బాగా ప్ర‌సిద్ధి. ఇక గ్రీన్ ల్యాండ్ కు ఆ పేరు ఐస్ ల్యాండ్ వాసి కార‌ణంగానే వ‌చ్చింది. ఐస్ ల్యాండ్ అంటే.. సైన్యం కూడా లేని ప్ర‌శాంత‌మైన దేశం. ఉత్త‌ర అట్లాంటిక్ మ‌హా స‌ముద్రంలో ఉండే ఈ దేశం నుంచి క్రీస్తుశ‌కం 900ల్లో ఎరిక్ ది రెడ్ అనే అన్వేష‌కుడిని బ‌హ‌రిష్క‌రించారు. అత‌డు గ్రీన్ ల్యాండ్ వ‌చ్చి స్థిర‌ప‌డ్డాడు. అప్పుడు ప‌చ్చ‌టి సౌత్ గ్రీన్ ల్యాండ్ అత‌డి కంట‌ప‌డింది. దీంతో గ్రీన్ ల్యాండ్ అని పేరు పెట్టారు. ఇక న్యూక్ కు 300 కిలోమీట‌ర్ల దూరంలోని కాంగెర్లుసాక్ లో గ్రీన్ ల్యాండ్ విమానాశ్ర‌యం ఉండ‌గా.. ఐస్ ల్యాండ్ నుంచి, గ్రీన్ ల్యాండ్ నుంచి విమానాల రాక‌పోక‌లు జ‌రుగుతుంటాయి.

సంగీత ప్రియులు..

గ్రీన్ ల్యాండ్ వాసులు సంగీత ప్రియులు. వీరి భాష గ్రీన్ ల్యాండిక్. ఏడాదంతా సంగీత కార్య‌క్ర‌మాలు జ‌రుగుతాయి. ఏటా సంగీతోత్స‌వాలు నిర్వ‌హిస్తుంటారు. 10 నెల‌లు మంచుతో క‌ప్ప‌బ‌డి ఉంటుంది క‌నుక గ్రీన్ ల్యాండ్ లోని భ‌వ‌నాల‌కు వివిధ రంగులు వేస్తుంటారు. సులువుగా గుర్తుప‌ట్టేందుకు ఈ ఆలోచ‌న అన్న‌మాట‌.